తెలంగాణ

telangana

AB De Villiers RCB: ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్‌గా ఏబీ డివిలియర్స్‌!

By

Published : Dec 4, 2021, 10:28 PM IST

AB De Villiers RCB: ఇటీవలే క్రికెట్​లోని అన్ని ఫార్మాట్లకూ గుడ్​బై చెప్పాడు దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్. అయితే.. ఐపీఎల్​లో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు తరఫున ప్రాతినిధ్యం వహించిన అతడు.. మరోసారి ఆర్సీబీకి సేవలందించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఐపీఎల్ సీజన్​లో ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్​ బాధ్యతలు తీసుకోనున్నట్లు సమాచారం.

de villiers
డివిలియర్స్

AB De Villiers RCB: దక్షిణాఫ్రికా స్టార్‌ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. కానీ, వివిధ దేశాలు నిర్వహించే లీగ్‌ల్లో మొన్నటివరకు ఆడాడు. ఇటీవల దుబాయ్‌లో ముగిసిన ఐపీఎల్-14లోనూ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తరఫున ప్రాతినిధ్యం వహించాడు. అయితే, అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఈ నవంబర్‌లో ఏబీ ఓ కీలక ప్రకటన చేశాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకొంటున్నట్లు వెల్లడించాడు. దీంతో ఏబీ అభిమానులతోపాటు ఆర్సీబీ ఫ్యాన్స్‌ నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో వీరికి కాస్త ఉపశమనం కలిగించే వార్త ఇప్పుడు ఒకటి బయటికొచ్చింది. అదేంటంటే ఆటగాడికి రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆర్సీబీకి దూరమైన ఏబీ.. వచ్చే సీజన్‌లో ఆ ఫ్రాంచైజీకి బ్యాటింగ్‌ కోచ్‌గా వచ్చే అవకాశముంది. ఈ సంకేతాలను టీమ్‌ఇండియా మాజీ బ్యాటింగ్‌ కోచ్‌, ప్రస్తుత ఆర్సీబీ హెడ్‌ కోచ్‌ సంజయ్ బంగర్ ఇచ్చాడు. ఇటీవల క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆటగాళ్లు ఆర్సీబీ కోసం భిన్నమైన పాత్రలను పోషించడానికి ఆసక్తి కనబరుస్తున్నారని పేర్కొన్నాడు.

ఏబీ డివిలియర్స్ లాంటి ఆటగాడికి బ్యాటింగ్ కోచ్‌గా నియమిస్తే.. అది ఆటగాళ్లకు, జట్టుకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని సంజయ్ బంగర్‌ అన్నాడు. అయితే, బంగర్‌ చెప్పింది నిజం అయ్యేందుకు ఆస్కారం ఉంది. ఎందుకంటే ఆర్సీబీలో కీలక ఆటగాడైన విరాట్ కోహ్లితో డివిలియర్స్‌కి మంచి స్నేహాం ఉంది. అంతేకాక రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు యాజమాన్యంతో కూడా ఏబీకి మంచి సంబంధాలున్నాయి. అయితే, ఏ విషయంపై ఆర్సీబీ యాజమాన్యం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ABOUT THE AUTHOR

...view details