తెలంగాణ

telangana

ఆసీస్ మాటల యుద్ధం.. అప్పుడే పిచ్​పై ప్రశ్నలు.. మళ్లీ స్లెడ్జింగ్ స్టార్ట్?

By

Published : Feb 5, 2023, 8:49 AM IST

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ అంటే చాలు.. ఆట కంటే ముందు మాటల దాడి మొదలవుతుంది. ప్రత్యర్థిని కవ్వించేలా ఏదో ఒకటి అనడం, ఆత్మరక్షణలోకి నెట్టడం, మానసికంగా పైచేయి సాధించే ప్రయత్నం చేయడం.. కంగారూ మాజీలు, కోచ్‌లు, ప్రస్తుత ఆటగాళ్లు కలిసి వేసే వ్యూహాత్మక ఎత్తుగడ ఇది. ఏదైనా సిరీస్‌ కఠినంగా ఉండబోతోందంటే మాటల దాడి తీవ్రత మరింత పెరుగుతుంది. మరి కొన్ని రోజుల్లో భారత్‌తో మొదలయ్యే కీలక సిరీస్‌ ముంగిట కూడా కంగారూలు అదే పని చేస్తుండడం గమనార్హం.

India Vs Australia Test Series 2023
India Vs Australia Test Series 2023

ప్రపంచ క్రికెట్లో స్లెడ్జింగ్‌ అనే మాట వినగానే గుర్తుకొచ్చేది ఆస్ట్రేలియా ఆటగాళ్లే. ఒకప్పుడు తమ ఆటతోనే కాక మాటల దాడితోనూ ప్రత్యర్థులను కుంగదీసి పైచేయి సాధించేది కంగారూ జట్టు. అయితే 2008 నాటి 'మంకీ గేట్‌' ఉదంతం ఆసీస్‌ను ఆత్మరక్షణలోకి నెట్టడం, దీనికి తోడు ఆ జట్టు ప్రదర్శన కూడా పడిపోవడంతో నెమ్మదిగా ఈ మాటల దాడిని పక్కన పెట్టేశారు. మళ్లీ మధ్యలో కొంచెం దూకుడు పెరిగినా.. 2018లో బాల్‌ టాంపరింగ్‌ కుంభకోణం పుణ్యమా అని కంగారూ ఆటగాళ్లు మళ్లీ వెనుకంజ వేయక తప్పలేదు.

ఆస్ట్రేలియాలో పర్యటించిన గత రెండు సందర్భాల్లోనూ భారత ఆటగాళ్లు కంగారూలకు ఆటతో, మాటతో దీటైన సమాధానం చెప్పి నోరెత్తకుండా చేశారు. అయితే ఇటీవల ఆస్ట్రేలియా ప్రదర్శన మెరుగుపడింది. వరుసగా సిరీస్‌ విజయాలు సాధిస్తూ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు భారత్‌కే కాక ఆ జట్టుకూ ఇప్పుడు జరగబోయేదే చివరి సిరీస్‌. ఇందులోనూ పైచేయి సాధించి సగర్వంగా ఫైనల్‌ చేరాలన్నది కంగారూల ఆకాంక్ష. అంతే కాక భారత గడ్డపై టెస్టు సిరీస్‌ పరాజయాల పరంపరకు అడ్డుకట్ట వేయాలని కూడా ఆశిస్తోంది.

ఈ క్రమంలోనే సిరీస్‌ ముంగిట ఆస్ట్రేలియా ఆటగాళ్లు, మాజీలు తమ మాటలతో భారత్‌ను ఆత్మరక్షణలోకి నెట్టాలని చూస్తున్నారు. ఇందులో భాగంగానే ముందుగా కంగారూలు 'పిచ్‌' చర్చకు తెరతీశారు. ఆసీస్‌ వార్మప్‌ మ్యాచ్‌లు వద్దనుకోవడానికి కారణం.. ప్రాక్టీస్‌ కోసం పచ్చిక పిచ్‌ ఇచ్చి, అసలు మ్యాచ్‌లో స్పిన్‌ వికెట్‌తో దెబ్బ కొడుతుండడమే అని స్టార్‌ బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్‌తో పాటు మాజీ ఆటగాడు ఇయాన్‌ హీలీ వ్యాఖ్యానించారు. గతంలో మూడో రోజు కానీ భారత పిచ్‌లు స్పిన్‌కు సహకరించేవి కావని, ఇప్పుడు తొలి రోజు నుంచి బంతి బాగా తిరిగేలా పిచ్‌లు సిద్ధం చేస్తున్నారని, అందుకే భారత్‌ సునాయాసంగా గెలుస్తోందన్న వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు కంగారూలు.

సమతూకంతో ఉన్న పిచ్‌ ఉంటే ఆస్ట్రేలియా గెలుస్తుందని, స్పిన్‌ పిచ్‌ అయితే భారత్‌దే గెలుపని కూడా కంగారూలు అంటున్నారు. ఈ వ్యాఖ్యల ప్రభావంతో పిచ్‌ మరీ స్పిన్‌కు అనుకూలంగా ఉండకుండా చూస్తారేమో అన్న ఆలోచన కంగారూలది కావచ్చు. ఒకవేళ పిచ్‌ స్పిన్నర్ల స్వర్గధామంగా ఉండి ఆసీస్‌ ఓడిపోతే, మేం ముందే చెప్పాం అనడానికి కూడా అవకాశముంటుంది. ఇదిలా ఉంటే.. వివాదాల కేంద్రం అయిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ గ్రెగ్‌ ఛాపెల్‌.. మరో రకంగా టీమ్‌ఇండియా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీయాలని చూస్తున్నాడు.

ఇప్పుడు భారత జట్టు ఏమంత బలంగా లేదని, ఆస్ట్రేలియాదే సిరీస్‌ అని అతను తేల్చేశాడు. రిషబ్‌ పంత్‌తో పాటు జడేజా, బుమ్రా ఫిట్‌నెస్‌ సమస్యలు ఎదుర్కొంటున్నారని, సిరీస్‌లో కోహ్లి మీద జట్టు ఎక్కువ ఆధారపడబోతోందని చాపెల్‌ పేర్కొన్నాడు. పిచ్‌లు స్పిన్‌కు అనుకూలించినా ఇబ్బందేం లేదని అస్టాన్‌ అగర్‌ సహా నాణ్యమైన స్పిన్నర్లు ఆసీస్‌కు ఉన్నారని చాపెల్‌ వ్యాఖ్యానించాడు. అయితే పిచ్‌ల గురించి ఆస్ట్రేలియన్ల ఆరోపణలు, మాటల దాడిని భారత స్పిన్నర్‌ అశ్విన్‌ గట్టిగానే తిప్పికొట్టాడు.

"ఇంగ్లాండ్‌కు వెళ్తే మేం కూడా ప్రతిసారీ రెండు వార్మప్‌ మ్యాచ్‌లు ఆడేవాళ్లం. కానీ 2017లో అక్కడికి వెళ్లినపుడు ఒక్కటీ ఆడలేదు. ఇదంతా షెడ్యూల్‌ను బట్టే ఉంటుంది. ఆస్ట్రేలియా వార్మప్‌ మ్యాచ్‌లు ఆడకపోవడం కూడా కొత్త కాదు. ప్రత్యర్థులను ఆత్మరక్షణలోకి నెట్టేలా వ్యూహాత్మకంగా మాట్లాడడం ఆస్ట్రేలియాకు అలవాటే" అని అశ్విన్‌ అన్నాడు.

ABOUT THE AUTHOR

...view details