తెలంగాణ

telangana

బ్రిటన్​ రాజకీయాన్ని మార్చేసిన 'మూర్తి గారి అల్లుడు'.. ప్రధాని రేసులో ముందంజ!

By

Published : Jul 7, 2022, 6:27 PM IST

Updated : Jul 8, 2022, 6:58 AM IST

Rishi Sunak Prime Minister: బ్రిటన్​ రాజకీయం రోజురోజుకు సరికొత్త మలుపులు తిరుగుతోంది. సొంత పార్టీ సభ్యుల నుంచి వ్యతిరేకత.. మంత్రుల వరుస రాజీనామాల ఒత్తిళ్లతో తలొగ్గిన ప్రధాని బోరిస్​ జాన్సన్​ పదవి వీడేందుకు అంగీకరించారు. ఈ నేపథ్యంలో కొత్త ప్రధాని ఎవరనే దానిపై అంచనాలు ఊపందుకున్నాయి. ఇన్ఫోసిస్​ నారాయణ మూర్తి అల్లుడు, భారత మూలాలున్న బ్రిటన్​ మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్​ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన గురించి తెలుసుకుందాం.

Rishi Sunak Top Contender For UK Prime Minister After Boris Resigns
Rishi Sunak Top Contender For UK Prime Minister After Boris Resigns

Rishi Sunak Prime Minister: వరుస వివాదాల నేపథ్యంలో ఎట్టకేలకు బ్రిటన్​ ప్రధాని వీడేందుకు అంగీకరించారు బోరిస్​ జాన్సన్​. మొత్తం 40 మందికిపైగా మంత్రులు బోరిస్​పై అవిశ్వాసం ప్రకటిస్తూ తమ పదవులకు రాజీనామా చేశారు. బ్రిటన్​ ప్రధానిపై నిరసన గళం వినిపించి అందరికంటే ముందే ఆర్థిక మంత్రి పదవికి రాజీనామా చేశారు భారత సంతతి వ్యక్తి, ఇన్ఫోసిస్​ నారాయణ మూర్తి అల్లుడు రిషి సునాక్​. ఆ తర్వాత అదే బాటలో ఇతర మంత్రులు పయనించారు. ఈ నేపథ్యంలో బోరిస్​ తప్పుకోవాలని నిర్ణయించుకోగా.. బ్రిటన్​ తదుపరి ప్రధాని ఎవరన్న దానిపై కొందరి పేర్లు వినిపిస్తున్నాయి.

భారత మూలాలున్న రిషి సునాక్​.. బ్రిటన్ ప్రధాని రేసులో గట్టి పోటీదారుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే జరిగితే.. బ్రిటన్​ ప్రధాని పదవి చేపట్టిన తొలి భారత సంతతి వ్యక్తిగా సునాక్​ నిలుస్తారు. ఈ నేపథ్యంలో రిషి సునాక్​ గురించి తెలుసుకుందాం. ఆయనకు భారత్​తో సంబంధం ఏంటి.. ఎక్కడ పుట్టారు.. బ్రిటన్​ రాజకీయాల్లో ఎలా కీలకంగా మారారు?

  • రిషి సునాక్​ 1980 మే 12న ఇంగ్లాండ్​లోని సౌథాంప్టన్​లో జన్మించారు. వీరి పూర్వీకులది భారత్​లోని పంజాబ్​. వీరు తొలుత తూర్పు ఆఫ్రికాకు వలస వెళ్లి.. అక్కడి నుంచి పిల్లలతో సహా యూకేకు వెళ్లి స్థిరపడ్డారు. అక్కడే రిషి తల్లిదండ్రులు కలిశారు. రిషి బాల్యం మొత్తం ఇంగ్లాండ్​లోనే గడిచింది. తొలుత వించెస్టర్​ కళాశాలలో, తర్వాత ఆక్స్​ఫర్డ్​ లింకన్​ కాలేజ్​లో ఫిలాసఫీ, పాలిటిక్స్​, ఎకనామిక్స్​ చదివారు. తర్వాత ఎంబీఏ కోసం కాలిఫోర్నియా స్టాన్​ఫోర్డ్​ యూనివర్సిటీలో చేరారు. అక్కడే ​ఇన్ఫోసిస్​ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తితో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారి.. 2009లో వీరు పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు.
  • విద్యాభ్యాసం తర్వాత గోల్డ్​మన్​ సాక్స్​ ఇన్వెస్ట్​మెంట్​ బ్యాంక్​లో అనలిస్ట్​గా 2001 నుంచి 2004 వరకు పనిచేశారు రిషి. ఆ తర్వాత పలు ఉద్యోగాలు చేసి 2014లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2015లో జరిగిన సాధారణ ఎన్నికల్లో రిచ్​మండ్​ నుంచి పోటీచేసి తొలిసారి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత మరోసారి రిషి విజయం సాధించారు. 2019లో జరిగిన కన్జర్వేటివ్‌ పార్టీ నాయకత్వ ఎన్నికల్లో రిషి.. బోరిస్​కు మద్దతిచ్చారు. బోరిస్‌ జాన్సన్​ ప్రధానిగా ఎన్నికైన తర్వాత రిషికి.. ఆర్థిక శాఖ చీఫ్‌ సెక్రటరీగా బాధ్యతలు అప్పగించారు. సునాక్ పనితీరును మెచ్చి 2020 ఫిబ్రవరిలో తన తొలి పూర్తిస్థాయి కేబినెట్​ విస్తరణలో.. బ్రిటన్​ ఆర్థిక మంత్రిగా నియమించారు జాన్సన్​.
  • కరోనా సంక్షోభ సమయంలో బ్రిటన్​లో మంచి ప్రజాదరణ పొందారు రిషి సునాక్​. ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచేలా బిలియన్‌ పౌండ్ల విలువ చేసే అత్యవసర పథకాలను ప్రకటించారు. వ్యాపారులు, ఉద్యోగులు, కార్మికుల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. ఇదే సమయంలో బోరిస్​ జాన్సన్​ లాక్​డౌన్​ పార్టీ.. బ్రిటన్​ రాజకీయాలను కుదిపేసింది. ఆ సమయంలోనూ తదుపరి ప్రధాని రిషి అని ప్రచారం జరిగింది.
    డౌనింగ్​ స్ట్రీట్​లో జరిగిన లాక్​డౌన్​ పార్టీకి హాజరైన క్రమంలో.. నిబంధనలు ఉల్లంఘించినందుకు రిషి సునాక్​ కూడా జరిమానా చెల్లించాల్సి వచ్చింది.
  • వివాదం.. రిషి సతీమణి అక్షతా మూర్తిపై వచ్చిన పన్ను ఎగవేత ఆరోపణలు సునాక్‌ను కాస్త ఇబ్బందుల్లోకి నెట్టాయి. ఈ వివాదంపై రిషి స్పందించలేదని విమర్శలు ఉన్నాయి. అక్షతకు.. ఇప్పటికీ భారత పౌరసత్వమే ఉంది. వేరే దేశంలో స్థిర నివాసం ఉన్న వారికి బ్రిటన్‌లో నాన్‌-డొమిసైల్ పన్ను హోదా ఇస్తారు. ఇది పొందిన వారు విదేశాల్లో తాము ఆర్జించే ఆదాయానికి బ్రిటన్‌లో పన్ను కట్టక్కర్లేదు. ఈ హోదాను అడ్డుపెట్టుకొని అక్షత.. పన్ను ఎగవేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అయితే తాము చట్టప్రకారం బ్రిటన్‌లో చేస్తున్న వ్యాపారాలకు పన్ను చెల్లిస్తున్నానని అక్షతా మూర్తి ప్రతినిధి అప్పట్లో తెలిపారు. ఆ తర్వాత ఆ ప్రయోజనాలను తాను పొందబోనని ప్రకటించారు అక్షతా మూర్తి. తన భర్త పదవికి ఇబ్బందిగా మారకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
    రిషి సునాక్​- అక్షతా మూర్తి

రిషి రాజీనామా చేశాక.. ఆయన స్థానంలో బ్రిటన్​ ఆర్థిక మంత్రిగా నియమితులైన ఇరాక్​ జాతీయుడు నదిమ్​ జహావి కూడా ప్రధాని పదవిలో ముందంజలో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీరితో పాటు వాణిజ్య మంత్రి పెన్నీ మార్డాంట్‌, రక్షణ మంత్రి బెన్‌ వాలెస్‌, విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌, మాజీ ఆరోగ్య మంత్రి సాజిద్‌ జావిద్‌ కూడా ప్రధాని రేసులో ఉన్నారు. భారతీయ మూలాలున్న అటార్నీ జనరల్‌ సుయేలా బ్రవెర్మన్‌, హోంమంత్రి ప్రీతి పటేల్‌ పేర్లు ప్రధాని రేసులో వినిపిస్తున్నాయి.

  • గోవాలో జన్మించిన సుయేలా బ్రవెర్మన్‌(42) న్యాయవాది. ప్రస్తుతం జాన్సన్‌ కేబినెట్‌లో అటార్నీ జనరల్‌. న్యాయనిపుణులుగా ప్రసిద్ధులు. ప్రధాని పదవికి పోటీలో ఉన్నట్లు స్వయంగా ప్రకటించారు. కన్జర్వేటివ్‌ పార్టీ ఎన్నికల వాగ్దానాలు నెరవేరుస్తానని తెలిపారు.
  • ప్రధాని పదవికి అర్హులపై డైలీ టెలిగ్రాఫ్‌ ఇటీవల నిర్వహించిన సర్వేలో రక్షణ మంత్రి బెన్‌ వాలెస్‌ 13 శాతం ఓట్లతో అందరికన్నా ముందంజలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో పెన్నీ మర్డాండ్‌ (12శాతం), రిషి సునాక్‌(10శాతం), లిజ్‌ ట్రస్‌(8శాతం), నదిమ్‌ జహావి(5శాతం) ఉన్నారు.
Last Updated : Jul 8, 2022, 6:58 AM IST

ABOUT THE AUTHOR

...view details