తెలంగాణ

telangana

అమెరికా వీసా మరింత భారం! దరఖాస్తు ఫీజు భారీగా పెంపు!!

By

Published : Jan 5, 2023, 5:26 PM IST

అమెరికా వీసా దరఖాస్తు రుసుమును పెంచేందుకు బైడెన్ ప్రభుత్వం సిద్ధమైంది. త్వరలోనే కొత్త ధరలు అమల్లోకి వచ్చే అవకాశముంది.

The Biden administration has increased visa fees2023
వీసా రుసుమును భారీగా పెంచిన బైడెన్ ప్రభుత్వం

అమెరికా వెళ్లాలనుకునే భారతీయుల కల ఇకపై మరింత భారం కానుంది. ఇమ్మిగ్రేషన్‌ ఫీజులను భారీగా పెంచుతూ బైడెన్‌ సర్కారు ప్రతిపాదనలు చేసింది. దీంతో హెచ్‌-1బీ సహా పలు రకాల వీసా దరఖాస్తు ధరలు మరింత ప్రియం కానున్నాయి. ఈ ప్రతిపాదనలను త్వరలోనే అమల్లోకి తెచ్చే అవకాశాలున్నాయి.

ఇమ్మిగ్రేషన్‌ ఫీజుల పెంపు ప్రతిపాదనలను అమెరికా పౌరసత్వం, వలస సేవల విభాగం తమ వెబ్‌సైట్‌లో వెల్లడించింది. దాని ప్రకారం.. హెచ్‌-1బీ వీసా దరఖాస్తు ధరను 460 డాలర్ల నుంచి 780 డాలర్లకు పెంచింది. ఎల్‌-1 వీసా ధర 460 డాలర్ల నుంచి ఏకంగా 1385 డాలర్లకు పెంచాలని ప్రతిపాదించింది. O-1 వీసా ధరను 460 డాలర్ల నుంచి 1,055 డాలర్లకు పెంచాలని భావిస్తోంది. ఇక, హెచ్‌-2బీ వీసా ధరను 460 డాలర్ల నుంచి 1,080 డాలర్లకు పెంచాలని నిర్ణయించింది.

ఈ ప్రతిపాదనలను 60 రోజుల పాటు వెబ్‌సైట్‌లో ఉంచి.. వారి అభిప్రాయాలను స్వీకరిస్తారు. ఆ తర్వాత దీన్ని అమల్లోకి తెచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఖర్చు భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగానే ఫీజులను పెంచినట్లు యూఎస్‌సీఐఎస్‌ వెల్లడించింది. అంతేగాక, ఈ నిర్ణయంతో పెండింగ్‌ వీసాల సంఖ్య కూడా తగ్గే అవకాశముందని తెలిపింది. ఈ ఏజెన్సీకి 96శాతం నిధులు.. వీసా దరఖాస్తు ఫీజుల ద్వారానే వస్తున్నాయి. 2020లో కొవిడ్‌ కారణంగా వీసా దరఖాస్తులు భారీగా తగ్గాయి. దీంతో ఏజెన్సీ ఆదాయం 40శాతానికి పైగా పడిపోయింది. నిధుల లేమి కారణంగా.. ఏజెన్సీలో నియామకాలు నిలిపివేశారు. సిబ్బందిని కూడా తగ్గించారు. దీంతో పెండింగ్‌ వీసా దరఖాస్తులు పెరిగాయి.

ABOUT THE AUTHOR

...view details