తెలంగాణ

telangana

మహోగ్ర లంక.. నిరసనలతో అట్టుడికిన కొలంబో.. అధ్యక్షుడు పరార్‌

By

Published : Jul 10, 2022, 4:14 AM IST

Updated : Jul 10, 2022, 6:48 AM IST

Srilanka crisis: ఆర్థిక సంక్షోభంపై లంకలో వ్యక్తమవుతున్న నిరసనలు తారస్థాయికి చేరాయి. నిరసనకారులు అధ్యక్షుడు గోటబాయ రాజపక్స అధ్యక్ష భవనాన్ని చుట్టుముట్టారు. ప్రధాని విక్రమసింఘే ఇంటికి నిప్పంటించారు. మొత్తం మీద కొలంబో వీధుల్లో నిరసనకారులకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణల్లో 45 మందికి గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో పరారీలో ఉన్న అధ్యక్షుడు రాజపక్స.. పదవి నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించారు.

లంక
లంక

Srilanka crisis: కడుపు కాలిన సామాన్యుడి ఆగ్రహజ్వాల ఎంత తీవ్రంగా ఉంటుందో శ్రీలంక రాజధాని ప్రత్యక్షంగా చూసింది. పతాకస్థాయి ఆర్థిక సంక్షోభంతో నరకప్రాయ జీవితాన్ని అనుభవిస్తున్న ప్రజానీకం మహోగ్రసెగలు లంక పాలకుల్ని నేరుగా తాకాయి. ప్రవాహంలా మొదలైన ప్రజాందోళన శ్రీలంక అధ్యక్ష భవనంపైకి సునామీలా పోటెత్తింది. కొలంబో వీధులు శనివారం రణరంగాన్ని తలపించాయి. ముంచుకొస్తున్న ముప్పును ముందుగానే పసిగట్టిన అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అధ్యక్ష భవనాన్ని విడిచిపెట్టి శుక్రవారం రాత్రే పరారయ్యారు. ఈ నిరసన సెగల్ని తట్టుకోలేక.. ఎట్టకేలకు బుధవారం(ఈనెల 13వ తేదీ) గద్దె దిగేందుకు అంగీకరించారు. ఈ మేరకు స్పీకర్‌కు సమాచారం అందించారు. గొటబాయ రాజపక్స నియమించిన ప్రధాని విక్రమసింఘేనూ ఆందోళనకారులు వదల్లేదు. తాను పదవికి రాజీనామా చేస్తానని స్వయంగా ప్రకటించినా.. ఆయన ప్రైవేట్‌ నివాసానికి నిప్పుపెట్టారు. మొత్తంమీద కొలంబో వీధుల్లో నిరసనకారులకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణల్లో 45 మందికి గాయాలయ్యాయి. ఇందులో ఏడుగురు పోలీసులు ఉన్నారు. ఇన్ని ఆందోళనల నడుమ చివరికి దేశంలో అఖిలపక్ష ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి.

గేట్లను బద్దలుకొట్టి మరీ..
గత కొన్ని నెలలుగా అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామాను డిమాండ్‌ చేస్తున్న లంక ప్రజల నిరసన శనివారం పతాకస్థాయికి చేరుకుంది. అడ్డు వచ్చిన సైన్యాన్ని, పోలీసులను, బారికేడ్లను దాటుకుంటూ, కాల్పులకు వెరవకుండా.. బాష్పవాయువు గోళాలను లెక్కచేయకుండా అధ్యక్షుడి అధికారిక నివాసం గేట్లు బద్దలుకొట్టి మరీ లోపలకి దూసుకెళ్లారు. ప్రమాదాన్ని ముందే ఊహించిన రాజపక్స శుక్రవారం రాత్రే అధ్యక్షభవనాన్ని విడిచి పరారయ్యారు. ఆయన సురక్షితంగా ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అధ్యక్ష భవనంలోకి ప్రవేశించిన నిరసనకారులు అక్కడున్న ఈతకొలనులో జలకాలాడారు. కొందరు అధ్యక్షుడి మంచంపై పడుకున్నారు. భవనంలోని సోఫాలు, కుర్చీలపై కూర్చొని సెల్ఫీలు దిగారు. జిమ్‌లో వ్యాయామాలు చేశారు. వంటగదిలో ఆహార పదార్థాలు తిన్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. అధ్యక్ష భవనంలో మాత్రం నిరసనకారులు ఎలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడలేదు. నిరసన ప్రదర్శనల్లో శ్రీలంక మాజీ క్రికెటర్‌ జయసూర్య కూడా పాల్గొన్నారు. ‘‘నేను ఎప్పుడూ ప్రజల పక్షానే ఉంటాను. త్వరలోనే మేం విజయం సాధిస్తాం’’ అని పేర్కొన్నారు. 2.2 కోట్ల జనాభా ఉన్న శ్రీలంక గత ఏడు దశాబ్దాల్లో కనీవినీ ఎరగని ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆహారం, ఇంధనం ఇతర అత్యవసర వస్తువులు దిగుమతి చేసుకోవడానికి కూడా విదేశీ మారక ద్రవ్య నిధులు లేని పరిస్థితి. ధరలు నింగికి ఎగిశాయి. ఎక్కడా ఆ దేశానికి అప్పులు పుట్టడం లేదు.

లగేజీ సర్దుకుని నౌకలో పరార్‌..
అధ్యక్షుడు రాజపక్స... కొలంబోను విడిచి వెళ్లారన్న వార్తలొస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. కొలంబో నౌకాశ్రయంలో ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్‌ గజబాహు నౌకలోకి కొందరు వ్యక్తులు సూట్‌కేసులతో హడావిడిగా వెళుతున్న దృశ్యాలు కనిపించాయి. ‘‘ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్‌ సింధురాలా, ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్‌ గజబాహులోకి కొందరు వ్యక్తులు ప్రవేశించారు. వెంటనే ఆ రెండు నౌకలు తీరం విడిచి వెళ్లాయి’’ అని నౌకాశ్రయ అధికారి ఒకరు చెప్పినట్లు ఓ టీవీ ఛానల్‌ పేర్కొంది. విమానంలో అధ్యక్షుడు దేశం విడిచి వెళ్లారన్న ఊహగానాలూ చెలరేగుతున్నాయి. కొలంబో అంతర్జాతీయ విమానాశ్రయంలో నిలిచి ఉన్న శ్రీలంక ఎయిర్‌లైన్స్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ దగ్గరకు వీఐపీ వాహనశ్రేణి చేరుకున్న వీడియో కూడా వెలుగులోకి వచ్చింది.

రాజీనామాకు గొటబాయ, రణిల్‌ అంగీకారం
శనివారం పరిణామాలతో బిత్తరపోయిన అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఎట్టకేలకు రాజీనామా చేసేందుకు అంగీకారం తెలిపారు. పార్లమెంటు స్పీకర్‌ మహింద అబెవర్ధనెకు లేఖ రాశారు. అంతకుముందు మహింద ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఇందులో అధ్యక్షుడు గొటబాయ, ప్రధాని రణిల్‌విక్రమసింఘేలు రాజీనామా చేయాలని అన్ని పార్టీలు డిమాండ్‌ చేశాయి. ఈ సమావేశ వివరాలను తెలియజేస్తూ రాజీనామా చేయాలని రాజపక్సను స్పీకర్‌ కోరారు. దీనికి అంగీకారం తెలుపుతూ బుధవారం రాజీనామా సమర్పిస్తానని ఆయన పేర్కొన్నారు. మరోవైపు అధ్యక్ష భవనంపై దాడి జరగగానే ప్రధానమంత్రి రణిల్‌ విక్రమసింఘే కూడా రాజీనామా చేస్తానని ప్రకటించారు. అఖిలపక్ష ప్రభుత్వ ఏర్పాటు చేయాలన్న సిఫార్సును అంగీకరిస్తున్నానని పేర్కొన్నారు. గొటబాయ రాజీనామాకు అంగీకరించడంతో లంక రాజ్యాంగం ప్రకారం.. తాత్కాలిక అధ్యక్షుడిగా పార్లమెంటు స్పీకర్‌ మహింద బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.

ఇదీ చూడండి :టోక్యోకు షింజో అబే భౌతికకాయం.. సంచలనాలు వెల్లడించిన హంతకుడు!

Last Updated : Jul 10, 2022, 6:48 AM IST

ABOUT THE AUTHOR

...view details