తెలంగాణ

telangana

నెలనెలా రూ.5.5 లక్షలు.. అలా 25 ఏళ్లపాటు.. ఎంత అదృష్టవంతుడో!

By

Published : Jul 29, 2023, 8:17 AM IST

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తికి భారీ లాటరీ తగిలింది. యూఏఈ నిర్వహించిన మెగా ప్రైజ్‌ మనీ లక్కీ డ్రాలో అతడు తొలి విజేతగా నిలిచాడు. దీంతో నెలనెలా రూ.5.5లక్షల చొప్పున 25 ఏళ్ల పాటు అందుకోనున్నాడు.

lottery
lotteryemirates draw winners list

ఏ పని చేయకుండా.. నెలనెలా లక్షల రూపాయలు వస్తే ఎలా ఉంటుంది? అలా ఒక నెల, సంవత్సరం కాదు.. ఏకంగా 25 ఏళ్ల పాటు వస్తే!.. ఇంకేంటి పండగే అనుకుంటాం. ఇప్పుడు ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన ఓ వ్యక్తి ఇదే జరగనుంది. అతడికి ఏకంగా నెలకు రూ.5.5 లక్షల చొప్పున 25 ఏళ్ల పాటు వచ్చే జాక్‌పాట్‌ తగిలింది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ నిర్వహించిన ఫాస్ట్‌ 5 లాటరీలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒకరు మెగా ప్రైజ్‌ మనీ విజేతగా నిలిచాడు. దీంతో అతడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

అతడు ఎవరు? ఎంత గెలుచుకున్నాడు?
ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన మొహమ్మద్​ ఆదిల్​ ఖాన్​ అనే వ్యక్తి.. గత కొంతకాలంగా దుబాయ్​లోని ఒక రియల్ ఎస్టేట్​ సంస్థలో ఇంటీరియర్ డిజైన్​ కన్సల్టెంట్​గా పనిచేస్తున్నాడు. ఇటీవలే యూఏఈ.. ఫాస్ట్​-5 పేరుతో లాటరీ నిర్వహించింది. ఈ మెగా ప్రైజ్​ మనీ డ్రాలో అతడు మొదటి విజేతగా నిలిచాడు. ఈ మేరకు గురువారం.. లాటరీ నిర్వాహకులు వెల్లడించారు. ఆ లాటరీ ప్రకారం.. విజేతకు నెలకు రూ.5,59,822 (25,000 దిర్హమ్‌లు) చొప్పున 25 ఏళ్లపాటు ఇవ్వనున్నారు.

'ఇప్పటికీ నమ్మలేకుపోతున్నా'
భారీ లాటరీ విజేతగా నిలిచిన ఆదిల్‌ ఖాన్‌ ఉబ్బితబ్బివుతున్నాడు. "డ్రాలో విజేతగా నిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా ముఖ్య సమయంలో డబ్బులు రాబోతున్నాయి. నా కుటుంబానికి నేనే ఏకైక జీవనాధారం. కొవిడ్‌ సమయంలో మా అన్న చనిపోయాడు. అతడి కుటుంబాన్నీ నేనే పోషిస్తున్నాను. నాకు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు, ఐదేళ్ల పాప ఉంది. ఇలాంటి సమయంలో ఇలా అదనపు రాబడి నాకు ఎంతో కీలకం. నేను లాటరీ గెలిచానని ఇంట్లో చెప్పినప్పుడు మా కుటుంబం తొలుత నమ్మలేదు. ఆ వార్త నిజమో లేదో తెలుసుకోవడానికి ఒకటికి రెండుసార్లు సరిచూసుకోమని చెప్పారు. ఇప్పటికీ ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నా" అని ఆదిల్‌ ఖాన్‌ చెప్పాడు.

ఎమిరైట్స్‌ లాటరీ నిర్వహించే టైచెరస్‌ మార్కెటింగ్‌ హెడ్‌ కూడా మాట్లాడారు. "ఫాస్ట్‌ 5 లక్కీడ్రాను ప్రారంభించిన 8 వారాలలోపే తొలి విజేతను ప్రకటిస్తున్నందుకు ఆనందంగా ఉంది. స్వల్ప సమయంలోనే ఓ వ్యక్తి మల్టీ మిలియనీర్‌ కావడానికి మేము ఫాస్ట్‌ 5ను తీసుకొచ్చాం. విజేత ప్రయోజనాలను ఆశించే ఒకేసారి కాకుండా నెలకోసారి ఇలా డబ్బులు ఇచ్చే ఆలోచన చేశాం" అని ఆయన పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details