తెలంగాణ

telangana

రెండో టీ20: కసితో కోహ్లీసేన- ధీమాగా ఇంగ్లాండ్

By

Published : Mar 14, 2021, 7:03 AM IST

ఇంగ్లాండ్​తో జరిగిన తొలి టీ-20లో ఘోరంగా విఫలమైన కోహ్లీసేన రెండో మ్యాచ్​లో ప్రత్యర్థి జట్టును కట్టడి చేసేందుకు కొత్త వ్యూహంతో ముందుకొస్తోంది. రిషభ్​ పంత్, హార్దిక్ పాండ్య నుంచి మెరుపు ఇన్నింగ్స్ ఆశిస్తోంది. లోపాలను సరిచూసుకుని.. సరైన జట్టు కూర్పుతో ఇంగ్లిష్ జట్టుకు కళ్లెం వేసేందుకు వ్యూహరచన చేస్తోంది.

India aiming to win the second T20 against england
రెండో టీ20: కసితో కోహ్లీసేన- ధీమాతో ఇంగ్లాండ్

బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో తొలి టీ-20లో ఓటమిపాలైన కోహ్లీసేన పొరపాట్లను పునరావృతం చేయకూడదని భావిస్తోంది. గతేడాది డిసెంబర్‌లో ఆస్ట్రేలియాతో టీ-20 మ్యాచ్‌ ఆడిన భారత్.. మూడు నెలల తర్వాత ఇంగ్లాండ్‌తో 20 ఓవర్ల మ్యాచ్ ఆడింది. అప్పటి నుంచి అంతర్జాతీయ క్రికెట్ ఆడని కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య, చాహల్‌ ఈ మ్యాచ్​తోనే మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టారు. ఈ ఒక్క ఓటమితోనే టీమిండియాపై ఓ అంచనాకు రావడం సరికాదు. ప్రతికూల పరిస్థితుల నుంచి పుంజుకుని రాణించడం భారత జట్టుకు కొత్తేమి కాదు. టెస్టు సిరీస్‌లో కూడా అదే జరిగింది.

జట్టుకు ఎక్స్‌ఫ్యాక్టర్‌గా ఉపయోగపడతారని భావిస్తున్న రిషభ్ పంత్, హార్దిక పాండ్య నుంచి గెలుపు ఇన్నింగ్స్‌లను జట్టు ఆశిస్తోంది. వారిద్దరూ అపారమైన ప్రతిభ కలవారన్న కోహ్లీ.. సామర్థ్యం మేరకు ఆడితే గెలుపుబాట పట్టడం పెద్ద కష్టమేమి కాదన్నాడు. ఆర్చర్, మార్క్ వుడ్ బౌలింగ్‌ను పాండ్య, పంత్‌ సరిగ్గా అంచనా వేయలేకపోయారని, అదనపు బౌన్స్‌ వల్ల కూడా భారీ షాట్లు ఆడలేకపోయారని చెప్పాడు.

హార్దిక పాండ్య

మ్యాచ్ అనంతరం మీడియా తో మాట్లాడిన కోహ్లీ.. ఆశించిన షాట్లు ఆడేందుకు వికెట్ సహకరించలేదన్నాడు. తొలి టీ-20లో 67 పరుగులతో ఆకట్టుకున్న శ్రేయస్‌ అయ్యర్ అదే ఫామ్​ను కొనసాగించాలని భారత జట్టు కోరుకుంటోంది. మిగతా బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేసిన వేళ అయ్యర్ తన ఇన్నింగ్స్ ద్వారా బ్యాటింగ్ చేయడం పెద్ద కష్టమేమి కాదని నిరూపించాడు.

రిషభ్​ పంత్

నిరీక్షణ తప్పదా...

మిడిల్ ఆర్డర్‌లో ఖాళీ లేకపోవడం, శ్రేయస్ అయ్యర్ ఫామ్‌లో ఉండటంతో.. ఐపీఎల్‌లో రాణించిన సూర్యకుమార్ యాదవ్‌కు నిరీక్షణ తప్పకపోవచ్చని కోహ్లీ అభిప్రాయపడ్డాడు.

తొలి మ్యాచ్‌లో విఫలమైన శిఖర్ ధావన్‌ రాణించాలని జట్టు కోరుకుంటోంది. ఫామ్​లో ఉన్న రోహిత్‌ను విశ్రాంతి పేరిట ఆడించకపోవడం జట్టుకు చేటు చేసింది. గత కొన్ని రోజులుగా తన మార్క్ ఆటను ప్రదర్శించలేకపోతున్న విరాట్‌ నుంచి జట్టు యజమాన్యం భారీ ఇన్నింగ్స్‌ ఆశిస్తోంది.

తొలి టీ20లో ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగడం కోహ్లీసేనను దెబ్బతీసింది. ఇంగ్లాండ్ పేసర్‌లు చెలరేగిన నేపథ్యంలో ముగ్గురు స్పిన్నర్లలో ఒకరి స్థానాన్ని పేసర్ సైని భర్తీ చేసే అవకాశం ఉంది. ఐపీఎల్‌లో ‌బ్యాటింగ్, బౌలింగ్‌తో ఆకట్టుకున్న రాహుల్ తెవాతియా అరంగేట్రం చేసే అవకాశాన్ని కొట్టి పారేయలేం. స్పిన్నర్ చాహల్ స్థానంలో తెవాతియా జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.

తొలి మ్యాచ్ ఫలితం నేపథ్యంలో కొద్ది పాటి మార్పులతో రెండో టీ20లో కోహ్లీసేన బరిలోకి దిగనుంది. ఐపీఎల్​లో ఆడిన అనుభవం ఆటగాళ్లకు ఉండటం ఇంగ్లాండ్‌ జట్టుకు కలిసివచ్చింది. పొట్టి ఫార్మాట్‌లో ప్రపంచ నంబర్ వన్ స్థానంలో ఉన్న ఇంగ్లాండ్‌ ఈ ఏడాది అక్టోబర్‌లో భారత్‌లో జరగనున్న టీ-20 ప్రపంచకప్‌నకు బలమైన పోటీ దారుగా ఉంది. ఆ జట్టును ఓడించాలంటే కోహ్లీ సేన పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శించాల్సిందే.

ఇదీ చదవండి:ఒకే ఓవర్లో 4 సిక్సర్లు- వాహ్​ యువీ!

ABOUT THE AUTHOR

...view details