తెలంగాణ

telangana

బాక్సింగ్ డే టెస్టు: ఈసారి ఆధిపత్యం ఎవరిదో?

By

Published : Dec 27, 2020, 6:35 PM IST

ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమ్ఇండియా బాక్సింగ్ డే టెస్టులో కంగారూ జట్టుతో తలపడుతోంది. అయితే ఇప్పటివరకు ఆసీస్​తో జరిగిన బాక్సింగ్ డే టెస్టుల్లో ఆస్ట్రేలియాదే ఆధిపత్యం. మొత్తంగా ఇప్పటివరకు 8 బాక్సింగ్ డే టెస్టులు జరగగా ఇందులో ఒక్కసారి మాత్రమే భారత్ గెలిచింది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఇరుజట్ల మధ్య జరిగిన ఈ టెస్టు మ్యాచ్​ల ఫలితాలను గుర్తు చేసుకుందాం.

IND vs AUS TEST: Stats about Boxing Day tests
బాక్సింగ్ డే టెస్టు: ఈసారి ఆధిపత్యం ఎవరిదో?

ఆస్ట్రేలియాతో జరిగిన తొలిటెస్టులో ఘోరపరాభవం చెందిన టీమ్ఇండియా రెండో మ్యాచ్​లో విజయంపై కసితో ఉంది. బాక్సింగ్ డే సందర్భంగా జరుగుతోన్న ఈ టెస్టు రెండు జట్లకు ఎంతో ప్రతిష్టాత్మకం. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు రెండు జట్ల మధ్య జరిగిన బాక్సింగ్ డే టెస్టులు, వాటి ఫలితాలను ఓసారి గుర్తు చేసుకుందాం.

1985 (డ్రా)

ఈ ఏడాది బాక్సింగ్ డే టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్​లో 262 పరుగులు చేసింది. గ్రెగ్ మాథ్యూస్ (100*) అద్భుత శతకంతో జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. అనంతరం బ్యాటింగ్​కు దిగిన భారత్ 445 పరుగుల భారీ స్కోర్ సాధించింది. క్రిస్ శ్రీకాంత్ (86), దిలీప్ వెంగ్​సర్కార్ (75), కపిల్ దేవ్ (55), రవిశాస్త్రి (49) ఆకట్టుకున్నారు. తర్వాత బ్యాటింగ్​కు దిగిన ఆసీస్ రెండో ఇన్నింగ్స్​లో 308 పరుగులకు ఆలౌటైంది. అలెన్ బోర్డర్ (163) భారీ శతకంతో జట్టును ఒంటి చేత్తో నడిపించాడు. అనంతరం 126 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ఇండియా రెండు వికెట్ల నష్టానికి 59 పరుగులు చేయగా మ్యాచ్ డ్రాగా ముగిసింది. రెండో ఇన్నింగ్స్​లో 163 పరుగులతో సత్తాచాటిన అలెన్ బోర్డర్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్​గా నిలిచాడు. ఈ సిరీస్​లోని మూడు టెస్టులూ డ్రాగా ముగిశాయి.

టీమ్ఇండియా

1991 (ఆస్ట్రేలియా విజయం)

ఆరేళ్ల తర్వాత ఇరుజట్ల మధ్య జరిగిన బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఈ టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్​లో 263 పరుగులు చేసింది. కిరణ్ మోరే (67) రాణించాడు. తర్వాత బ్యాటింగ్​కు దిగిన ఆస్ట్రేలియా 349 పరుగులకు ఆలౌటైంది. గిఫ్ మార్ష్ (86), ఇయాన్ హేలీ (60), డీన్ జోన్స్ (59) సత్తాచాటారు. అనంతరం రెండో ఇన్నింగ్స్​లో 213 పరుగులకు పరిమితమైంది ఇండియా. ఫలితంగా 128 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆసీస్ 40 ఓవర్లలో మ్యాచ్​ను ముగించేసింది. మార్క్ టేలర్ (60), డేవిడ్ బూన్ (44*) రాణించారు. రెండు ఇన్నింగ్స్​ల్లో 12 వికెట్లు సాధించిన బ్రూస్ రీడ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్​గా నిలిచాడు. అలాగే సిరీస్​ను 4-0 తేడాతో కోల్పోయింది టీమ్ఇండియా.

1999 (ఆస్ట్రేలియా విజయం)

ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 405 పరుగుల భారీ స్కోర్ సాధించింది. మిచెల్ స్లాటర్ (91), రికీ పాంటింగ్ (67), ఆడం గిల్​క్రిస్ట్ (78) రాణించారు. అనంతరం బ్యాటింగ్​కు దిగిన టీమ్ఇండియా 238 పరుగులకు పరిమితమైంది. సచిన్ తెందూల్కర్ (116) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్​లో 5 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసిన ఆసీస్ డిక్లేర్ ప్రకటించింది. భారత్​ ముందు 376 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. లక్ష్య ఛేదనలో భారత్ 195 పరుగులకే కుప్పకూలింది. సచిన్ (52), రిషికేష్ కనిట్కర్ (45) పోరాడారు. రెండు ఇన్నింగ్స్​ల్లో సెంచరీ, అర్ధసెంచరీతో అలరించిన సచిన్​కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది. సిరీస్​ను 3-0 తేడాతో కోల్పోయింది భారత్.

ఆస్ట్రేలియా

2003 (ఆస్ట్రేలియా విజయం)

ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 366 పరుగులు సాధించింది. వీరేంద్ర సెహ్వాగ్ (195) భారీ శతకంతో అలరించాడు. తర్వాత బ్యాటింగ్​కు దిగిన ఆసీస్ 558 పరుగులు చేసింది. హేడెన్ (136) శతకానికి తోడు రికీ పాంటింగ్ (257) అద్భుత ద్విశతకంతో మెరిశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్​లో 286 పరుగులు చేసింది టీమ్ఇండియా. రాహుల్ ద్రవిడ్ (92), గంగూలీ (73) రాణించారు. ఫలితంగా 95 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 22.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి విజేతగా నిలిచింది. హెడెన్ 55 పరుగులతో ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్​లో ద్విశతకం సాధించిన పాంటింగ్​ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్​గా నిలిచాడు. అలాగే సిరీస్ 1-1 తేడాతో డ్రాగా ముగిసింది.

2007 (ఆస్ట్రేలియా విజయం)

ఈ టెస్టులోనూ టీమ్ఇండియా ఓటమి చవిచూసింది. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన ఈ మ్యాచ్​లో భారత బ్యాట్స్​మెన్ ఘోరంగా విఫలమయ్యారు. ఈ మ్యాచ్​లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మాథ్యూ హెడెన్ (124), ఫిల్ జాక్వెస్ (66) ధాటికి తొలి ఇన్నింగ్స్​లో 343 పరుగులు చేసింది. అనిల్ కుంబ్లే 5, జహీర్ ఖాన్ 4 వికెట్లతో రాణించారు. తర్వాత బ్యాటింగ్​కు దిగిన భారత్ ఆసీస్ బౌలర్ల ధాటికి 196 పరుగులకే పరిమితమైంది. సచిన్ (62), అర్ధశతకంతో రాణించగా గంగూలీ 43 పరుగులు చేశాడు. ఆసీస్ బౌలర్లలో బ్రెట్​ లీ, స్టువర్ట్ క్లర్క్ చెరో 4 వికెట్లు సాధించారు.

ఆస్ట్రేలియా

అనంతరం రెండో ఇన్నింగ్స్​లోనూ 7 వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసిన ఆస్ట్రేలియా డిక్లేర్ చేసింది. ఫిల్ జాక్వెస్ (51), మైఖెల్ క్లర్క్ (73), ఆకట్టుకున్నారు. రెండో ఇన్నింగ్స్​లో 499 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్​ 161 పరుగులకే పరిమితమైంది. లక్ష్మణ్ 42, గంగూలీ 40 పర్వాలేదనిపించారు. దీంతో 337 పరుగుల భారీ తేడాతో భారత్ ఓటమిపాలైంది. తొలి ఇన్నింగ్స్​లో సెంచరీ (124)తో పాటు రెండో ఇన్నింగ్స్​లో 47 పరుగులు చేసిన హెడెన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్​గా నిలిచాడు. అలాగే ఈ సిరీస్​ను 2-1 తేడాతో కోల్పోయింది భారత్.

2011 (ఆస్ట్రేలియా విజయం)

ఈ మ్యాచ్​లోనూ పరాజయం చెందింది టీమ్ఇండియా. మెల్​బోర్న్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 333 పరుగులు చేసింది. ఇడ్ కోవన్ (68), రికీ పాంటింగ్ (62) అర్ధశతకాలతో అలరించారు. తర్వాత బ్యాటింగ్​కు దిగిన భారత్ 282 పరుగులకు పరిమితమైంది. ఓపెనర్లు సెహ్వాగ్ (67), ద్రవిడ్ (68)తో పాటు సచిన్ (73) రాణించారు. కానీ మిగతా బ్యాట్స్​మన్ విఫలమయ్యారు. అనంతరం రెండో ఇన్నింగ్స్​లో బ్యాటింగ్​కు దిగిన కంగారూల జట్టు 240 పరుగులు చేసి భారత్ ముందు 292 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. మైక్ హస్సీ (89), పాంటింగ్ (60), సత్తాచాటారు. 292 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ఇండియా 169 పరుగులకే పరిమితమై 122 పరుగుల తేడాతో ఓడిపోయింది. సచిన్ చేసిన 32 పరుగులే అత్యధికం. రెండు ఇన్నింగ్స్​ల్లో కలిపి 6 వికెట్లతో పాటు 55 పరుగులు చేసిన జేమ్స్ ప్యాటిన్సన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్​గా నిలిచాడు. ఈ నాలుగు మ్యాచ్​ల టెస్టు సిరీస్​ను 4-0 తేడాతో గెలుచుకుంది ఆసీస్.

2014 (మ్యాచ్ డ్రా)

వరుసగా 5 బాక్సింగ్ డే టెస్టుల్లో ఓడిపోయిన టీమ్ఇండియా 2014లో జరిగిన మ్యాచ్​ను మాత్రం డ్రాగా ముగించింది. ఈ మ్యాచ్​లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్​లో 530 పరుగుల భారీ స్కోర్ సాధించింది. స్టీవ్ స్మిత్ (192) భారీ శతకానికి తోడు ర్యాన్ హారిస్ (74), క్రిస్ రోజర్స్​ (57), బ్రాడ్ హడిన్ (55) ఆకట్టుకున్నారు. అనంతరం బ్యాటింగ్​కు దిగిన భారత్ కూడా దీటుగానే ఆడింది. 465 పరుగులు చేసి ఆలౌటైంది. కోహ్లీ (169), రహానే (147) భారీ శతకాలతో విరుచుకుపడగా మురళీ విజయ్ (68) అర్ధశతకంతో అలరించాడు. తర్వాత రెండో ఇన్నింగ్స్​లో 9 వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసి డిక్లేర్ ప్రకటించింది కంగారూ జట్టు. ఫలితంగా 384 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ఇండియా ఐదు రోజుల ఆట ముగిసే సరికి 6 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. కోహ్లీ (54) హాఫ్ సెంచరీతో రాణించాడు. రెండు ఇన్నింగ్స్​ల్లో 6 వికెట్లతో పాటు 95 పరుగుల చేసిన ర్యాన్ హారిస్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్​గా నిలిచాడు. అలాగే ఈ 4 మ్యాచ్​ల టెస్టు సిరీస్​ను ఆసీస్ 2-0 తేడాతో గెలుచుకుంది.

టీమ్ఇండియా

2018 (భారత్ విజయం)

భారత అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న బాక్సింగ్ డే టెస్టు విజయం ఈ మ్యాచ్​తో తీరింది. ఎట్టకేలకు ఆసీస్ గడ్డపై టీమ్ఇండియా టెస్టు సిరీస్ విజయం సాధించింది. ఈ సిరీస్​లో భాగంగా మెల్​బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టులోనూ ఇండియా గెలుపొందింది. ఈ మ్యాచ్​లో మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్​లో 7 వికెట్ల నష్టానికి 443 పరుగులు చేసి డిక్లేర్ ప్రకటించింది. పుజారా (106) సెంచరీతో రాణించగా కోహ్లీ (82), మయాంక్ అగర్వాల్ (76), రోహిత్ (63) ఆకట్టుకున్నారు. తర్వాత బ్యాటింగ్​కు దిగిన కంగారూ జట్టును 151 పరుగులకే ఆలౌట్ చేసింది భారత్. భారత బౌలర్ల ధాటికి ఒక్కరు కూడా అర్ధశతకం సాధించలేకపోయారు. బుమ్రా 6 వికెట్లతో ఆసీస్ వెన్నువిరిచాడు. తర్వాత రెండో ఇన్నింగ్స్​లో 8 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసి డిక్లేర్ ఇచ్చింది. మయాంక్ 42 పరుగులతో రాణించాడు. 399 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్​ను 261 పరుగులకే కట్టడి చేసింది టీమ్ఇండియా. పేసర్ మిచెల్ స్టార్క్ (63) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. రెండు ఇన్నింగ్స్​ల్లో కలిపి 9 వికెట్లు తీసిన బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది.

ఈ 4 మ్యాచ్​ల సిరీస్​ను టీమ్ఇండియా 2-1 తేడాతో గెలుచుకుంది. ఫలితంగా ఆసీస్ గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్ విజయం సాధించిన ఆసియా జట్టుగా రికార్డు సృష్టించింది.

2020 (ప్రస్తుతం)

కరోనా లాక్​డౌన్ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత్ అక్కడ మిశ్రమ ఫలితాలను అందుకుంది. తొలుత వన్డే సిరీస్​ను 2-1 తేడాతో ఆసీస్ గెలుచుకోగా, తర్వాత 2-1 తేడాతో టీ20 సిరీస్​ను చేజిక్కించుకుంది భారత్. అనంతరం మొదలైన టెస్టు సిరీస్​లో మొదటి మ్యాచ్​లో ఘోర ఓటమి చవిచూసింది టీమ్ఇండియా. ప్రస్తుతం ఇరుజట్ల మధ్య బాక్సింగ్ డే టెస్టు జరుగుతోంది. ఈ మ్యాచ్​లో గెలిస్తే బాక్సింగ్ డే టెస్టులో రెండోసారి విజేతగా నిలిచిన జట్టుగా భారత్ నిలుస్తుంది.

ABOUT THE AUTHOR

...view details