తెలంగాణ

telangana

ఐపీఎల్​కు భారీగా ఆదాయం.. రికార్డు వ్యూయర్​షిప్​

By

Published : Nov 23, 2020, 1:51 PM IST

Updated : Nov 23, 2020, 2:34 PM IST

కరోనా ప్రభావమున్న ఈసారి ఐపీఎల్​ను విజయవంతంగా నిర్వహించింది బీసీసీఐ. అయితే ఖర్చులు తగ్గించుకున్నా సరే భారీగానే ఆదాయాన్ని ఆర్జించింది. ఇంతకీ ఆ మొత్తం ఎంతంటే?

BCCI earned RS.4,000 crore in revenue from IPL 2020, TV viewership up by 25%
ఖర్చులు తగ్గినా సరే ఐపీఎల్​కు భారీగానే ఆదాయం

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ ఐపీఎల్‌ లాంటి మెగా టీ20 క్రికెట్‌ లీగ్‌ నిర్వహించి అందరి చేతా శెభాష్‌ అనిపించుకుంది బీసీసీఐ. ఏటా వేసవి కాలంలో భారత్‌లో నిర్వహించే ఈ లీగ్‌.. కరోనా పరిస్థితుల ప్రభావంతో ఈసారి యూఏఈకి తరలివెళ్లింది. సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 10 వరకు 50 రోజులకు పైగా క్రికెట్‌ ప్రేమికుల్ని అలరించింది. అయితే, ఎప్పుడూ అభిమానుల కేరింతలతో ఉత్సాహభరితంగా కనిపించే మైదానాలు ఈసారి ఎవరూ లేక వెలవెలబోయాయి. అయినా ఆ లోటు కనిపించకుండా నిర్వాహకులు వర్చువల్‌ పద్ధతిలో ఉత్సాహపరిచారు. ఇలాంటి‌ పరిస్థితుల్లో ఇంత పెద్ద టోర్నీ నిర్వహించడం సాధ్యమేనా అనుకునే తరుణంలో బీసీసీఐ దిగ్విజయంగా పూర్తి చేయడమే కాకుండా మంచి ఆదాయాన్ని ఆర్జించిందని కోశాధికారి అరుణ్‌ ధుమాల్‌ పేర్కొన్నారు.

బీసీసీఐ బృందం

ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడిన ఆయన.. టోర్నీ నిర్వహణ, దాని ఆదాయంపై స్పందించారు. ఈ సీజన్‌ నిర్వహించడంపై తొలుత అందరూ అనుమానాలు వ్యక్తం చేశారని, కానీ ప్రధాన కార్యదర్శి జైషా ధైర్యం చేసి ముందడుగు వేశారని చెప్పారు. చెన్నై జట్టులో కరోనా కేసులు రావడం వల్ల అప్పుడు కాస్త ఆలోచించామన్నారు. వారికి లక్షణాలు లేకపోవడం వల్ల ఐసోలేషన్‌లో ఉంచామని, తర్వాత ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనించామని చెప్పారు. ప్రత్యేక వైద్య బృందాలతో పర్యవేక్షించినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్లంతా కోలుకున్నాక టోర్నీని దిగ్విజయంగా కొనసాగించినట్లు వివరించారు. అయితే, ఈ సీజన్‌ నిర్వహణ మొత్తంలో 35 శాతం ఖర్చులు తగ్గించుకున్నట్లు తెలిపారు. బీసీసీఐ సుమారు 4 వేల కోట్ల ఆదాయం పొందిందని, అలాగే గతేడాదితో పోలిస్తే ఈసారి టీవీ, డిజిటల్‌ మాధ్యమాల వీక్షకుల సంఖ్య 25 శాతం పెరిగిందని వివరించారు. టోర్నీ జరిగినన్ని రోజులు అన్ని ఫ్రాంఛైజీల వారికి మొత్తం 30 వేల ఆర్టీ-పీసీఆర్‌ కొవిడ్‌ టెస్టులు నిర్వహించినట్లు అరుణ్‌ వెల్లడించారు.

ట్రోఫీతో ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ
Last Updated :Nov 23, 2020, 2:34 PM IST

ABOUT THE AUTHOR

...view details