తెలంగాణ

telangana

సిరాజ్​ను చూసి గర్వపడుతున్నా: సచిన్​

By

Published : Feb 18, 2021, 10:55 AM IST

భారత యువ పేసర్​ మహ్మద్​ సిరాజ్​పై లెజండరీ క్రికెటర్​ సచిన్​ ప్రశంసలు కురిపించాడు. అశ్విన్​ సెంచరీని జట్టులోని తోటి క్రికెటర్​​ ఆస్వాదించడాన్ని ఆయన మెచ్చుకున్నాడు. టీమ్​ఇండియాతో పాటు సిరాజ్​ పట్ల తాను గర్వపడుతున్నట్లు మాస్టర్​ ట్విట్టర్​లో వెల్లడించాడు.

Sachin Tendulkar applauds Mohammed Siraj for his reaction on R Ashwin century
సిరాజ్​ను చూసి గర్వపడుతున్నా: సచిన్​

టీమ్‌ఇండియా యువ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ పట్ల క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ సంతోషం వ్యక్తం చేశాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో రవిచంద్రన్‌ అశ్విన్‌ శతకం సాధించిన వేళ సిరాజ్‌ చేసుకున్న సంబరాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఆ సమయంలో అశ్విన్‌ కన్నా ఎక్కువ సిరాజ్‌ సంతోషపడుతూ గాల్లోకి ఎగురుతూ, పంచులు విసురుతూ కనిపించాడు. ఆ వీడియో నెట్టింట్లో వైరల్‌ అయింది. ఇదే విషయంపై స్పందించిన సచిన్‌.. సిరాజ్‌ చేసిన పనికి ఆనందించడమే కాకుండా ప్రశంసలతో ముంచెత్తాడు.

"ఇంగ్లాండ్‌తో రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్‌ సెంచరీ చేసినప్పుడు సిరాజ్‌ సంబరాలు చూడ్డానికి ఎంతో ఆసక్తిగా అనిపించాయి. వాటినెంతో ఆస్వాదించా. జట్టుగా ఆడే ఆటలో ఇలాంటివే ఉంటాయి. తోటి ఆటగాళ్ల ఘనతల్ని ఆస్వాదిస్తూ అందులో పాలుపంచుకోవడమే. టీమ్‌ఇండియా, సిరాజ్‌ పట్ల గర్వపడుతున్నా."

- సచిన్ తెందూల్కర్​, లెజండరీ క్రికెటర్

అలాగే దానికి సంబంధించి వీడియోనూ సచిన్​ అభిమానులతో పంచుకున్నాడు. దీనికి అశ్విన్‌ సైతం జవాబిచ్చాడు. సిరాజ్‌ జట్టు కోసం ఆడే ఆటగాడని మెచ్చుకున్నాడు.

అయితే, తాను 90 పరుగుల వద్ద బ్యాటింగ్‌ చేస్తుండగా సిరాజ్‌ తన వద్దకొచ్చి మాట్లాడాడని అశ్విన్‌ గుర్తుచేసుకున్నాడు. తన యూట్యూబ్‌ ఛానెల్లో అభిమానులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించాడు. సిరాజ్‌ చివరివరకూ క్రీజులో ఉంటాననే భరోసా ఇచ్చాడని చెప్పాడు. ఆ మ్యాచ్‌లో అశ్విన్ ‌(79) పరుగులతో బ్యాటింగ్‌ చేస్తుండగా సిరాజ్‌ పదో వికెట్‌గా క్రీజులోకి వచ్చాడు. ఈ క్రమంలోనే వీరిద్దరూ 49 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. చివరికి అశ్విన్‌(106) శతకం పూర్తి చేసుకున్నాక స్టోన్‌ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. ఇక బౌలింగ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన అశ్విన్‌ రెండో ఇన్నింగ్స్‌లో మరో మూడు వికెట్లు పడగొట్టాడు. దీంతో మొత్తంగా 8 వికెట్లతో పాటు శతకం సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలోనే అశ్విన్​ 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌'గా ఎంపికయ్యాడు.

ఇదీ చూడండి:మొయిన్​ అలీకి ఇంగ్లాండ్​ కెప్టెన్​ క్షమాపణలు!

ABOUT THE AUTHOR

...view details