తెలంగాణ

telangana

ఆధునిక బానిసత్వంలో 5 కోట్ల మంది.. భారత్​లో పెరిగిన బలవంతపు పెళ్లిళ్లు

By

Published : Sep 14, 2022, 6:27 AM IST

ప్రపంచవ్యాప్తంగా ఆధునిక బానిసత్వం పెరిగిందని ఐరాస అనుబంధ సంస్థల నివేదిక వెల్లడించింది. కొవిడ్‌ మహమ్మారి వల్ల అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌, భారత్‌, ఈజిప్ట్‌ తదితర దేశాల్లో బలవంతపు పెళ్లిళ్లు పెరిగిపోయాయనీ, వాటిలో అత్యధికం బాల్య వివాహాలని నివేదిక పేర్కొంది.

un-slavery-report-2021
un-slavery-report-2021

Modern slavery UN report: ప్రపంచవ్యాప్తంగా బానిసత్వంలో మగ్గిపోతున్న వారి సంఖ్య 2021లో 5 కోట్లకు చేరిందని ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు వెల్లడించాయి. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ), అంతర్జాతీయ వలసల సంస్థ (ఐఓఎం), అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ వాక్‌ ఫ్రీ సంయుక్తంగా వెలువరించిన నివేదిక వీరిని ఆధునిక బానిసలుగా వర్ణించింది. 2016తో పోలిస్తే 2021లో వీరి సంఖ్య అదనంగా కోటి పెరిగింది. ఆధునిక బానిసత్వం అన్ని దేశాల్లోనూ కనిపిస్తోంది.

కొవిడ్‌ మహమ్మారి వల్ల అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌, భారత్‌, ఈజిప్ట్‌ తదితర దేశాల్లో బలవంతపు పెళ్లిళ్లు పెరిగిపోయాయనీ, వాటిలో అత్యధికం బాల్య వివాహాలని నివేదిక పేర్కొంది. అంతర్జాతీయ ఆధునిక బానిసత్వ అంచనా పేరిట వెలువడిన నివేదిక ప్రకారం 2.8 కోట్ల మంది నిర్బంధ శ్రమలో, 2.2 కోట్ల మంది బలవంతపు పెళ్లిళ్లలో చిక్కుకుపోయారు. ఆసియా-పసిఫిక్‌ దేశాల్లో బలవంతపు వివాహాలు ఎక్కువ. ఇక్కడ ప్రతి 1000 మంది జనాభాలో 3.3 నిర్బంధ వివాహాలు జరిగాయి. జనాభా నిష్పత్తి పరంగా చూస్తే అరబ్‌ దేశాల్లో ఈ తరహా పెళ్లిళ్లు అధికం. అక్కడ ప్రతి 1000 మందిలో 4.8 కేసులు ఇవే. ఉత్తర, దక్షిణ అమెరికాలలో అతి తక్కువగా 1000 మందికి 1.5 బలవంతపు పెళ్లిళ్లు జరిగాయి.

కొవిడ్‌ 19 వల్ల ప్రపంచంలో ప్రతి ప్రాంతంలో బలవంతపు పెళ్లిళ్లు పెరిగిపోయాయి. 16 ఏళ్లు లేక అంతకన్నా తక్కువ వయసులోనే బలవంతపు పెళ్లి చేసుకోవలసి వస్తున్న బాలబాలికల సంఖ్య మనకు తెలిసిన దాని కన్నా ఎక్కువేనని సమితి అనుబంధ సంస్థల నివేదిక పేర్కొంది. నిర్బంధ వివాహాల్లో 85 శాతానికి పైగా కుటుంబ పెద్దలు జరిపిస్తున్నవే. 65 శాతం నిర్బంధ వివాహాలు ఆసియా, పసిఫిక్‌ దేశాల్లో జరుగుతున్నాయి.

నిర్బంధ శ్రమ
బలవంతపు పెళ్లిళ్లు, నిర్బంధ శ్రమ పేద దేశాలకే పరిమితమనుకుంటే పొరపాటు. 52 శాతం నిర్బంధ శ్రమ, 25 శాతం బలవంతపు పెళ్లిళ్లు అధికాదాయ, ఎగువ శ్రేణి మధ్యాదాయ దేశాల్లో సంభవించాయి. నిర్బంధ శ్రమలో మగ్గిపోతున్న వారిలో 82 శాతం మంది ప్రైవేటు రంగంలోనే కనిపిస్తున్నారు. నిర్బంధ శ్రమలో 23 శాతం బలవంతపు వ్యభిచార కేసులే. లైంగిక దోపిడీకి గురవుతున్న ప్రతి అయిదుగురిలో నలుగురు యువతులు కాగా, నిర్బంధ శ్రమకు గురవుతున్న ప్రతి ఎనిమిది మందిలో ఒకరు బాలలే. వలస కార్మికులు ఎక్కువగా నిర్బంధ శ్రమ చేయవలసివస్తోంది. ఆధునిక బానిసత్వాన్ని నిర్మూలించడం కేవలం ప్రభుత్వాల వల్లనే కాదని ఐఎల్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ గయ్‌ రైడర్‌ చెప్పారు. కార్మిక సంఘాలు, యజమానుల సంఘాలు, పౌర ఉద్యమకారులు, సామాన్య ప్రజలు అందరూ తమ వంతు కృషి జరపాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details