తెలంగాణ

telangana

యూఎస్​లో ఇన్​సైడర్ ట్రేడింగ్.. ఏడుగురు తెలుగు వ్యక్తులపై అభియోగాలు

By

Published : Mar 29, 2022, 3:05 PM IST

Indian Origin Persons Charged: అమెరికాలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి పది లక్షల డాలర్లకు పైగా అక్రమంగా ఆర్జించారన్న ఆరోపణలపై ఏడుగురు తెలుగు వ్యక్తులపై అభియోగాలు నమోదు అయ్యాయి. యూఎస్‌ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్‌ కమిషన్ ఫిర్యాదు మేరకు ఫెడరల్​ అధికారులు ఈ మేరకు అభియోగాలు నమోదుచేశారు. 2020లో తాము పనిచేస్తున్న కంపెనీ రహస్య సమాచారాన్ని స్నేహితులు, బంధువులతో పంచుకుని వీరు ఈ మోసానికి పాల్పడగా.. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Indian Origin Persons Charged:
Indian Origin Persons Charged:

Indian Origin Persons Charged: ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడి పదిలక్షల డాలర్లు అక్రమంగా సంపాదించారన్న ఆరోపణలపై అమెరికాలో ఏడుగురు తెలుగు వ్యక్తులపై ఫెడరల్‌ అధికారులు అభియోగాలు నమోదు చేశారు. హరి ప్రసాద్‌ సూరి, లోకేశ్ లగుడు, చోటు ప్రభుతేజ్‌ పులగం అనే ముగ్గురు స్నేహితులు శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన క్లౌడ్‌ కంప్యూటింగ్‌ కమ్యూనికేషన్స్‌ కంపెనీ ట్విలియోలో పనిచేస్తున్నారు. 2020 మార్చిలో హరిప్రసాద్‌, లోకేశ్‌, ప్రభు తేజ్‌ ట్విలియో రెవెన్యూకు సంబంధించిన డేటా బేస్‌లను యాక్సెస్‌ చేశారు. దీని ద్వారా కంపెనీ కస్టమర్ల సమాచారాన్ని తెలుసుకున్నారు. కొవిడ్‌ సమయంలో ట్విలియో కంపెనీ ఉత్పత్తులు, సేవల వినియోగం పెరిగినట్లు గుర్తించిన ముగ్గురు స్నేహితులు ఈ వివరాలు కంపెనీ త్రైమాసిక ఫలితాల్లో వెల్లడిస్తే కచ్చితంగా ట్విలియో షేర్ల ధర పెరుగుతుందని గ్రహించారు.

ఈ రహస్య సమాచారాన్ని హరి ప్రసాద్‌ తన స్నేహితుడైన దిలీప్‌ కుమార్‌ రెడ్డికి చేరవేశాడు. లోకేశ్ సైతం తన గర్ల్‌ఫ్రెండ్‌ సాయి నెక్కలపూడి సహా మరో స్నేహితుడు అభిషేక్‌తో కంపెనీ విషయాలు పంచుకున్నాడు. ప్రభుతేజ్‌ తన సోదరుడు చేతన్‌ ప్రభుకు ట్విలియో కంపెనీ వివరాలు తెలియజేశాడు. అలా కంపెనీ సమాచారమందుకున్న వారు ట్విలియో త్రైమాసిక ఫలితాలు వెల్లడించడానికంటే ముందుగానే బ్రోకరేజ్‌ ఖాతాల ద్వారా ట్విలియో ఆప్షన్లు, స్టాక్‌లలో భారీగా పెట్టుబడులు పెట్టారు. 2020 మే 6న ట్విలియో త్రైమాసిక ఫలితాలను వెల్లడించడం, కంపెనీ షేర్లు పెరగడం చకచకా జరిగిపోయాయి.

అయితే అనుమానం వచ్చిన సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ ఆరా తీయగా.. ఈ మోసం బయటపడింది. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ద్వారా ఈ ఏడుగురు పది లక్షల డాలర్లకుపైగా అక్రమ లాభార్జన పొందినట్లు దర్యాప్తులో తేలింది. ఇందుకోసం ఈ ఏడుగురు ఓ ప్రైవేటు చాట్‌ ఛానల్‌ను రూపొందించుకుని, అందులో తెలుగులో మాట్లాడుకున్నట్లు తెలిసింది. కమిషన్‌ ఫిర్యాదు మేరకు ఫెడరల్‌ అధికారులు వీరిపై అభియోగాలు నమోదు చేశారు.

ఇవీ చూడండి:ఇమ్రాన్​పై 'అవిశ్వాస' అస్త్రం- ఇక కష్టమే!

వేడుకలో దుండగులు కాల్పులు.. 19 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details