తెలంగాణ

telangana

రష్యాకు ఉక్రెయిన్ షాక్.. గ్యాస్ సరఫరాకు బ్రేక్!

By

Published : May 11, 2022, 4:43 PM IST

Ukraine Russia War

Ukraine Russia War: ఉక్రెయిన్‌పై సైనికచర్యకు దిగిన రష్యాకు కీవ్‌ బలగాల నుంచి గట్టి ప్రతిఘటన ఎదురవుతున్న వేళ మరో ఎదురుదెబ్బ తగిలింది. ఉక్రెయిన్‌ మీదుగా పశ్చిమ యూరప్‌కు సరఫరా అయ్యేరష్యా సహజవాయువును అడ్డుకుంది. ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి మాస్కో సహజవాయువు సరఫరాపై ప్రభావం పడింది. దీంతో మాస్కో మరో మార్గాన్ని ఎంచుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

Ukraine Russia War: తూర్పు ప్రాంతంలో ఉక్రెయిన్‌ పట్టు సాధిస్తోంది. ఒక హబ్‌లో రష్యా సహజ వాయువును అడ్డుకుంది. ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి రష్యా సహజ వాయువు సరఫరాపై ప్రభావం పడింది. ఉక్రెయిన్‌కు చెందిన సహజ వాయువు పైప్‌లైన్ ఆపరేటర్ తూర్పు ప్రాంతంలోని కీలక కేంద్రం ద్వారా రష్యా సహజ వాయువును నిలిపివేశారు. మాస్కో మద్దతు కలిగిన వేర్పాటువాదులు నియంత్రించే ప్రాంతమైన నోవోప్‌స్కోవ్ హబ్ ద్వారా రష్యా సహజ వాయువును అడ్డుకున్నట్లు తెలిపారు. ఉక్రెయిన్ మీదుగా పశ్చిమ ఐరోపాకు వెళ్తున్న రష్యా గ్యాస్‌లో మూడోవంతు ఈ హబ్ ద్వారానే సరఫరా అవుతోంది.

తాము ఆ ప్రాంతం ద్వారా సరఫరా చేస్తున్న గ్యాస్ కేవలం పావువంతు అని రష్యా ప్రభుత్వ యాజమాన్యంలోని సహజ వాయువు దిగ్గజం గాజ్‌ప్రోమ్ పేర్కొంది. ఆక్రమిత శక్తుల జోక్యం కారణంగా రష్యా సహజవాయువు సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఉక్రెయిన్‌ ఆపరేటర్ చెప్పారు. ఉక్రెయిన్ నియంత్రణలోని ఉత్తర ప్రాంతం ప్రధాన కేంద్రమైన సుడ్జా ద్వారా రష్యా తన సహజవాయువు సరఫరాను మార్చుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఇది సాంకేతికంగా అసాధ్యమని గాజ్‌ ప్రోమ్‌ ప్రతినిధి తెలిపారు. గ్యాస్‌ సరఫరా నిలిపివేయటానికి కారణాలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

మరోవైపు ఖర్కివ్‌లోని పలు ప్రాంతాల నుంచి రష్యా బలగాలను తమ సేనలు తరుముతున్నట్లు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. నాలుగు గ్రామాల నుంచి మాస్కో బలగాలు వెనక్కి పోయినట్లు చెప్పారు. తాజా పరిణామాల నేపథ్యంలో యుద్ధానికి ముందు ఉన్న పరిస్థితికి చేరుకుంటామన్న విశ్వాసం కలుగుతోందని ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. మిలిటరీపరంగా బలంగా ఉంటే డాన్‌బాస్‌ పోరాటంలోను విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇది యుద్ధగతిని మారుస్తుందన్నారు.

ఇదీ చూడండి :ఆగని ఆగ్రహజ్వాల.. శ్రీలంక భవిష్యత్​ ఏంటి? భారత్​ ఏం చేయనుంది?

ABOUT THE AUTHOR

...view details