తెలంగాణ

telangana

ప్రధాని మోదీని పలకరించిన జిన్​పింగ్.. గల్వాన్ ఘర్షణ తర్వాత ఇరుదేశాల నేతలు ఇలా..

By

Published : Nov 15, 2022, 10:44 PM IST

Xi Jinping Meets Modi : భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్​పింగ్ ఒకరినొకరు పలకరించుకున్నారు. ఇండోనేషియాలో జరుగుతున్న జీ-20 సమావేశంలో ఇరుదేశాల నేతలు పరస్పరం చేతులు కలిపి.. కాసేపు ముచ్చటించారు.

xi jinping meets modi
ప్రధాని మోదీ జిన్​పింగ్

Xi Jinping Meets Modi : దాదాపు రెండేళ్ల తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌లు ఒకరినొకరు పలకరించుకున్నారు. ఇండోనేషియాలో జరుగుతోన్న జీ-20 సదస్సులో భాగంగా మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన విందు కార్యక్రమం దీనికి వేదికైంది. ఈ సందర్భంగా ఒకరికొకరు ఎదురుపడిన నేతలు.. పరస్పరం చేతులు కలిపి, ముచ్చటించారు. జిన్‌పింగ్‌తో ప్రధాని మోదీ సంభాషిస్తున్నట్లు వీడియోలు బయటకు వచ్చాయి. వాస్తవానికి.. జీ-20 సదస్సు క్రమంలో ఈ ఇద్దరు నేతల మధ్య భేటీ జరిగే అవకాశంపై వార్తలు వచ్చాయి. కానీ, ఇప్పటివరకు ఏ సమావేశం ఖరారు కాలేదని తెలుస్తోంది.

డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రోస్‌ అథానోమ్​తో ప్రధాని నరేంద్ర మోదీ

2020 తర్వాత ఇరువురు ముఖాముఖి మాట్లాడుకోవడం ఇదే మొదటిసారి. అదే ఏడాదిలో భారత్‌- చైనాల మధ్య గల్వాన్‌ లోయలో ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ ఏడాది సెప్టెంబరులో ఉజ్బెకిస్థాన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సులో భాగంగా.. ఈ ఇద్దరు నేతలు ఒకరికొకరు ఎదురుపడినప్పటికీ పలకరించుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా.. జీ-20 సదస్సులో భాగంగా ప్రధాని మోదీ ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌తోపాటు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మెక్రాన్‌ తదితరులతో భేటీ అయ్యారు. భారత్‌కు చెందిన ఐఎంఎఫ్‌ డిప్యూటీ ఎండీ గీతా గోపీనాథ్‌, డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రోస్‌ అథానోమ్‌, ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు డేవిడ్‌ మాల్పాస్‌ తదితరులను కలిశారు.

ఐఎంఎఫ్‌ డిప్యూటీ ఎండీ గీతా గోపీనాథ్‌తో ప్రధాని మోదీ

ABOUT THE AUTHOR

...view details