తెలంగాణ

telangana

IND VS AUS: నో మ్యాజిక్​.. టీమ్​ఇండియా ఓటమి.. ఆస్ట్రేలియాదే మూడో టెస్టు

By

Published : Mar 3, 2023, 10:59 AM IST

Updated : Mar 3, 2023, 11:36 AM IST

బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీలో భాగంగా జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించింది. టీమ్​ఇండియా తొమ్మిది వికెట్ల తేడాతో ఓడిపోయింది.

Border Gavaskar Trophy Teamindia loss the third test against Australia
IND VS AUS: నో మ్యాజిక్​.. టీమ్​ఇండియా ఓటమి.. ఆస్ట్రేలియాదే మూడో టెస్టు

బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీలో తొలి రెండు టెస్టుల్లో అద్భుత విజయాలను అందుకున్న టీమ్​ఇండియాకు మూడో టెస్టులో బిగ్​ షాక్ తగిలింది. ఇండోర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్​లో తొమ్మిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఫలితంగా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్​ ఫైనల్‌ బెర్త్​కు ప్లేస్​ ఖరారు చేసుకోవడంతో పాటు ఐసీసీ నెం.1 టెస్టు టీమ్ స్థానాన్ని దక్కించుకోవాలనుకున్న భారత ఆశలు గల్లంతయ్యాయి. ఈ మ్యాచ్​లో 76 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆస్ట్రేలియా​ జట్టు అవలీలగా ఛేదించి.. సిరీస్‌లో టీమ్​ఇండియా ఆధిక్యాన్ని 2-1 తేడాకు తగ్గించింది.

మూడో రోజు ఆట తొలి సెషన్‌లో 18.3 ఓవర్లు బ్యాటింగ్ చేసిన ఆసీస్​ జట్టు ఒక్క వికెట్ కోల్పోయి.. విజయాన్ని గెలుచుకుంది. ఉస్మాన్ ఖ్వాజా డకౌట్ అయినప్పటికీ మార్నస్ లబుషేన్, ట్రావిస్ హెడ్ కలిసి రెండో వికెట్‌కు అజేయంగా 78 పరుగుల పార్న్టర్​షిప్​ నెలకొల్పారు. ట్రావిస్ హెడ్(53 బంతులు; 6 ఫోర్లు, ఒక సిక్స్​) 49 పరుగులు చేయగా మార్నస్ లబుషేన్(58 బంతులు; 6 ఫోర్లు) 28 పరుగులు చేసి మ్యాచ్‌ను ముగించాడు. ఈ విజయంతో.. ప్యాట్ కమ్మిన్స్ కెప్టెన్సీలో తొలి రెండు టెస్టుల్లో కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయిన ఆస్ట్రేలియా.. ఇప్పుడు స్టీవ్ స్మిత్ సారథ్యంలో 2023 పర్యటనలో తొలి విజయాన్ని అందుకుంది. అలానే రోహిత్ శర్మ సారథ్యంలో భారత జట్టుకు ఇదే తొలి టెస్టు పరాజయం.

76 పరుగుల లక్ష్యంతో మూడో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా.. మొదటి ఓవర్​లోనే ఉస్మాన్ ఖవాజా వికెట్‌ను కోల్పోయింది. రెండు బంతులు ఎదుర్కొన్న ఖ్వాజా.. అశ్విన్ బౌలింగ్‌లో శ్రీకర్ భరత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అలా తొలి పది ఓవర్లలో ఆసీస్​ కేవలం 13 పరుగులే చేసింది. ఆ తర్వాత కొత్త బంతితో టీమ్​ఇండియా స్పిన్నర్లు ప్రయోగం చేశారు కానీ కుదరలేదు. మార్నస్ లబుషేన్, ట్రావిడ్ హెడ్ వరుస బౌండరీలతో భారత స్పిన్నర్లను ఆడుకున్నారు. మన స్పిన్నర్లు ఈ కొత్త బంతితో.. 5 ఓవర్లలో 43 పరుగులు సమర్పించుకున్నారు. అనంతరం రోహిత్ శర్మ.. బంతిని ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్‌కి ఇచ్చిన ఫలితం దక్కలేదు. ఆసీస్​ బ్యాటర్లు బాగా ఆడటంతో మ్యాచ్​ ముగిసింది.

అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్​ఇండియా 109 పరుగులకే కుప్పకూలింది. అనంతరం రెండో ఇన్నింగ్స్​లో 163 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ(22) టీమ్​ఇండియా తరుఫున టాప్ స్కోరర్‌గా నిలవగా.. రెండో ఇన్నింగ్స్‌లో పూజారా 59 పరుగులతో హాఫ్ సెంచరీ చేసి టాప్​ స్కోరర్​గా నిలిచాడు. అలానే తొలి ఇన్నింగ్స్​లో జడేజా 4, అశ్విన్​, ఉమేశ్​ చెరో మూడు వికెట్లు తీసి అదరగొట్టారు. ఇకపోతే చివరి టెస్టు మ్యాచ్​ మార్చి 9నుంచి అహ్మదాబాద్ వేదికగా జరగనుంది.

ఇదీ చూడండి:మహిళల ప్రీమియర్​ లీగ్​ పోరుకు సిద్ధం.. ఇక భారత అమ్మాయిల వంతు

Last Updated : Mar 3, 2023, 11:36 AM IST

ABOUT THE AUTHOR

...view details