తెలంగాణ

telangana

PM Modi US Visit : మోదీ అమెరికా పర్యటనకు సర్వం సిద్ధం.. ప్రధాని షెడ్యూల్​ ఇదే

By

Published : Jun 19, 2023, 3:30 PM IST

pm-modi-us-visit-date-and-events-schedule-and-agenda
మోదీ అమెరికా పర్యటన

Pm Modi US Tour 2023 : ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు సర్వం సిద్ధమైంది. మంగళవారం అమెరికా బయలుదేరి వెళ్లనున్న మోదీ.. ఈ నెల 21న ఐక్యరాజ్యసమితిలో జరిగే యోగా కార్యక్రమానికి నేతృత్వం వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో ప్రవాస భారతీయులు భాగస్వాములు కానున్నారు. ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికేందుకు పెద్దఎత్తున ఐక్యతా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. మోదీ అమెరికా పర్యటన కోసం.. అక్కడి చట్టసభ సభ్యులు కూడా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

PM Modi America Visit : ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 20 నుంచి 25 వరకు అమెరికా, ఈజిప్టులో పర్యటించనున్నారు. మంగళవారం అమెరికా బయలుదేరి వెళ్లనున్న మోదీ.. ఈనెల 21న న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో.. అంతర్జాతీయ యోగా దినోత్సవాలకు నేతృత్వం వహిస్తారు. ఇందుకోసం ఇప్పటికే అక్కడ చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈనెల 21న ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు న్యూయార్క్‌లో జరిగే యోగా సెషన్‌లో.. ఐరాస ఉన్నతాధికారులు, పలు దేశాల రాయబారులు, దౌత్యవేత్తలు కూడా పాల్గొంటారు. అక్కడి నుంచి వాషింగ్టన్‌ వెళ్లనున్న ప్రధాని.. 22న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. తర్వాత కాంగ్రెస్‌ ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడతారు. అదే రోజు సాయంత్రం.. బైడెన్‌ దంపతులు ఇచ్చే అధికారిక విందుకు మోదీ హాజరవుతారు. 23న అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌, విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఇచ్చే విందుకు హాజరుకానున్న ప్రధాని.. పలు కంపెనీల సీఈఓలు, వేర్వేరు రంగాల నిపుణులతో వాషింగ్టన్‌లో చర్చలు జరుపుతారు. ప్రవాస భారతీయులతోనూ ఆయన ముచ్చటిస్తారు.

ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికేందుకు అక్కడి ప్రవాస భారతీయులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భారత్‌-ఆమెరికా స్నేహ సంబంధాలను ప్రస్తావిస్తూ.. వాషింగ్టన్‌లో ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. న్యూయార్క్, శాన్‌ఫ్రాన్సిస్కో, వ్యూస్టన్‌ సహా 20 నగర్లాల్లో.. ఐక్యతా ర్యాలీలు, ప్రదర్శనలు జరుగుతున్నాయి. మేరీలాండ్‌లో రాఘవేంద్ర అనే వ్యక్తి ప్రధాని మోదీపై తన అభిమానాన్ని ప్రత్యేకంగా చాటుకున్నారు. తన కారు నంబర్ ప్లేట్‌పై NMODI అని రాయించారు. ప్రధాని మోదీని ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

Pm Modi US Congress : వాషింగ్టన్‌, న్యూయార్క్‌లో.. మోదీ పాల్గొనే కార్యక్రమాల్లో భాగస్వాములయ్యేందుకు టిక్కెట్ల కోసం పలువురు ప్రవాసులు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్‌ను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనుండగా.. అందులో సెనేటర్లు తమ బంధువులు, స్నేహితులను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మోదీ గౌరవార్థం ఇచ్చే విందుకు ఐదుగురు భారతీయ అమెరికన్ కాంగ్రెస్‌ సభ్యులు, మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల, గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్, ఫెడ్‌ఎక్స్‌ సీఈఓ రాజ్‌ సుబ్రమణియన్ సహా.. పలువురు వ్యాపారవేత్తలకు ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది.

మోదీ అమెరికా పర్యటనలో రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని పలువురు భారతీయ అమెరికన్లతోపాటు.. అమెరికా సెనేటర్లు కూడా విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగంలో సవాళ్లను ఎదుర్కొనేందుకు రెండు దేశాలు మరింత కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని పలువురు సెనేటర్లు చెబుతున్నారు. భారత్‌లో అమెరికా పెట్టుబడులకు మరిన్ని దారులు తెరవాలని వారు ఆకాంక్షిస్తున్నారు. అమెరికా పర్యటన ముగించుకొని ఈజిప్టు వెళ్లనున్న ప్రధాని.. ఈ నెల 24, 25 తేదీల్లో అక్కడ పర్యటిస్తారు.

ABOUT THE AUTHOR

...view details