తెలంగాణ

telangana

చైనాకు షాక్!​- తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి అధికార పార్టీ విజయం

By ETV Bharat Telugu Team

Published : Jan 13, 2024, 10:46 PM IST

Updated : Jan 14, 2024, 7:04 AM IST

Taiwan Presidential Election 2024 Result : యుద్ధం కావాలా లేక శాంతి కావాలా తేల్చుకోవాలంటూ చేసిన హెచ్చరికలను తైవాన్‌ ప్రజలు బేఖాతరు చేసి, అధికార డెమొక్రాటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీకి విజయం కట్టబెట్టారు. ఈ మేరకు తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో డీపీపీకి చెందిన లాయ్​ చింగ్​ తె గెలుపొందారు.

Taiwan Presidential Election 2024 Result
Taiwan Presidential Election 2024 Result

Taiwan Presidential Election 2024 Result :తైవాన్‌ అధ్యక్ష ఎన్నికల్లో అధికార డెమొక్రాటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ-డీపీపీ మూడోసారి అధికారం చేపట్టనుంది. డీపీపీ తరఫున అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన తైవాన్‌ ఉపాధ్యక్షుడు లాయ్‌ చింగ్‌ తె విజయం సాధించారు. ఆయనతో తలపడిన ప్రతిపక్ష పార్టీల నేతలు కువోమింగ్‌ తాంగ్‌ పార్టీకి చెందిన హు యు ఇయ్‌, తైవాన్‌ పీపుల్స్‌ పార్టీకి చెందిన కోవెన్‌ జి ఓటమిని అంగీకరించారు.

మరోవైపు తైవాన్ అధ్యక్షుడిగా ఎన్నికైన లాయ్‌ చింగ్‌- తె, చైనా నుంచి తమ దేశ వాస్తవిక స్వాతంత్ర్యాన్ని కాపాడుతామని ప్రతిజ్ఞ చేశారు. ఇతర ప్రజాస్వామ్య దేశాలతో మరింత పొత్తు పెట్టుకుంటామని చెప్పారు. తైవాన్‌ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన తర్వాత తన మద్దతుదారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యం, నిరంకుశత్వం ఈ రెంటింటిలో ప్రజాస్వామ్యం పక్షాన మాత్రమే నిలబడతామని అంతర్జాతీయ సమాజానికి చెబుతున్నట్టు పేర్కొన్నారు. తైవాన్ రక్షణ ,ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తామని లాయ్‌ చింగ్‌- తె ధీమా వ్యక్తం చేశారు.

శనివారం ఉదయం 8 నుంచి ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 4కు ముగిసింది. అనంతరం ఓట్ల లెక్కింపు జరిగింది. రాబోయే నాలుగేళ్ళలో చైనాతో సంబంధాలను నిర్దేశించే ఎన్నికలు కావటం వల్ల తైవాన్‌ ప్రజలు అధికార డీపీపీ వైపు మళ్లీ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. అధికార పక్షం-డీపీపీ తరఫున అధ్యక్ష బరిలో నిలిచిన లాయ్‌ చింగ్‌ తెను వ్యతిరేకించిన చైనా యుద్ధం కావాలా లేక శాంతి కావాలా తేల్చుకోవాలంటూ చేసిన హెచ్చరికలను తైవాన్‌ ప్రజలు నిర్ధ్వందంగా తోసిపుచ్చినట్లు ఎన్నికల ఫలితాలు చాటుతున్నాయి.

చైనాతో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ తైవాన్‌ అధ్యక్ష ఎన్నికలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. తైవాన్ తమ భూభాగమే అంటూ డ్రాగన్‌ కొన్నేళ్లుగా వాదిస్తోంది. తరచూ ద్వీప దేశం చుట్టూ చైనా యుద్ధ విన్యాసాలు చేపడుతోంది. ఈ మధ్యే తైవాన్​ను విలీనం చేసుకునేందుకు ప్రణాళికను కూడా ఆవిష్కరించింది చైనా. మరోవైపు తైవాన్‌ ప్రస్తుత అధ్యక్షురాలు సాయ్‌ ఇంగ్-వెన్‌, ఉపాధ్యక్షుడు లాయ్‌ చింగ్‌లు తైవాన్‌పై బీజింగ్‌ సార్వభౌమాధికార వాదనలను వ్యతిరేకిస్తున్నారు.

Last Updated : Jan 14, 2024, 7:04 AM IST

ABOUT THE AUTHOR

...view details