తెలంగాణ

telangana

రోహిత్​, కోహ్లీలకు బీసీసీఐ స్ట్రాంగ్​ వార్నింగ్​!

By

Published : Jun 22, 2022, 1:26 PM IST

BCCI Warning Kohli Rohith:
BCCI Warning Kohli Rohith: ()

BCCI Warning Kohli Rohith: భారత్​-ఇంగ్లాండ్​ మధ్య జరగనున్న ఐదో టెస్టు కోసం ఇంగ్లాండ్​ వెళ్లిన టీమ్​ఇండియా ఆటగాళ్లు రోహిత్​ శర్మ, విరాట్​ కోహ్లీలకు బీసీసీఐ వార్నింగ్​ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కొవిడ్‌ను తేలిగ్గా తీసుకోవద్దంటూ ఆ ఇద్దరి ఆటగాళ్లను హెచ్చరించాలని భావిస్తోందట. అసలు ఏం జరిగిందంటే?

BCCI Warning Kohli Rohith: భారత్, ఇంగ్లాండ్ మధ్య గతేడాది కరోనా కారణంగా వాయిదా పడిన ఐదో (చివరి) టెస్టు జులై 1 నుంచి ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌కు టీమ్‌ఇండియా ఆటగాళ్లు ఇప్పటికే ఇంగ్లాండ్‌ చేరుకున్నారు. ప్రస్తుతం కొవిడ్ భయం పెద్దగా లేకపోవడం వల్ల కఠినమైన బయో బబుల్ నిబంధనలు అమలు చేయడం లేదు. దీంతో భారత క్రికెటర్లు ఇంగ్లాండ్‌లో స్వేచ్ఛగా విహరిస్తున్నారు. ఖాళీ సమయాల్లో షాపింగ్‌, షికార్లకు వెళుతున్నారు. అయితే, బయట ప్రాంతాల్లోకి వెళ్లినప్పుడు కొవిడ్‌ నిబంధనలు పాటించడం లేదు. అంతేకాకుండా.. అటుగా వచ్చిన అభిమానులకు షేక్‌ హ్యాండ్స్‌ ఇస్తూ ఫొటోలకు సైతం పోజులిస్తున్నారు. టీమ్‌ఇండియా స్టార్ క్రికెటర్లు అయిన విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ ఫ్యాన్స్‌తో దిగిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. ఆ సమయంలో విరాట్‌, రోహిత్‌లు కనీసం మాస్క్‌లు కూడా ధరించలేదు.

కనీస జాగ్రత్తలు పాటించకుండా ఆటగాళ్లు బయటి ప్రదేశాలకు వెళ్లడంపై బీసీసీఐ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కొవిడ్‌ను తేలిగ్గా తీసుకోవద్దంటూ ఆ ఇద్దరి ఆటగాళ్లను హెచ్చరించాలని భావిస్తోంది. "యూకేలో కొవిడ్‌ కేసులు చాలావరకూ తగ్గినప్పటికీ క్రికెటర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. మాస్క్‌లు ధరించే బయట తిరగాలి" అని బీసీసీఐ కోశాధికారి అరుణ్‌ ధుమాల్‌ సూచించారు. యూకేలో ఇప్పటికీ రోజుకు 10వేల కొత్త కేసులు వస్తున్నాయి. ఒకవేళ ఆటగాళ్లకు కరోనా సోకితే ఐదు రోజులు ఐసోలేషన్‌లో ఉండాల్సిందే. దీనికితోడు ఎడ్జ్‌బాస్టన్‌ టెస్టుకు కూడా అందుబాటులో ఉండడం కష్టమే. అందుకే కరోనా విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆటగాళ్లకు బీసీసీఐ సూచిస్తోంది. చివరి టెస్టు ఆడాల్సిన ఉన్న అశ్విన్‌ కొంచెం ఆలస్యంగా భారత జట్టులో చేరనున్నాడు. గతవారం కరోనా పాజిటివ్‌గా తేలిన అశ్విన్‌.. జట్టుతో పాటు ఇంగ్లాండ్‌ వెళ్లలేకపోయాడు. కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకున్నాడు. బుధవారం ఇంగ్లాండ్‌ బయల్దేరే అవకాశముందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఈనెల 24న లీసెస్టర్‌తో జరిగే నాలుగు రోజుల వార్మప్‌ మ్యాచ్‌కు అశ్విన్‌ అందుబాటులో ఉంటాడని పేర్కొన్నాయి.

ఇవీ చదవండి:మరో సూపర్​ రికార్డుకు చేరువలో హర్మన్‌.. మిథాలీని అధిగమిస్తుందా?

లంక రికార్డ్​ విక్టరీ.. 30ఏళ్ల తర్వాత ఆసీస్​పై...

ABOUT THE AUTHOR

...view details