తెలంగాణ

telangana

క్వాడ్ హెచ్చరిక.. ఉగ్రవాదంపై పాక్​కు.. ఇండో పసిఫిక్​పై చైనాకు!

By

Published : May 24, 2022, 7:12 PM IST

QUAD warns Pakistan: పాకిస్థాన్, చైనాకు క్వాడ్ దేశాధినేతలు పరోక్ష హెచ్చరికలు చేశారు. ఉగ్రవాదం విషయంలో పాక్​కు పరోక్షంగా బుద్ధి చెప్పిన క్వాడ్ నేతలు.. ఇండో పసిఫిక్​లో చైనా దుందుడుకు వైఖరిని ఎండగట్టారు. కాగా, జపాన్ పర్యటనలో భాగంగా.. ఆస్ట్రేలియా ప్రధానితో మోదీ భేటీ అయ్యారు. జపాన్ మాజీ ప్రధానులను సైతం కలిశారు.

QUAD TERRORISM
QUAD TERRORISM

QUAD summit 2022: జపాన్​లోని టోక్యో వేదికగా సమావేశమైన క్వాడ్ దేశాధినేతలు.. ఉగ్రవాదాన్ని ముక్తకంఠంతో ఖండించారు. పాక్ కేంద్రంగా ఉన్న ఉగ్ర సంస్థలు చేసే దాడులను, హింసాత్మక తీవ్రవాదాన్ని ఖండిస్తున్నట్లు భేటీ అనంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. ఉగ్రవాదానికి ఎటువంటి చట్టబద్ధత లేదని, ఎట్టిపరిస్థితుల్లోనూ ఉగ్రవాదాన్ని ఆమోదించలేమని అన్నారు. ఉగ్రవాదులకు పరోక్షంగా సహకరించడం, ఆర్థిక, సైనిక, లాజిస్టిక్ సదుపాయాల విషయంలో సహాయం చేయడాన్ని ఖండించారు. ఇతరదేశాలపై దాడులు చేసేందుకు అఫ్గాన్ భూభాగాన్ని వినియోగించకూడదని దేశాధినేతలు స్పష్టం చేశారు.

"సీమాంతర ఉగ్రవాదం, ఉగ్రదాడులకు సహకరించడం, సైనిక, ఆర్థిక సహాయం అందించడాన్ని ఖండిస్తున్నాం. 26/11 ముంబయి దాడులు, పఠాన్​కోట్ దాడులను ఖండిస్తున్నాం. ఉగ్రవాదులకు నిధులు అందకుండా అంతర్జాతీయ నిబంధనలకు అమలు చేయడాన్ని కొనసాగిస్తాం. ఐరాస గుర్తించిన ఉగ్రవాదులు, ఉగ్ర సంస్థలపై చర్యలు తీసుకుంటూ.. గ్లోబల్ టెరరిజంపై పోరును కొనసాగిస్తాం." అని సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.

మోదీ- బైడెన్

QUAD warning china:చైనాకూ పరోక్ష హెచ్చరికలు చేశారు క్వాడ్ దేశాధినేతలు. ఇండో పసిఫిక్​లో యథాతథ స్థితిని మార్చడానికి ఎలాంటి ఏకపక్ష ప్రయత్నాలు చేయకూడదని స్పష్టం చేశారు. సమస్యలను శాంతియుత వాతావరణంలో పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. ఘర్షణాత్మక ప్రాంతాల్లో సైనికీకరణకు ప్రయత్నాలు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ఇటీవల చైనా తన యుద్ధ విమానాలను వివాదాస్పద ప్రాంతాల్లోకి పంపిస్తున్న నేపథ్యంలో ఈ మేరకు క్వాడ్ నేతలు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. సైన్యాన్ని ఉపయోగించి సముద్రంలోని వనరులను దోపిడీ చేయడాన్ని నిరోధించాలని స్పష్టం చేశారు. స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలు, ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వం వంటి సూత్రాలను తాము పాటిస్తామని పేర్కొన్నారు.

జపాన్ ప్రధాని కిషిదతో మోదీ

"యూఎన్ చార్టర్, అంతర్జాతీయ చట్టాలను పాటిస్తే అంతర్జాతీయ శాంతి భద్రతలు సాధ్యమవుతాయి. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగానే అన్ని ప్రాదేశిక సమస్యలను పరిష్కరించుకోవాలి. స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్​కు మద్దతిచ్చే భాగస్వామ్య దేశాలతో సహాకారం పెంపొందించుకునేందుకు క్వాడ్ సిద్ధం. ఆసియాన్ దేశాల ఐక్యతకు మా మద్దతు ఉంటుంది."
-క్వాడ్ దేశాల అధినేతలు

ఉత్తర కొరియా చేపడుతున్న బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగాలను ఖండించింది క్వాడ్. ఐరాస భద్రతా మండలి తీర్మానాలకు వ్యతిరేకంగా చేపడుతున్న ఈ చర్యలను నిలిపివేయాలని పిలుపునిచ్చింది. కొరియా ద్వీపకల్పాన్ని అణ్వాయుధ రహిత ప్రాంతంగా చేయాలన్న తమ సంకల్పాన్ని పునరుద్ఘాటించింది. మయన్మార్​లో సైనిక పాలన, సంక్షోభం, హింసను ఖండించింది. రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని పిలుపునిచ్చింది.

జపాన్​ ప్రధానితో సమావేశంలో మోదీ

QUAD PM Modi meetings:మరోవైపు, జపాన్ పర్యటనలో రెండో రోజూ ప్రధాని మోదీ.. బిజీగా గడిపారు. ఆస్ట్రేలియా నూతన ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్​తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరుదేశాల మధ్య పటిష్ఠమైన బంధం ఉందని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు. మరోవైపు, మోదీతో కీలక చర్చలు జరిపినట్లు అల్బనీస్ సైతం ట్వీట్ చేశారు. వర్తకం, పెట్టుబడులు, పునరుత్పాదక ఇంధన వనరులు, వ్యవసా పరిశోధన, క్రీడలు వంటి అంశాలపై ఇరువురు నేతలు విస్తృత చర్చలు జరిపారని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.

జపాన్ మాజీ ప్రధానులు మోరి, అబెలతో మోదీ

అంతకుముందు, జపాన్ మాజీ ప్రధానులను మోదీ కలిశారు. యొషిహిదె సుగా, షింజో అబె, యొషిరో మోరితో భేటీ అయ్యారు. ప్రస్తుతం యొషిరో మోరి జపాన్- ఇండియా అసోసియేషన్(జేఐఏ) అధ్యక్షుడిగా ఉన్నారు. మరికొద్దిరోజుల్లో ఈ బాధ్యతలను అబె స్వీకరించనున్నారు. మోరి నేతృత్వంలో జేఐఏ ద్వారా చేసిన కార్యక్రమాలపై మోదీ మాట్లాడారు.

PM Modi Japan visit:పర్యటనను ముగించుకొని మోదీ భారత్​కు తిరుగుపయనమయ్యారు మోదీ. జపాన్ పర్యటన ఫలప్రదంగా సాగిందని పేర్కొన్నారు. ప్రపంచానికి మంచి చేసే బలీయమైన కూటమిగా క్వాడ్ రూపుదిద్దుకుందని చెప్పారు. జపాన్ ప్రభుత్వం, అక్కడి ప్రజలు ఇచ్చిన ఆతిథ్యానికి కృతజ్ఞతలు చెప్పారు. ఈ మేరకు ఆంగ్లం, జపనీస్​లో ట్వీట్లు చేశారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details