తెలంగాణ

telangana

Modi yoga USA : 'యోగా విశ్వవ్యాప్తం.. దీనికి కాపీరైట్లు లేవ్'.. ప్రపంచంతో ఆసనాలు వేయించిన మోదీ!

By

Published : Jun 21, 2023, 6:28 PM IST

Updated : Jun 21, 2023, 7:34 PM IST

Modi yoga USA : ప్రపంచంలో ఎవరైనా, ఎక్కడైనా యోగాను ఆచరించవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. యోగాకు కాపీరైట్లు లేవని అన్నారు. ఐక్యరాజ్య సమితిలో నిర్వహించిన యోగా దినోత్సవ కార్యక్రమానికి మోదీ నేతృత్వం వహించారు. వివిధ దేశాలకు చెందిన ప్రముఖులు, ప్రజలు హాజరైన ఈ కార్యక్రమం గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది.

modi-yoga-usa
modi-yoga-usa

Modi yoga USA : భారతదేశ ప్రాచీన సంస్కృతి అయిన యోగాకు ఎలాంటి కాపీరైట్లు లేవని, రాయల్టీలతో సంబంధం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఎవరైనా, ఏ వయసువారైనా, ఎక్కడైనా యోగాను ఆచరించవచ్చని స్పష్టం చేశారు. అసలైన విశ్వవ్యాప్త కసరత్తు యోగా అని మోదీ పేర్కొన్నారు. న్యూయార్క్​లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన చారిత్రక యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని.. ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన రాయబారులు, ఐరాస ప్రతినిధులు, ప్రముఖులు, సాధారణ ప్రజలతో కలిసి యోగా చేశారు.

ఆసనాలు వేస్తున్న మోదీ

అంతకుముందు, ఐక్యరాజ్య సమితి కార్యాలయంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించిన ప్రధాని మోదీ.. అక్కడికి విచ్చేసినవారిని ఉద్దేశించి ప్రసంగించారు. 2023 ఏడాదిని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా జరుపుకోవాలని భారత్ గతేడాది చేసిన ప్రతిపాదనకు ప్రపంచదేశాలన్నీ మద్దతు తెలిపిన విషయాన్ని మోదీ గుర్తు చేసుకున్నారు. యోగా కోసం మరోసారి ప్రపంచం ఏకం కావడం చూస్తుంటే సంతోషంగా ఉందని అన్నారు.

ఐరాసలో యోగా

"సమస్త మానవాళి చర్చావేదిక అయిన ఐక్యరాజ్య సమితిలో మనం సమావేశమయ్యాం. ప్రపంచంలోని ప్రతి దేశస్థుడు ఇక్కడ ఉన్నారని తెలిసింది. యోగా అంటేనే ఏకం కావడం. మీరంతా ఒక్కచోటుకు రావడం కూడా ఒకరకమైన యోగానే."
-నరేంద్ర మోదీ, భారత ప్రధానమంత్రి

గిన్నిస్ రికార్డ్..
కాగా, మోదీ నేతృత్వం వహించిన ఈ యోగా కార్యక్రమం గిన్నిస్ రికార్డులకు ఎక్కింది. అత్యధిక దేశస్థులు పాల్గొన్న యోగా కార్యక్రమంగా రికార్డు సృష్టించింది. ఇందుకు సంబంధించి ధ్రువీకరణ పత్రాన్ని గిన్నిస్ ప్రతినిధులు ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్​కు అందజేశారు. ఈ కార్యక్రమానికి 140 దేశాలకు చెందిన ప్రజలు రావాల్సి ఉండగా.. 135 దేశాలకు చెందినవారు వచ్చారని గిన్నిస్ రికార్డుల సంస్థ ప్రతినిధి మైఖెల్ ఎంప్రిక్ తెలిపారు. ఇది ప్రపంచ రికార్డని చెప్పారు. దౌత్యవేత్తలు, కళాకారులు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు సహా వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులు యోగా డేలో భాగమైనట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఉదయం నుంచే పెద్ద ఎత్తున ఐరాస ప్రధాన కార్యాలయానికి ప్రజలు పోటెత్తారని పేర్కొన్నారు.

గిన్నిస్ రికార్డు సర్టిఫికెట్ అందుకుంటున్న రుచిరా కాంబోజ్

ఐరాస 69వ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న సమయంలో ప్రధాని మోదీ.. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రతిపాదన చేశారు. భారత్ 2014లో చేసిన ప్రతిపాదనకు ప్రపంచదేశాల నుంచి అనూహ్య మద్దతు లభించింది. 175 ఐరాస సభ్యదేశాలు భారత్ ప్రతిపాదనకు ఆమోదం తెలిపాయి. దీంతో ఏటా జూన్ 21న యోగా దినోత్సవం జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి తీర్మానిస్తూ 2014 డిసెంబర్​లో ప్రకటన చేసింది.

అంతకుముందు, యోగా డే సందర్భంగా వీడియో ద్వారా సందేశం ఇచ్చారు మోదీ. ఈ ఏడాది యోగా దినోత్సవం మరింత ప్రత్యేకమని చెప్పారు. ఆర్కిటిక్, అంటార్కిటికాలోని రీసెర్చ్ స్టేషన్లలో ఉన్న భారతీయ పరిశోధకులు సైతం ఈ ఏడాది యోగా డేలో పాల్గొంటున్నారని తెలిపారు. ప్రజల మధ్య విభేదాలను తొలగించి అందరినీ ఏకం చేసే సంప్రదాయాలను భారత్.. ఎప్పటి నుంచో పాటిస్తూ వస్తోందని ఈ సందర్భంగా పేర్కొన్నారు మోదీ. భారత ప్రజలు కొత్త ఆలోచనలను స్వాగతిస్తూనే.. దేశంలోని సమున్నత వైవిధ్యాన్ని చాటుకుంటూ వస్తున్నారని అన్నారు. 'యోగా అంతర్​దృష్టిని మెరుగుపరుస్తుంది. మనసుతో అనుసంధానం చేస్తుంది. జీవులందరి మధ్య ఉండే ఐకమత్యాన్ని అనుభూతి చెందేలా చేస్తుంది. యోగా ద్వారా మనమంతా విభేదాలను తొలగించుకోవాలి. ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్ అనే స్ఫూర్తిని చాటి చెబుతూ ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలి' అని భారతీయులకు సందేశం ఇచ్చారు మోదీ.

గుటెరస్ ట్వీట్
అంతకుముందు, ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ సైతం యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచదేశాల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శరీరాన్ని, మనసును ఏకం చేసే శక్తి యోగాకు ఉందని ఆయన పేర్కొన్నారు. 'భయంకర రీతిలో విభజనకు గురైన ఈ ప్రపంచానికి ప్రాచీన పద్ధతులతో కలిగే ప్రయోజనాలు అమూల్యమైనవి. స్వర్గంలాంటి ప్రశాంతతను యోగా మనకు అందిస్తుంది. ఒత్తిడిని తగ్గించి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. క్రమశిక్షణ, ఓపికను నేర్పుతుంది. సంరక్షణ కోరుకుంటున్న ప్రకృతి, భూమితో మన ఉన్న అనుసంధానాన్ని పెంచుతుంది' అని గుటెరస్ తెలిపారు.

Last Updated : Jun 21, 2023, 7:34 PM IST

ABOUT THE AUTHOR

...view details