తెలంగాణ

telangana

IPL 2022: హ్యాట్రిక్ వికెట్ల వీరులు వీరే.. రోహిత్​ శర్మ సహా..

By

Published : Mar 24, 2022, 2:14 PM IST

IPL 2022: టీ20 క్రికెట్‌ అంటేనే రసవత్తర మ్యాచ్‌లకు అసలైన వేదిక. ఇలాంటి ఆటలో ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ధాటిగా ఆడే బ్యాటర్​ ఊహించని విధంగా ఔటవ్వచ్చు. ధారాళంగా పరుగులిచ్చే బౌలర్‌ అనూహ్యంగా వికెట్లు సాధించొచ్చు. దీంతో క్షణాల్లో మ్యాచ్‌ల ఫలితాలే తారుమారు అవ్వచ్చు. అలా ఐపీఎల్‌లోనూ ఉన్నపళంగా చెలరేగి రెప్పపాటులో ఫలితాలను తలకిందులు చేసిన హ్యాట్రిక్‌ వికెట్ల వీరులూ ఉన్నారు. రెండు రోజుల్లో 15వ సీజన్‌ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఐపీఎల్‌లో ఎవరెవరు హ్యాట్రిక్‌లు సాధించారు. వారి విశేషాలేంటో తెలుసుకుందాం.

IPL 2022
IPL hattrick records

IPL 2022: ఐపీఎల్​లో ప్రతీ బంతిని బౌండరీ దాటించాలనుకుంటారు బ్యాటర్లు. వారి అంచనాలకు మించి బంతులు వేస్తుంటారు బౌలర్లు. ఇలాంటి బంతులేసే.. అనేక మంది బౌలర్లు హ్యాట్రిక్​ వికెట్లు సాధించారు. ఐపీఎల్​ 2022 ప్రారంభం కానున్న తరుణంలో గత సీజన్​లలో హ్యాట్రిక్​ వికెట్లతో అలరించినవారిపై వారిపై ఓ లుక్కేయండి.

బాలాజీ @ తొలి బౌలర్‌

లక్ష్మీపతి బాలాజి

చెన్నై సూపర్‌ కింగ్స్‌ మాజీ పేసర్‌ లక్ష్మీపతి బాలాజి ఐపీఎల్‌లో తొలి హ్యాట్రిక్‌ వికెట్లు సాధించిన బౌలర్‌గా చరిత్రకెక్కాడు. 2008 ఆరంభ సీజన్‌లోనే అతడు కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌తో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో (5/24) మెరుగైన బౌలింగ్‌ చేశాడు. అప్పుడు అతడు చివరి ఓవర్‌లో ఇర్ఫాన్ పఠాన్‌ (40), పీయుష్‌ చావ్లా (17), విక్రమ్‌ సింగ్‌లను(0) వరుస బంతుల్లో పెవిలియన్‌ పంపాడు.

అమిత్‌ అత్యధికంగా..

అమిత్​ మిశ్రా

ఐపీఎల్‌లో అత్యధికంగా మూడు సార్లు హ్యాట్రిక్‌ సాధించిన ఏకైక బౌలర్‌, ప్రముఖ లెగ్‌ స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా. అతడు 2008లో దిల్లీ డేర్‌డెవిల్స్‌ తరఫున ఆడగా.. అప్పటి డెక్కన్‌ ఛార్జర్స్‌పై (5/17) తొలిసారి హ్యాట్రిక్‌ వికెట్లు సాధించాడు. ఆపై 2011లో పంజాబ్‌ జట్టుపైనా (4/9) రెండోసారి వరుసగా హ్యాట్రిక్‌ సాధించాడు. ఇక 2013లో సన్‌రైజర్స్‌ తరఫున ఆడుతూ.. పుణె వారియర్స్‌పై (4/19) చివరిసారి ఆ ఘనత సాధించాడు.

ఒకేసారి యువరాజ్‌..

యువరాజ్​ సింగ్​

ఇక మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ ఐపీఎల్‌లో రెండుసార్లు హ్యాట్రిక్‌ సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. అయితే, ఒకే టోర్నీలో యువీ ఇలా రెండుసార్లు హ్యాట్రిక్‌ ప్రదర్శన చేయడం గొప్ప విశేషం. 2009లో పంజాబ్‌ తరపున ఆడిన అతడు తొలుత రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుపై (3/22), తర్వాత డెక్కన్‌ ఛార్జర్స్‌పై (3/13) గణాంకాలు నమోదు చేశాడు.

రోహిత్‌ మేటి..

రోహిత్​ శర్మ

ఐపీఎల్‌లో హ్యాట్రిక్‌ వీరుల జాబితాలో ప్రస్తుత ముంబయి ఇండియన్స్‌ సారథి రోహిత్‌ శర్మది అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శన కావడం విశేషం. 2009లో డెక్కన్‌ ఛార్జర్స్‌ తరఫున ఆడిన అతడు ముంబయి ఇండియన్స్‌పై ఈ ఘనత సాధించాడు. కేవలం 2 ఓవర్లే బౌలింగ్‌ చేసిన రోహిత్‌ 6 పరుగులిచ్చి మొత్తం 4 వికెట్లు తీశాడు. దీంతో ఐపీఎల్‌లో హ్యాట్రిక్‌ వీరుల జాబితాలో మేటి బౌలింగ్‌ ప్రదర్శన చేసిన ఆటగాడిగా నిలిచాడు.

సామ్‌ కరణ్‌ - సామ్యూల్‌ బద్రీ..

సామ్​ కరన్​

ఐపీఎల్‌ హ్యాట్రిక్‌ బౌలర్లలో రోహిత్‌ తర్వాత అత్యంత మెరుగైన ప్రదర్శన చేసింది సామ్యూల్‌ బద్రీ, సామ్‌ కరణ్‌. 2017లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు బౌలర్‌గా ఉన్న సామ్యూల్‌ ముంబయి ఇండియన్స్‌పై హ్యాట్రిక్‌ సాధించి (4/9) గణాంకాలు నమోదు చేశాడు. ఇక 2019లో పంజాబ్‌ తరఫున ఆడిన సామ్‌ కరణ్‌ దిల్లీ క్యాపిటల్స్‌పై వరుసగా మూడు వికెట్లు తీయడమే కాకుండా (4/11) మెరుగైన బౌలింగ్‌ చేశాడు.

మిగతా బౌలర్ల జాబితా..

హ్యట్రిక్​ బౌలర్ల జాబితా

ఇదీ చదవండి:IPL 2022: ప్రేక్షకులకు అనుమతి.. కానీ!

ABOUT THE AUTHOR

...view details