తెలంగాణ

telangana

నెల్లూరు చేపల పులుసు.. తిన్నారంటే అదుర్స్​!

By

Published : Sep 22, 2021, 7:03 AM IST

చేపల పులుసుకు ఫేమస్​ నెల్లూరు. కొరమేను చేపతో వండే ఈ చేపల పులుసు అంటే చాలామంది లొట్టలు వేసుకుని మరీ తింటారు. అయితే దీని తయారీ విధానం చాలా మందికి తెలియదు. అలాంటి వారి కోసం నెల్లూరు స్పెషల్​ చేపల పులుసు ఎలా చేస్తారో ఓసారి చూద్దాం.

Nellore Chepala Pulusu
నెల్లూరు చేపల పులుసు

నాన్​వెజ్ ప్రియులకు చికెన్​, మటన్​ తిని బోరు అనిపించినప్పుడు.. వారి దృష్టి చేపలమీదకు వెళ్తుంది. చేపలతో పులుసు, వేపుడు సహా పలు రకాల వంటకాలు చేసుకోవచ్చు. అయితే కాస్త వెరైటీగా చేయాలనుకున్నప్పుడు.. ఏం చేయాలో ఒక్కోసారి తెలియదు. అందుకే ఈ సారి 'నెల్లూరు చేపల పులుసు' ట్రై చేయండి.

నెల్లూరు చేపల పులుసు తయారు చేసే విధానం..

ముందుగా మెంతులు, ఆవాలను ఒక చిన్న బాండిల్​లోకి తీసుకొని వేడి చేయాలి. మాడిపోకుండా వాటిని అటుఇటూ తిప్పుతూ ఉండాలి. తరువాత వాటిని చిన్న రోలులోకి తీసుకుని మెత్తగా దంచాలి. వెల్లుల్లి, అల్లాన్ని అదే రోలులో వేసుకుని దంచాలి. ఇలా ఫ్రెష్​గా దంచుకున్న దానిని చేపల పులుసులో వేసుకుంటే మంచి రుచి వస్తుంది. పులుసుకు సంబంధించిన గిన్నెను తీసుకోవాలి. దానిని గ్యాస్ మీద పెట్టుకుని నూనె పోయాలి. అందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు వేసుకుని దోరగా వేయించాలి. కొద్ది సమయం తరువాత ముందుగా దంచిపెట్టుకున్న అల్లం, వెల్లుల్లి వేయాలి. వాటితో పాటే కట్​ చేసుకున్న టొమాటో ముక్కలను అందులో వేసుకోవాలి. కొన్ని మామిడి ముక్కలను జోడించాలి. కొంత సమయం తరువాత కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడిని మిశ్రమంలో వేసుకోవాలి. వాటిని బాగా మగ్గనివ్వాలి. అనంతరం చింతపండు పులుసును అందులో కలపాలి. సరిపడా నీటిని అందులో పోసుకుని రంగరించినట్లు తిప్పాలి. ముందుగా దంచి పెట్టుకున్న మెంతులు, ఆవాల మిశ్రమాన్ని కలుపుకోవాలి. పులుసు పాత్రపై కొంతసమయం మూత పెట్టి.. ఒక పొంగు వచ్చే వరకు వెయిట్​ చేయాలి. లవంగాలను దంచి పులుసులో కలపాలి. తరువాత నెల్లూరు స్పెషల్​ కొరమేను చేప ముక్కలను పులుసులో వేసుకోవాలి. ముక్కలు ఉడికేంత వరకు అలానే ఉంచి చివరగా కొత్తిమీరను పైన చల్లుకుంటే నెల్లూరు చేపల పులుసు రెడీ.

కావాల్సిన పదార్థాలు..

  • మెంతులు
  • ఆవాలు
  • అల్లం
  • వెల్లుల్లి
  • నూనె
  • పసుపు
  • ఉల్లిపాయలు
  • పచ్చిమిర్చి
  • కరివేపాకు
  • ఉప్పు
  • టొమాటో
  • మామిడి ముక్కలు
  • చింతపండు రసం
  • ధనియాల పొడి
  • కారం
  • జీలకర్రపొడి
  • లవంగాలు

ఇదీ చూడండి:నోరూరించే 'గోవా చేపలకూర'.. ట్రై చేయండిలా?

ABOUT THE AUTHOR

...view details