తెలంగాణ

telangana

'బాక్సింగ్​ డే' టెస్టుకు భారత్ సై.. మరి గెలుపు?

By

Published : Dec 25, 2020, 5:00 PM IST

రహానె సారథ్యంలోని టెస్టు బృందం.. ఆసీస్​తో 'బాక్సింగ్ డే' మ్యాచ్​కు పూర్తి సిద్ధంగా ఉంది. భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 5 గంటలకు మ్యాచ్​ మొదలు కానుంది. మరి తొలి టెస్టు ఓటమికి మన ఆటగాళ్లు ప్రతీకారం తీర్చుకుంటారా?

IND vs AUS 2nd Test Preview
'బాక్సింగ్​ డే' టెస్టుకు భారత్ సై.. మరి గెలుపు?

పీడకలలా నిలిచిన తొలిటెస్టు ఓటమి.. సన్నగిల్లిన భారత క్రికెటర్ల ఆత్మవిశ్వాసం.. సొంతగడ్డపై రెట్టించిన ఉత్సాహంతో సై అంటున్న కంగారూలు.. అందుబాటులో లేని కెప్టెన్‌ కోహ్లీ, కీలక పేసర్‌ షమి సేవలు.. ఇన్ని ప్రతికూలతల మధ్య బోర్డర్‌-గావస్కర్‌ టెస్టు సిరీస్‌లో రెండో సమరానికి టీమ్‌ ఇండియా సిద్ధమైంది. శనివారం నుంచి మొదలయ్యే బాక్సింగ్‌ డే టెస్టులో నాలుగు మార్పులతో బరిలోకి దిగుతోంది. విరాట్‌ గైర్హాజరీలో రహానె జట్టును ఎలా నడిపిస్తాడనేది కీలకంగా మారింది.

రెండో టెస్టు కోసం టీమ్​ఇండియా జట్టు

అడిలైడ్‌లో తొలిటెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే కుప్పకూలి దారుణ పరాజయం చవిచూసిన భారత్.. బాక్సింగ్‌ డే టెస్టుకు సిద్ధమవుతోంది. సిరీస్‌లో, అదీ ఆస్ట్రేలియాలో 0-1తో వెనుకబడ్డాక పుంజుకోవడం అంటే తేలిక కాదు. తిరిగి గాడిలో పడాలంటే బ్యాటింగ్‌లో టీమ్​ఇండియా అసాధారణ ప్రదర్శన చేయక తప్పని పరిస్థితి.

బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేసినా.. ఘోర బ్యాటింగ్‌ వైఫల్యం అడిలైడ్‌లో భారత జట్టును దెబ్బతీసింది. ఇప్పుడు కోహ్లీ కూడా లేకపోవడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మారుస్తోంది.

ప్రాక్టీసులో భారత జట్టు

జట్టులో మార్పులు

గత మ్యాచ్‌లో దారుణంగా విఫలమైన పృథ్వీ షాను జట్టు నుంచి తప్పించి శుభ్‌మన్‌ గిల్‌కు చోటు కల్పించారు. మయాంక్‌కు తోడుగా గిల్‌ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. వార్మప్ మ్యాచ్​లో గిల్‌ చక్కని బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఆసీస్‌ పేస్‌ దాడిని తట్టుకుంటూ వీరిద్దరూ ఇన్నింగ్స్‌ను బలంగా ఆరంభించడం ఎంతో కీలకం. ఓపెనర్‌ మయాంక్‌ ఫామ్‌లోకి రావాలని భారత్‌ కోరుకుంటోంది. పితృత్వ సెలవుపై స్వదేశానికి వచ్చిన కెప్టెన్‌ కోహ్లీ స్థానంలో ఆల్‌రౌండర్‌ జడేజా తుదిజట్టులోకి వచ్చాడు.

సిరాజ్- శుభ్​మన్ గిల్

మిడిల్‌ఆర్డర్‌లో బ్యాటింగ్‌ పదును పెంచేందుకు సాహా స్థానంలో వికెట్‌కీపర్‌గా పంత్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. 2018-19లో ఆసీస్‌ టూర్‌లో పంత్‌ మంచి ప్రదర్శన చూపాడు. కీలక పేసర్‌ షమి గాయం కారణంగా జట్టు దూరం కావడం ఆ స్థానంలో సిరాజ్‌కు చోటు కల్పించారు. కోహ్లీ గైర్హాజరీలో రహానె మరింత బాధ్యత తీసుకుని బ్యాటింగ్‌ ఆర్డర్‌లో నాలుగో స్థానంలో బరిలోకి దిగే అవకాశం ఉంది.

ఉత్సాహంతో ఆసీస్

మరోవైపు తొలిటెస్టు విజయంతో నాలుగు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యం సంపాదించిన ఆస్ట్రేలియా రెట్టించిన ఉత్సాహంతో బాక్సింగ్‌ డే టెస్టుకు సిద్ధమైంది. గాయాలు వేధిస్తున్నా సరే ఆ జట్టు భారత్‌ కన్నా సమతూకంగానే ఉంది. పేస్‌ బౌలింగ్‌ ఆ జట్టుకు పెద్ద బలం. హేజిల్‌వుడ్‌, కమిన్స్‌, స్టార్క్‌ మరోసారి భారత్‌ను బెంబేలెత్తించడానికి సిద్ధమవుతున్నారు.

స్టార్క్, కమిన్స్, హేజిల్​వుడ్

మెల్‌బోర్న్‌ క్రికెట్‌ మైదానంలో భారత్‌పై ఆస్ట్రేలియాకు మంచి రికార్డుంది. ఇక్కడ ఈ రెండు జట్లు 13 టెస్టుల్లో తలపడగా ఆస్ట్రేలియా ఎనిమిది నెగ్గింది. భారత్‌ మూడు టెస్టుల్లో గెలవగా.. రెండు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. చివరిసారి ఇక్కడ ఆసీస్‌తో ఆడిన టెస్టులో భారత్‌ 137 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 2011 నుంచి మెల్‌బోర్న్‌లో భారత్‌ ఓడిపోలేదు. పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందని భావిస్తున్నారు. అయితే ఆరంభంలో కొత్త బంతిని ఎదుర్కోవడం మాత్రం బ్యాట్స్‌మెన్‌కు కష్టమే. నిలదొక్కుకుంటే మాత్రం బ్యాటింగ్‌ తేలికవుతుంది. పిచ్‌ క్రమంగా క్షీణించి స్పిన్నర్లకు సహకారం లభించవచ్చు.

ABOUT THE AUTHOR

...view details