లంక రికార్డ్​ విక్టరీ.. 30ఏళ్ల తర్వాత ఆసీస్​పై...

author img

By

Published : Jun 22, 2022, 7:17 AM IST

Srilanka VS Australia
శ్రీలంకదే సిరీస్​ ()

SL Vs Aus: ఆస్ట్రేలియాతో ఐదు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలుండగానే 3-1తో చేజిక్కించుకుంది లంక జట్టు. దీంతో ఆ జట్టు తమ సొంతగడ్డపై 30ఏళ్ల తర్వాత ఆసీస్​ను ఓడించినట్టైంది.

SL Vs Aus: శ్రీలంక క్రికెట్‌ జట్టు చాలా ఏళ్లు తర్వాత అద్భుత ప్రదర్శనతో ఓ బడా జట్టుపై సిరీస్‌ సాధించింది. సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో ఐదు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలుండగానే 3-1తో చేజిక్కించుకుంది. మంగళవారం ఉత్కంఠభరితంగా సాగిన నాలుగో వన్డేలో లంక 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో 30ఏళ్ల తర్వాత(చివరిసారిగా 1992లో) సొంతగడ్డపై ఆసీస్​ను ఓడించింది లంక జట్టు. మొదట లంక సరిగ్గా 50 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌటైంది. 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ లంకకు ధనంజయ డిసిల్వా తో(60) కలిసి అసలంక (110; 106 బంతుల్లో 10×4, 1×6) పోరాడే స్కోరు అందించాడు. ఆసీస్‌ బౌలర్లలో కమిన్స్‌ (2/37), మిచెల్‌ మార్ష్‌ (2/29), కునెమన్‌ (2/56) రాణించారు.

అనంతరం కరుణరత్నె (2/19), ధనంజయ డిసిల్వా (2/39), వాండర్సే (2/40)ల ధాటికి ఆసీస్‌ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయినా.. ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ (99; 112 బంతుల్లో 12×4) జట్టును లక్ష్యం దిశగా నడిపించాడు. కానీ 13 ఓవర్లలో 67 పరుగుల చేయాల్సిన స్థితిలో వార్నర్‌ ఏడో వికెట్‌ రూపంలో నిష్క్రమించడంతో మ్యాచ్‌ లంక వైపు మొగ్గింది. ఈ స్థితిలో కమిన్స్‌ (35) గొప్పగా పోరాడినా.. చివర్లో కునెమన్‌ (15) కూడా తన వంతు ప్రయత్నం చేసినా.. విజయం లంకనే వరించింది. ఈ పర్యటన ఆరంభంలో టీ20 సిరీస్‌ను 2-1తో నెగ్గిన ఆసీస్‌.. వన్డే సిరీస్‌లోనూ శుభారంభం చేసింది. కానీ తర్వాత గొప్పగా పుంజుకున్న లంక వరుసగా మూడు మ్యాచ్‌ల్లో నెగ్గి సిరీస్‌ను సొంతం చేసుకుంది. నామమాత్రమైన చివరి వన్డే శుక్రవారం జరుగుతుంది. తర్వాత ఇరు జట్లూ రెండు టెస్టుల సిరీస్‌లో తలపడతాయి.

ఇదీ చూడండి: దీపక్​కు మరో ఐదు వారాలు.. లాంక్‌షైర్‌కు సుందర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.