తెలంగాణ

telangana

Pakistan Imran Khan Jail Facility : పురుగులు, ఈగలున్న జైల్లో పాక్​ మాజీ ప్రధాని.. జీవితాంతం అక్కడే ఉంటానంటూ..

By

Published : Aug 8, 2023, 4:35 PM IST

Pakistan Imran Khan Jail Facility : తోషాఖానా అవినీతి కేసులో దోషిగా తేలి, జైలుకెళ్లిన పాకిస్థాన్​ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్​ ఖాన్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. జీవితాంతం జైలు జీవితం గడిపేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తన న్యాయవాదితో చెప్పారని పాకిస్థాన్​కు చెందిన ప్రముఖ​ మీడియా సంస్థ తెలిపింది.

Pakistan Ex PM Imran Khan Jail Facility
'జీవితాంతం జైలులోనే ఉంటా'.. : పాక్​ మాజీ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​

Pakistan Imran Khan Jail Facility : పాకిస్థాన్​ తెహ్రీక్‌-ఎ-ఇన్సాఫ్‌(పీటీఐ) చీఫ్​, పాక్​ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్​ ఖాన్​ను ఈగలు, పురుగులతో నిండిన జైలులో ఉంచారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. జీవింతాంతం జైలు జీవితం గడిపేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పినట్లు పాకిస్థాన్​కు చెందిన ప్రముఖ మీడియా ఛానెల్​ జియో న్యూస్​ వెల్లడించింది. కాగా, తోషాఖానా (ప్రభుత్వ కానుకలను అక్రమంగా అమ్మకం) కుంభకోణం కేసులో దోషిగా తేలిన ఇమ్రాన్​ ఖాన్​ ప్రస్తుతం పంజాబ్ ప్రావిన్స్‌లోని అటక్​ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.

సీ-క్లాస్​ ఖైదీకి కల్పించే సౌకర్యాలా..?
Pakistan Ex PM Attock Jail Facilities : పాకిస్థాన్​కు క్రికెట్​లో ప్రపంచకప్​ను తెచ్చిపెట్టిన మాజీ కెప్టెన్​ను పంజాబ్​ ప్రావిన్సులోని అటక్​ జైలులో చీమలు, ఈగలు, దోమలు, పురుగులతో కూడిన బహిరంగ బాత్​రూం ఉన్న ఓ చీకటి గదిలో ఉంచారని.. 70 ఏళ్ల వయసున్న ఇమ్రాన్​కు సీ-క్లాస్​ ఖైదీకి కల్పించే సౌకర్యాలు కల్పించారని ఆయన​ తరఫు న్యాయవాది నయీమ్​ హైదర్​ పంజోథా పేర్కొన్నారు. ఇమ్రాన్​పై నేరారోపణలకు సంబంధించి కోర్టు తీర్పును సవాలు చేసేందుకు అవసరమైన న్యాయపరమైన పత్రాలపై సంతకాలు చేయించుకునేందుకు సోమవారం ఆయన ఇమ్రాన్​ను కలిసేందుకు జైలుకు వెళ్లారు. జైలు అధికారి సమక్షంలో ఖాన్​తో ఒక గంట 45 నిమిషాల పాటు పంజోథా మాట్లాడారు. ఈ క్రమంలోనే జైల్లో కల్పిస్తోన్న సదుపాయాలు దారుణంగా ఉన్నాయని ఇమ్రాన్‌ చెప్పారని.. అలాగే ఆయన ఎదుర్కొంటున్న ఈ దుస్థితిని గురించి తాను స్వయంగా అడిగి తెలుసుకున్నట్లుగా లాయర్​ వివరించారు. తన జీవితాంతం జైలు జీవితం గడిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇమ్రాన్ తనతో చెప్పినట్లు న్యాయవాది​ నయీమ్​ వార్తా ఛానల్​కు చెప్పారు.

"ఓ చిన్న చీకటి గదిలో నన్ను నిర్భందించారు. అందులో టీవీ, వార్తాపత్రికలు కూడా లేవు. అందులోనే వాష్‌రూమ్‌ ఉంది. ఈగలు, చీమల బెడద ఎక్కువగా ఉంది. నన్నో ఉగ్రవాదిగా చూస్తున్నారు! ఎవరినీ కలిసేందుకు కూడా అనుమతించడం లేదు. అయినప్పటికీ.. నా మిగతా జీవితం మొత్తం జైల్లోనే ఉండేందుకు సిద్ధంగా ఉన్నా"

- న్యాయవాదితో ఇమ్రాన్​ ఖాన్​

తలుపులు పగలగొట్టి మరీ..!
Pakistan Former PM Arrested : లాహోర్​లోని తన ఇంట్లో భార్యతో కలిసి ఉన్నప్పుడు తలుపులు పగలగొట్టి మరీ పోలీసులు తనను అరెస్టు చేశారని.. వారెంట్​ చూపించమని కోరినా వినలేదని ఇమ్రాన్​ ఖాన్​ తెలిపినట్లుగా న్యాయవాది చెప్పారు. కాగా, ప్రధానిగా ఉన్నప్పుడు ప్రభుత్వానికి వచ్చిన కానుకలను అక్రమంగా అమ్మారనే కేసు( Tosha Khana Case Imran Khan )లో ఇమ్రాన్​ ఖాన్​కు శనివారం ఇస్లామాబాద్‌ స్థానిక కోర్టు మూడేళ్ల జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానా విధించింది. ఈ నేపథ్యంలోనే శనివారం ఆయన్ను లాహోర్​లోని నివాసంలో అరెస్టు చేశారు.

ప్రత్యేక సౌకర్యాలు కల్పించండి..
Petition On Pakistan Imran Khan Crisis : మరోవైపు అటక్‌ జైల్లో ఉన్న తమ అధినేత ఇమ్రాన్‌ఖాన్‌ను అదియాలా జైలుకు మార్చాలని.. అంతేకాకుండా ప్రత్యేక సదుపాయాలతో కూడిన జైలులో వసతి కల్పించాలని కోరుతూ పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఎ-ఇన్సాఫ్‌ పార్టీ సభ్యులు ఇస్లామాబాద్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సంపన్న వర్గానికి చెందిన కుటుంబంలో జన్మించిన ఆయన.. ఉన్నత చదువు, సామాజిక, రాజకీయ హోదాతో మెరుగైన జీవన విధానానికి అలవాటు పడ్డారని అన్నారు. పాక్‌ జాతీయ క్రికెట్‌ జట్టుకూ కెప్టెన్‌గా వ్యవహరించిన ఆయన.. ప్రత్యేక సదుపాయాలకు అర్హుడని పిటిషన్‌లో పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details