తెలంగాణ

telangana

లండన్​తో​ రాహుల్​ లవ్​ అఫైర్​.. సెంచరీలతో జోరు!

By

Published : Aug 13, 2021, 12:23 PM IST

టీమ్‌ఇండియా ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌కు లండన్‌ నగరంతో ఏదో ప్రేమబంధం (లవ్‌ అఫైర్‌) ఉన్నట్టుంది! ఎందుకంటే టెస్టుల్లో అతడు చివరి రెండు శతకాలు చేసింది ఈ నగరంలోనే కావడం విశేషం! అదీ మూడేళ్ల అంతరంతో సాధించాడు.

Team India Opener KL Rahul love affair with London
లండన్​తో బ్యాట్స్​మన్​ కేఎల్​ రాహుల్​ లవ్​ అఫైర్​!

మునుపెన్నడూ లేనంత సానుకూల దృక్పథంతో బ్యాటింగ్​ చేస్తున్నాడు టీమ్ఇండియా ఓపెనర్​ కేఎల్‌ రాహుల్‌. తనలోని సొగసరి స్ట్రోక్‌ప్లేను ప్రదర్శిస్తున్నాడు. కళాత్మక షాట్లతో అలరిస్తున్నాడు. నిజానికి టీమ్‌ఇండియాలో విరాట్‌ కోహ్లీ తర్వాత అంతటి ప్రతిభావంతుడు రాహులేనని విశ్లేషకులు అంటారు. ఎందుకో తెలీదు గానీ ఇంగ్లాండ్‌, ప్రత్యేకించి లండన్‌ వాతావరణం అంటే రాహుల్‌కు చాలా ఇష్టమట! ఎండ ఎక్కువగా ఉండదు. అలసట తక్కువ. దాంతో ఎంతసేపైనా క్రీజులో ఉండొచ్చని అతడి అభిప్రాయం.

2018: ఓవల్‌లో 149

సుదీర్ఘ ఫార్మాట్లో రాహుల్‌ తన చివరి రెండు శతకాలు చేసింది లండన్‌లోనే. 2018లో ఓవల్‌ టెస్టులో అతడి పోరాటం ఆకట్టుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో 37కే ఔటైన అతడు రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా 149 పరుగులు చేశాడు. ఇందుకోసం 224 బంతులు ఆడాడు. 20 బౌండరీలు, ఒక సిక్సర్‌ బాదేశాడు. ఏకంగా 348 నిమిషాలు క్రీజులో ఉన్నాడు. మిగతా వాళ్లు విఫలమవుతుంటే రహానెతో కలిసి 118 (193 బంతుల్లో), రిషభ్ పంత్‌తో కలిసి 204 (267 బంతుల్లో) పరుగుల భాగస్వామ్యాలు నెలకొల్పాడు. జట్టు స్కోరు 325 వద్ద ఆరో వికెట్‌గా అతడు పెవిలియన్‌కు చేరుకోగానే 345కు జట్టు ఆలౌటవ్వడం గమనార్హం.

2021: లార్డ్స్‌లో 127*

ప్రస్తుతం ఇంగ్లాండ్​తో టెస్టు సిరీసులో కేఎల్‌ రాహుల్‌ బ్యాటింగ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. నాటింగ్‌హామ్‌ ఫామ్‌ను లార్డ్స్‌లోనూ కొనసాగించాడు. మొదట్లో ఆచితూచి ఆడాడు. వాతావరణం, పరిస్థితులను గమనించాడు. జిమ్మీ అండర్సన్‌ స్వింగ్‌ బౌలింగ్‌ను గౌరవించాడు. అనవసరంగా షాట్లు ఆడలేదు. దేహానికి దగ్గరగా ఆడాడు. తొలి 100 బంతుల్లో 18 పరుగులు చేసిన అతడు అర్ధశతకానికి మరో 37 బంతులే తీసుకున్నాడు. ఆపై మరో 75 బంతుల్లో సెంచరీ కొట్టేశాడు. ఆట ముగిసే సరికి 127* పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇందుకు 248 బంతులు తీసుకున్నాడు. 12 బౌండరీలు, 1 సిక్సర్‌ బాదేశాడు. ఒకవైపు స్ట్రోక్‌ప్లే మరోవైపు బ్యాక్‌ఫుట్‌ పంచ్‌లు, కట్‌షాట్లతో దుమ్మురేపాడు. రెండోరోజూ నిలిస్తే అతడు ద్విశతకం చేయడం ఖాయమే!

వాతవరణం అనుకూలించకున్నా..

ఇంగ్లాండ్‌తో రెండో టెస్టులో టీమ్‌ఇండియా అదరగొడుతోంది. వర్షం కురిసి, మబ్బులు పట్టిన వాతావరణంలోనూ జిమ్మీ అండర్సన్‌, మార్క్‌వుడ్‌, ఒలీ రాబిన్సన్‌ బౌలింగ్‌ను ఉతికారేసింది. తొలిరోజు ఆట ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది. ముఖ్యంగా ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌ (127*; 248 బంతుల్లో 12×4, 1×6), రోహిత్‌ శర్మ (83; 145 బంతుల్లో 11×4, 1×6) తొలి వికెట్‌కు 126 పరుగులు జోడించారు. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న వాతావరణంలో 44 ఓవర్ల వరకు తొలి వికెట్‌ ఇవ్వకపోవడం విశేషం.

మొదట రోహిత్‌ శర్మ తనదైన రీతిలో ఆడాడు. సొగసైన షాట్లతో అలరించాడు. థర్డ్‌మ్యాన్‌ దిశగా అతడు బాదిన బౌండరీలు అద్భుతమనే చెప్పాలి. అతడు ఔటయ్యాక ఇంగ్లాండ్‌కు రాహుల్ చుక్కలు చూపించాడు. తనదైన స్ట్రోక్‌ప్లేతో మురిపించాడు. చూడచక్కని కట్‌షాట్లు, బ్యాక్‌ఫుట్‌ పంచ్‌లతో బౌండరీలు బాదేశాడు. మరోవైపు కెప్టెన్​ విరాట్‌ కోహ్లీ (42; 103 బంతుల్లో 3×4) కూడా రాణించాడు.

ఇదీ చూడండి..మంజ్రేకర్​ మాటల వల్లనే రోహిత్​ ఔటయ్యాడా?

ABOUT THE AUTHOR

...view details