తెలంగాణ

telangana

37వేల అడుగుల ఎత్తులో విమానం.. డోర్ తీయబోయిన మహిళ.. దేవుడు చెప్పాడంటూ..

By

Published : Nov 30, 2022, 7:27 PM IST

Updated : Nov 30, 2022, 7:44 PM IST

ఓ మహిళ దేవుడు చెప్పాడంటూ 37వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానం డోర్‌ తీసేందుకు ప్రయత్నించింది. ఈ ఘటన అమెరికాలో జరిగింది. దీంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది.

woman-tried-to-open-plane-door-when-its-at-37000-feet-high
విమానం

వేల అడుగుల ఎత్తులో విమానం ప్రయాణిస్తుండగా ఓ మహిళ విపరీత చర్యకు పాల్పడింది. దేవుడు చెప్పాడంటూ విమానం డోర్ తీసేందుకు ప్రయత్నించింది. అడ్డుకున్న తోటి ప్రయాణికుడిని గాయపర్చింది. దీంతో తప్పనిసరి పరిస్థితుత్లో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్‌ చేయాల్సి వచ్చింది. విమాన సిబ్బంది, ప్రయాణికులను భయాందోళనకు గురిచేసిన ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. అమెరికా మీడియా కథనాలు వెల్లడించిన వివరాల ప్రకారం..

టెక్సాస్‌కు చెందిన 34 ఏళ్ల ఎలోమ్‌ అగ్బెనినో ఇటీవల ఒహైయోలోని కొలంబస్‌ వెళ్లేందుకు టెక్సాస్‌ నుంచి సౌత్‌వెస్ట్‌ విమానంలో బయల్దేరింది. అయితే విమానం గాల్లో ప్రయాణిస్తుండగా.. ఎలోమ్‌ తన సీటు నుంచి లేచి వెళ్లి ఎగ్జిట్ డోర్‌ను తదేకంగా చూస్తూ నిలబడింది. ఆమెను గమనించిన విమాన సిబ్బంది ఒకరు సీట్లో కూర్చోవాలని సూచించారు. అప్పుడు ఆమె తాను కిటికీ నుంచి బయటకు చూస్తానని చెప్పింది. అందుకు సిబ్బంది అంగీకరించలేదు.

వెంటనే ఆమె వారిని నెట్టుకుంటూ వెళ్లి.. ఎగ్జిట్‌ డోర్‌ హ్యాండిల్‌ పట్టుకుని తెరిచేందుకు ప్రయత్నించింది. ‘‘దేవుడు నన్ను ఒహైయో రమ్మన్నాడు. విమానం డోర్‌ తీయమని దేవుడే చెప్పాడు’’ అంటూ గట్టి గట్టిగా అరవడంతో తోటి ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఆ సమయంలో విమానం గాల్లో 37వేల అడుగుల ఎత్తులో ఉంది. ఎలోమ్‌ను అడ్డుకునేందుకు తోటి ప్రయాణికుడొకరు ప్రయత్నించగా.. అతడిని ఆమె గట్టిగా కొరికి గాయపర్చింది.

ఈ అనూహ్య పరిణామంతో అప్రమత్తమైన పైలట్ వెంటనే విమానాన్ని అర్కన్సాస్‌లోని బిల్‌ అండ్‌ హిల్లరీ క్లింటన్‌ నేషనల్‌ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. విమానం సురక్షితంగా దిగిన తర్వాత ఎయిర్‌పోర్టు పోలీసులు ఎలోమ్‌ను అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆమెను కోర్టులో హాజరుపర్చారు. అయితే తాను భర్తకు చెప్పకుండానే ఒహైయోకు బయల్దేరినట్లు ఎలోమ్‌ పోలీసులు విచారణలో చెప్పిందట. ఆమె మానసిక స్థితి కూడా సరిగ్గా లేనట్లు తెలుస్తోంది.

Last Updated : Nov 30, 2022, 7:44 PM IST

ABOUT THE AUTHOR

...view details