తెలంగాణ

telangana

'ప్రత్యర్థి పని పట్టాలంటే వాళ్లకు 10 నిమిషాలు చాలు'

By

Published : Aug 12, 2020, 4:31 PM IST

రిషభ్​ పంత్​, సంజూ శాంసన్​.. భారత భవిష్యత్తు ఆశాకిరణాలు. అయితే అద్భుతమైన ఆటతీరు కలిగిన వీరిద్దరూ.. ఐపీఎల్​లో రాణించాలని సూచించారు మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్. వరుసగా రెండు ఐపీఎల్‌ సీజన్లలో రాణిస్తే వీరిద్దరూ ఐసీసీ టీ20 ప్రపంచకప్‌-2021లో చోటు దక్కించుకొనే అవకాశం ఉంటుందని క్రికెట్​ విశ్లేషకులు భావిస్తున్నారు.

sanjay manjrekar latest news
'ప్రత్యర్థి పని పట్టాలంటే వాళ్లకు 10 నిమిషాలు చాలు'

టీమ్‌ఇండియా యువ క్రికెటర్లు రిషభ్‌ పంత్‌, సంజూ శాంసన్‌ అద్భుతమైన ప్రతిభావంతులని అన్నారు మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్. నిమిషాల వ్యవధిలోనే మ్యాచ్​ల గమనాన్ని మార్చేసే వీరిద్దరూ నిలకడగా ఆడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ ద్వయం అప్పుడప్పుడూ సందేహాస్పదంగా కనిపిస్తారని పేర్కొన్నారు. స్టార్‌స్పోర్ట్స్‌ క్రికెట్‌ కనెక్టెడ్‌ కార్యక్రమంలో మంజ్రేకర్‌ మాట్లాడారు.

సంజయ్‌ మంజ్రేకర్

"క్రికెట్‌ వ్యాఖ్యాతగా రిషభ్ పంత్‌, సంజు శాంసన్‌ వంటి యువకుల ఆటతీరును విశ్లేషించాల్సి వస్తుంది. కొన్నిసార్లు మా అంచనాలు ఒప్పు లేదా తప్పు అవుతుంటాయి. కానీ వారెప్పుడూ నాకు ప్రశ్నార్థకంగా కనిపిస్తారు. నిజం చెప్పాలంటే పంత్‌లో ఎక్స్‌ ఫ్యాక్టర్‌ ఉంది. ఓడిపోతామనుకున్న మ్యాచ్‌ను అతడు పది నిమిషాల్లోనే గెలిపిస్తాడు. శాంసన్‌ కూడా అంతే. అతడు ఊపు మీదున్నప్పుడు ప్రత్యర్థికి ప్రాణ సంకటమే" అని మంజ్రేకర్‌ అన్నారు.

"ఏదేమైనప్పటికీ నిలకడగా మ్యాచులను గెలిపించే ఇన్నింగ్స్‌లు ఆడటం ముఖ్యం. క్రికెట్‌ సాగుతున్నప్పుడు ప్రజలు ఎక్కువగా బ్యాటింగ్‌ స్థానాల గురించి మొత్తుకున్నారు. వారికి ప్రతిభ ఉంది. క్లాస్‌ ఉంది. సత్తా ఉంది. అయితే రిషభ్‌, సంజూపై తీర్పు చెప్పేందుకు వారి ప్రదర్శనలు, గణాంకాలు అవసరం. త్వరలోనే ఐపీఎల్‌ ఆరంభం అవుతోంది. అందరూ వారి నుంచి నిలకడ కోరుకుంటున్నారు. ఒక మ్యాచ్‌ బాగా ఆడి 3, 4 వదిలేసినట్టు ఉండొద్దు. అలాగైతే అవకాశాల్ని వదిలేసినట్టే" అని సంజయ్‌ పేర్కొన్నారు.

దిల్లీ క్యాపిటల్స్‌కు రిషభ్‌, రాజస్థాన్‌ రాయల్స్‌కు సంజూ కీలక ఆటగాళ్లుగా ఉన్నారు. ఐపీఎల్‌-2019లో దిల్లీ క్యాపిటల్స్‌ను ప్లేఆఫ్స్‌కు చేర్చడంలో పంత్​ కీలక పాత్ర పోషించాడు. ఇక రాజస్థాన్​ తరఫున 93 మ్యాచ్‌లు ఆడిన శాంసన్​.. 2,209 పరుగులు చేశాడు. అందులో రెండు శతకాలతో పాటు 10 అర్ధ శతకాలు ఉన్నాయి.

భారత్​లో వైరస్​ వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ ఏడాది టోర్నీ విదేశంలో నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్ 10 వరకు ఈ లీగ్‌ యూఏఈలో జరగనుంది.

ABOUT THE AUTHOR

...view details