తెలంగాణ

telangana

పంత్​లో ఇంత మార్పా!.. కారణమేంటో?

By

Published : Apr 1, 2021, 7:32 AM IST

అసలు జట్టులో చోటు సంపాదించుకోవడమే గగనం అన్న పరిస్థితుల్లో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సత్తాచాటాడు టీమ్ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్. ఐపీఎల్​లో దిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కెప్టెన్​గానూ ఎంపికయ్యాడు. బ్యాటింగ్​లో మెరిసినా కెప్టెన్​గా జట్టును ముందుండి నడిపించడం అతడికి పెద్ద పరీక్షే అంటున్నారు విశ్లేషకులు.

Pant
పంత్​

టీమ్‌ఇండియాలో చోటే ప్రశ్నార్థకమైన దశ నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద లీగ్‌ ఐపీఎల్‌లో ఓ జట్టుకు సారథిగా వ్యవహరించే అవకాశం.. అసలు ఇలా ఆడతారా ఎవరైనా? ఆ షాట్ల ఎంపిక ఏమిటీ? అని ప్రశ్నించినవాళ్లే.. వాహ్‌ అద్భుత బ్యాటింగ్‌ అని ప్రశంసించేలా మారిన ఆటతీరు..! నైపుణ్యాలున్నాయి కానీ సరిగా ఉపయోగించడం లేదని వినిపించిన వ్యాఖ్యలకు తనదైన శైలిలో సమాధానమిచ్చిన ఆ దూకుడు..! ఇలా అతనిలో ఎన్నో మార్పులు. తక్కువ కాలంలోనే ఎంతో తేడా! బ్యాటింగ్‌లో, వికెట్‌ కీపింగ్‌లో ఎంతో మెరుగై అసాధ్యమైన విజయాలనూ జట్టుకు అందించాడు భారత యువ వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌. దిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా ఎంపికైన ఈ 23 ఏళ్ల డాషింగ్‌ బ్యాట్స్‌మన్‌.. లీగ్‌లో తన ప్రదర్శనపై ఆసక్తి రేపుతున్నాడు.

పంత్

చోటు కష్టమే!

గతేడాది జనవరి 14.. ఆస్ట్రేలియాతో ముంబయిలో వన్డే మ్యాచ్‌. కమిన్స్‌ వేసిన బౌన్సర్‌ను పుల్‌షాట్‌ ఆడే ప్రయత్నంలో పంత్‌ విఫలమవడం వల్ల బంతి హెల్మెట్‌కు బలంగా తగిలింది. అప్పుడు ఔటై వెనుదిరిగిన అతడు కంకషన్‌ కారణంగా మైదానంలో అడుగుపెట్టే వీలు లేకుండా పోయింది. దీంతో కేఎల్‌ రాహుల్‌ వికెట్‌ కీపింగ్‌ చేశాడు. ఇక అక్కడి నుంచి నిలకడగా రాణించిన రాహుల్‌ జట్టులో సుస్థిర స్థానం దిశగా సాగడం వల్ల న్యూజిలాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు పంత్‌కు చోటు దక్కలేదు. టెస్టుల్లో ఆడినా విఫలమయ్యాడు.

మధ్యలో కరోనాతో ఆటకు విరామం వచ్చింది. తిరిగి ఐపీఎల్‌లో ఆడి చెప్పుకోదగ్గ ప్రదర్శన చేసినప్పటికీ ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్‌కు జట్టులో చోటే దక్కలేదు. టెస్టు జట్టుకు ఎంపికైనా తొలి మ్యాచ్‌కు దూరమయ్యాడు. అప్పటికే ఒడుదొడుకులతో సాగుతున్న తన కెరీర్‌ అంత త్వరగా కోలుకోవడం కష్టమే అనిపించింది. కానీ తానేంటో నిరూపించుకునేందుకు ఎదురుచూసిన పంత్‌.. అవకాశం రాగానే సద్వినియోగం చేసుకున్నాడు.

పంత్​

సిడ్నీ టెస్టు మార్చింది..

సిడ్నీలో మూడో టెస్టు చివరి ఇన్నింగ్స్‌లో 97 పరుగులతో పోరాడి జట్టును ఓటమి నుంచి తప్పించాడు. అదే జోరుతో చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఛేదనలో అజేయంగా 89 పరుగులతో జట్టుకు సంచలన విజయాన్ని కట్టబెట్టాడు. ఆ తర్వాత సొంతగడ్డపైనా టెస్టుల్లోనూ సత్తాచాటాడు. తిరుగులేని ఫామ్‌తో పరిమిత ఓవర్ల జట్లలోకి తిరిగొచ్చాడు. అంతేకాదు టీ20, వన్డేల్లోనూ అదరగొట్టాడు. గతంలో మాదిరిగా షాట్లు ఆడడంలో తొందరపాటు లేకుండా, పూర్తి పరిణతితో కూడిన ఆటతో ఆకట్టుకుంటున్నాడు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావీయకుండా, వీలైనంత ఎక్కువసేపు క్రీజులో గడిపేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాడు. వికెట్‌ కీపింగ్‌లోనూ అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నాడు.

సారథిగా సవాలే..

ఇంగ్లాండ్‌తో తొలి వన్డేలో శ్రేయస్‌ అయ్యర్‌ గాయపడడం వల్ల ఐపీఎల్‌-14లో దిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా ఎవరిని ఎంపిక చేస్తారనే ఆసక్తి మొదలైంది. సారథిగా శ్రేయస్‌ గత సీజన్‌లో జట్టును ఫైనల్‌ చేర్చాడు. ఈ నేపథ్యంలో ఆ లోటును తీర్చే ఆటగాడు ఎవరూ అన్న ప్రశ్నకు జట్టు యాజమాన్యం పంత్‌ పేరే సమాధానంగా చెప్పింది. ఇటీవల కాలంలో అద్భుత ఫామ్‌లో ఉన్న అతను.. తన జోరుతో జట్టుకు దూకుడు అందించగలడని ఫ్రాంఛైజీ నమ్మింది.

పంత్​

రహానె, అశ్విన్, స్మిత్​ను కాదని..

నాయకత్వ అనుభవం ఉన్న రహానె, అశ్విన్‌, స్టీవ్‌ స్మిత్‌ లాంటి సీనియర్‌ ఆటగాళ్లున్నప్పటికీ యాజమాన్య నమ్మకాన్ని పంత్‌ చూరగొన్నాడు. ఈ జట్టుకు సారథిగా వ్యవహరించాలనే తన కల నిజం కానుందని చెబుతోన్న పంత్‌ ముందు కెప్టెన్‌గా చాలా సవాళ్లే ఉన్నాయి. ముఖ్యంగా గత సీజన్‌లో ఫైనల్‌ చేరిన ఆ జట్టుకు.. ఈసారి టైటిల్‌ అందించి తొలి ట్రోఫీ కలను తీర్చాల్సిన బాధ్యత అతనిపై ఉంది. అందుకు జట్టులోని సీనియర్‌, జూనియర్‌ ఆటగాళ్లను సమన్వయం చేసుకుంటూ సాగాలి. వీటితో పాటు తన బ్యాటింగ్‌పై కెప్టెన్సీ భారం ప్రభావం పడకుండా చూసుకోవాలి. ఒకవేళ కెప్టెన్సీ ఒత్తిడితో బ్యాటింగ్‌లో విఫలమైతే రెంటికి చెడ్డ రేవడిలా అతని పరిస్థితి తయారవుతుంది. ఈ నేపథ్యంలో వచ్చే సీజన్‌ అతనికి నిజంగా పరీక్షే.

ABOUT THE AUTHOR

...view details