తెలంగాణ

telangana

మహిళా హక్కులు ప్రాధాన్యం కాదన్న తాలిబన్లు.. కాసేపటికే మాజీ చట్టసభ సభ్యురాలు దారుణ హత్య

By

Published : Jan 15, 2023, 9:58 PM IST

మహిళల చదువులు, హక్కులపై తాలిబన్లు ఆంక్షలు విధించడంపై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయినప్పటికీ అవి తమకు ప్రాధాన్యం కావని తాలిబన్లు స్పష్టం చేశారు. షరియా చట్టం ప్రకారమే తాము నడుచుకుంటామని వెల్లడించారు. ఇదిలా ఉండగా, అఫ్గాన్‌ మాజీ మహిళా చట్టసభ సభ్యురాలు ముర్షల్‌ నమీజాదాను గుర్తుతెలియని దుండగులు దారుణంగా కాల్చిచంపారు.

afghanistan taliban says womens rights
afghanistan taliban says womens rights

అఫ్గాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత అక్కడ అనేక ఆంక్షలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అమ్మాయిల చదువుపై తీవ్ర ఆంక్షలు విధించిన తాలిబన్లు.. యూనివర్సిటీలకు వెళ్లడం, ఎన్జీవోలలో పనిచేయడంపైనా నిషేధం విధించారు. తాలిబన్ల తీరుపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ వాటిని తిరిగి కొనసాగించడం తమ ప్రాధాన్యం కాదని తాలిబన్ల స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు.

'షరియా చట్టం ప్రకారమే అన్ని విషయాలపై నియంత్రణ ఉంటుంది. మహిళా హక్కుల ఆంక్షలపై వస్తోన్న ఆందోళనలపై తాలిబన్‌ నియమాలకు అనుగుణంగా వ్యవహరిస్తాం. దేశంలో ఇస్లామిక్‌ చట్టాన్ని అతిక్రమించే ఎటువంటి చర్యలనైనా తాము అనుమతించం' అని తాలిబన్‌ అధికార ప్రతినిధి జాబివుల్లా ముజాహిద్‌ వెల్లడించినట్లు అక్కడి ఖామా ప్రెస్‌ తెలిపింది.

మహిళలు ఎన్జీవోల్లో పనిచేయకూడదంటూ తాలిబన్లు ఇటీవలే కొత్త ఆంక్షలు విధించారు. దీంతో అక్కడి యూనివర్సిటీ విద్యార్థినిలు, మహిళా కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనలకు దిగారు. తాలిబన్ల తీరుపై దేశంలో చాలా చోట్ల తీవ్ర నిరసనలు వ్యక్తం కావడంతోపాటు అంతర్జాతీయ స్థాయిలోనూ విమర్శలు వెల్లువెత్తాయి. అమెరికా, జర్మనీ, ఈయూ దేశాలతోపాటు ఐరాస విభాగాలు కూడా తాలిబన్ల చర్యలను ఖండిస్తూ ఆంక్షలను ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశాయి. అటు ముస్లిం దేశాల కూటమి ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ కోఆపరేషన్‌ కూడా తాలిబన్‌ చర్యలను తప్పుపట్టింది. అయినప్పటికీ తాలిబన్లు మాత్రం తమ ఆంక్షలపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడం గమనార్హం.

దుండగుల చేతిలో మాజీ చట్టసభ్యురాలు దారుణ హత్య..
అఫ్గాన్‌ మాజీ మహిళా చట్టసభ సభ్యురాలు ముర్షల్‌ నమీజాదాను గుర్తుతెలియని దుండగులు దారుణంగా కాల్చిచంపారు.రాజధాని కాబూల్‌లోని ముర్షల్ ఇంట్లోని మొదటి అంతస్తులో ఆమె హత్యకు గురైనట్లు తాలిబన్‌ పోలీసులు వెల్లడించారు. ఘటనలో నమీజాదాతో పాటు ఆమె వ్యక్తిగత అంగరక్షకుడు మృతి చెందగా ఆమె సోదరుడితో పాటు మరో వ్యక్తికి బుల్లెట్‌ గాయాలైనట్లు తాలిబన్లు తెలిపారు. 2019లో అప్పటి అఫ్గాన్‌ ప్రజాస్వామ్య ప్రభుత్వానికి కాబూల్‌ తరఫున ఆమె గెలుపొందారు. అప్పట్నుంచి 2021లో తాలిబన్లు దేశాన్ని వశం చేసుకునే వరకు నమీజాదా ప్రభుత్వంలో కొనసాగారు. అఫ్గాన్‌ తాలిబన్‌ హస్తగతమైన తర్వాత అతితక్కువ మంది చట్టసభ సభ్యుల్లో నమీజాదా ఒకరు. పార్లమెంట్‌ రక్షణ కమిషన్‌లో ఆమె కీలక పాత్ర పోషించారు.

ABOUT THE AUTHOR

...view details