తెలంగాణ

telangana

'వైరస్‌లు వేగంగా వ్యాపిస్తున్నాయ్‌ జాగ్రత్త!'.. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక

By

Published : Dec 13, 2022, 8:55 AM IST

ప్రస్తుత సీజన్‌లో కరోనాతోపాటు ఇతర రకాల వ్యాధికారకాలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో వైరస్‌ల వ్యాప్తిని కట్టడి చేయడంతో పాటు పౌరులు స్వీయ జాగ్రత్తలు పాటించాలని సూచించింది.

World Health Organization warning nations
ప్రపంచ ఆరోగ్య సంస్థ

కొవిడ్-19 మహమ్మారితో వణికిపోయిన ప్రపంచ దేశాలు.. ఇప్పుడిప్పుడే దాని ప్రభావం నుంచి బయటపడుతున్నాయి. ఇదే సమయంలో వైరస్‌ల వ్యాప్తి కట్టడిపై పలు దేశాలు అలసత్వం వహిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పలు రకాల వైరస్‌లు, వ్యాధికారకాలు ప్రస్తుతం అత్యధిక వేగంతో వ్యాపిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ముఖ్యంగా కొవిడ్-19, ఫ్లూతోపాటు ఇతర వ్యాధి కారకాలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని.. పౌరులు ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా ఉండాలని సూచించింది.

"జాగ్రత్తగా ఉండండి. కొవిడ్‌-19, ఫ్లూ, శ్వాసకోశ వ్యాధి వైరస్​లతోపాటు ఇతర వ్యాధికారకాలు వేగంగా వ్యాపిస్తున్నాయి. మీరు, మీ సన్నిహితులు సురక్షితంగా ఉండేందుకు ఉన్న అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాక్సిన్‌లు తీసుకోవడం, మాస్కులు, భౌతిక దూరం, వెంటిలేషన్‌, స్వీయ పరీక్షలు, అనారోగ్యం బారిన పడితే ఇంటి దగ్గరే ఉండటం, చేతులు శుభ్రపరచుకోవడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ముప్పును ముందే తెలుసుకోవడం ద్వారా వాటి తీవ్రతను తగ్గించవచ్చు" అని ప్రపంచ ఆరోగ్య సంస్థలోని కొవిడ్‌-19 సాంకేతిక విభాగాధిపతి మారియా వాన్‌ కేర్ఖోవ్‌ స్పష్టం చేశారు.

ఇక కొవిడ్‌ ఒమిక్రాన్‌ వేరియంట్‌పై మాట్లాడిన ఆమె.. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం 500లకు పైగా ఒమిక్రాన్‌ ఉపరకాలు వ్యాప్తిలో ఉన్నాయని చెప్పారు. ఈ వేరియంట్ల వ్యాప్తి, రోగనిరోధకత నుంచి అవి ఏ విధంగా తప్పించుకుంటున్నాయి.. వాటి తీవ్రత వంటి అంశాలు పరిశీలించాల్సి ఉందన్నారు.

అమెరికాలో ఇటీవల పెరుగుతోన్న శ్వాసకోశ సంబంధ కేసులను డబ్ల్యూహెచ్‌ ఓ నిపుణులు ప్రధానంగా ప్రస్తావించారు. ఈ సీజన్‌లో 1.3కోట్ల శ్వాసకోశ సంబంధ కేసులు నమోదు కాగా లక్షా 20వేల మంది ఆస్పత్రిలో చేరారు. 7300 ఫ్లూ మరణాలు సంభవించినట్లు సీడీసీ నివేదిక వెల్లడించింది. దీంతో న్యూయార్క్‌, కాలిఫోర్నియా, మైనీ, లుసియానా రాష్ట్రాల్లో అప్రమత్తమైన ఆరోగ్యశాఖ అధికారులు.. ప్రజలను ఫ్లూ, కొవిడ్‌ టీకాలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details