తెలంగాణ

telangana

బిర్యానీ తేవద్దన్నందుకు హోటల్ ఖాళీ చేసిన ధోనీ

By

Published : Aug 16, 2020, 10:38 AM IST

Updated : Aug 16, 2020, 11:51 AM IST

దిగ్గజ క్రికెటర్ ధోనీకి హైదరాబాద్​తో విడదీయలేని అనుబంధం ఉంది. ఇక్కడ దొరికే ఉస్మానియా బిస్కెట్లు, దమ్ బిర్యానీ అంటే అతడికి చాలా ఇష్టమట.

భాగ్యనగరంతో ధోనీకి విడదీయలేని అనుబంధం
ధోనీ

భారతీయ క్రికెట్‌లో తానొక సంచలనం. ఓటమి అంచుల వరకూ వెళ్లిన సమయంలో గెలిపించిన నాయకుడు. కెప్టెన్సీకే వన్నె తెచ్చిన ఆటగాడు ఎం.ఎస్‌.ధోనీ. అంతర్జాతీయ క్రికెట్‌కు శనివారం, వీడ్కోలు పలికాడు. హైదరాబాద్‌తో గొప్ప అనుబంధాన్ని ఏర్పరచుకున్నాడు. సహచర క్రీడాకారుడు అంబటి రాయుడుతో మంచి స్నేహబంధం ఉంది. నగరానికి వచ్చినపుడు టీమ్‌ ఇండియా మాజీ మేనేజర్‌ చాముండేశ్వరీనాథ్‌ ఇంట్లో కొద్ది సమయం గడిపేవాడు మహీ.

మిస్టర్‌ కూల్‌ కెప్టెన్‌

"ధోనీ కేవలం కెప్టెన్‌గానే కాదు.. గొప్ప మనసున్న వ్యక్తి. అంతకు మించిన వ్యక్తిత్వం గల నాయకుడు" అని బీసీసీఐ మాజీ మేనేజర్‌ చాముండేశ్వరీనాథ్‌ పేర్కొన్నారు. 2009లో తాను మేనేజర్‌గా వ్యవహరించిన సమయంలో మహీ గురించి చాలా కొత్త విషయాలను తెలుసుకున్నట్టు చెప్పాడు. సెల్‌ఫోన్‌ ఎక్కువగా ఉపయోగించడని, ఏ స్థాయిలో వ్యక్తి సలహా ఇచ్చినా స్వీకరించే సుగుణం వున్న నాయకుడని గుర్తు చేసుకున్నారు.

సాక్షితో ప్రేమాయణం..

ధోని, సాక్షి చిన్నప్పటి నుంచే ఒకరికొకరు తెలుసు. వాళ్ల నాన్నలు ఒకే చోట పనిచేసేవాళ్లు. వాళ్లు రాంచీలో ఒకే పాఠశాలకు వెళ్లేవాళ్లు. అయితే కొన్నాళ్లకు సాక్షి కుటుంబం దేహ్రాదూన్‌కు వచ్చేయడం వల్ల వాళ్ల మధ్య దూరం పెరిగింది. దాదాపు దశాబ్దకాలం తర్వాత వాళ్లిద్దరూ కోల్‌కతాలోని ఓ హోటల్‌లో అనుకోకుండా కలిశారు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌ కోసం జట్టు ఓ హోటళ్లోనే దిగింది. ఆ హోటళ్లోనే సాక్షి అప్పుడు తాత్కాలికంగా పనిచేసింది. ఆ తర్వాత ఫోన్లో మాట్లాడుకుని దగ్గరైన ఆ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి అది పెళ్లికి దారితీసింది.

తన సతీమణి సాక్షి సింగ్​తో మహేంద్ర సింగ్ ధోనీ

సతీమణికి మట్టి గాజుల బహుమతి

తన క్రీడా ప్రయాణాన్ని సినిమాగా తీసినపుడు ధోనీ హైదరాబాద్​ వచ్చాడు. ఉస్మానియా బిస్కెట్‌ తనకెంతో ఇష్టమైనదన్నాడు. నగరంలో మాత్రమే దొరికే మట్టిగాజులను జీవిత భాగస్వామి సాక్షికి బహుమతిగా తీసుకెళ్లేవాడినంటూ పేర్కొన్నాడు. ధోనీకి హైదరాబాదీ బిర్యానీ ఎంత ఇష్టమంటే ఓసారి నగరంలోని హోటల్‌లో బస చేశాడు. ఓ స్నేహితుడు ఆయనకు బిర్యానీ తీసుకెళ్లాడు. హోటల్‌ సిబ్బంది బయట ఆహారాన్ని అనుమతించకపోవటం వల్ల ధోనీ ఆ హోటల్‌నే ఖాళీ చేసేశాడు.

ఉప్పల్‌ స్టేడియంతో అనుబంధం

ధోనీకి నచ్చిన స్టేడియాలలో ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియం ఒకటి. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడే సమయంలో పలుమార్లు అక్కడ మ్యాచ్‌లను ఆస్వాదించానంటూ చెప్పేవాడు. ధోనీ జట్టు పోటీలో ఉన్న రోజు స్టేడియం కిక్కిరిసి పోయేది. ఇక్కడ ధోనీ రెండు ఐపీఎల్‌ ఫైనళ్లు(2017లో రైజింగ్‌ పుణె సూపర్‌జెయింట్స్‌ తరపున, 2019లో సీఎస్కే కెప్టెన్‌గా) ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్‌ విషయానికి వస్తే ఇక్కడ మూడు టెస్టులాడిన ధోనీ 131 పరుగులు చేశాడు. ఐదు వన్డేల్లో 202 పరుగులు చేశాడు.

భారత మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ
Last Updated :Aug 16, 2020, 11:51 AM IST

ABOUT THE AUTHOR

...view details