తెలంగాణ

telangana

నా కానుకలు నా ఇష్టం: ఇమ్రాన్‌ఖాన్‌

By

Published : Apr 19, 2022, 5:13 AM IST

Imran Khan: నిబంధనలకు విరుద్ధంగా కానుకలను తన వద్ద ఉంచుకున్నారనే ఆరోపణలపై స్పందించారు పాకిస్థాన్​ మాజీ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​. తనకు వచ్చిన కానుకలు తనకే సొంతమని.. వాటిని ఏమైనా చేసుకునే వెసులుబాటు తనకు ఉంటుందని స్పష్టం చేశారు.

imran khan news
imran khan news

Imran Khan: తనకు వచ్చిన కానుకల విషయంపై తీవ్ర విమర్శలు వస్తున్నప్పటికీ తగ్గేదేలే అంటున్నారు పాకిస్థాన్‌ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌. తనకు వచ్చిన కానుకలు తనకే సొంతమని.. వాటిని ఏమైనా చేసుకునే వెసులుబాటు తనకు ఉంటుందని స్పష్టం చేశారు. ప్రధానిగా మూడున్నరేళ్ల పదవీ కాలంలో పలువురు నేతల నుంచి అందుకొన్న కానుకలను నిబంధనలకు విరుద్ధంగా ఇమ్రాన్‌ తన దగ్గరే ఉంచుకున్నారని, వాటిలో కొన్నింటిని అమ్ముకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై పాకిస్థాన్‌ అత్యున్నత దర్యాప్తు సంస్థ విచారణ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఈ విధంగా స్పందించారు.

నిబంధనల ప్రకారం బహుమానంగా వచ్చిన కానుకలు సర్కారు ఖజానాకు (Toshakhana) జమ చేయాల్సి ఉన్నప్పటికీ రూ.కోట్ల విలువ చేసే కానుకలను ఇమ్రాన్‌ ఖాన్‌ తీసుకున్నారని అధికార పక్ష పీఎంఎల్‌ఎన్‌ చేస్తున్న ఆరోపణలను ఇమ్రాన్‌ ఖాన్‌ తోసిపుచ్చారు. 'అవన్నీ నిరాధారమైన ఆరోపణలు. నిబంధనల ప్రకారం 50 శాతం చెల్లించి ప్రభుత్వ ఖజానా నుంచి ఆ కానుకలు తీసుకున్నా. ఒకవేళ తాను అవినీతికి పాల్పడినట్లు ఎవరైనా ఆధారాలు చూపిస్తే తాను కూడా ముందుకు వస్తా. మూడేళ్ల కాలంలో తనపై ఈ ఒక్క ఆరోపణ మాత్రమే చేయగలిగినందుకు సంతోషం..' అంటూ స్థానిక మీడియాతో ఇమ్రాన్‌ ఖాన్‌ పేర్కొన్నారు.

తనకు వచ్చిన కానుకలను ఇమ్రాన్‌ ఖాన్‌ దుబాయిలో అమ్ముకొన్నారంటూ పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ఇటీవల ఆరోపించడం వల్ల ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 'ది న్యూస్‌ ఇంటర్నేషనల్‌' కథనం ప్రకారం ఇమ్రాన్‌ హయాంలో దాదాపు 58 ఖరీదైన బహుమతులు అందుకున్నారు. అయితే వాటిని సొంతం చేసుకోవాలనుకుంటే నిబంధనల ప్రకారం సగం ధరం చెల్లించి తీసుకోవాలి. కానీ, ఇందులో రూ.38 లక్షల రొలెక్స్‌ గడియారాన్ని కేవలం రూ.7,54,000 చెల్లించి సొంతం చేసుకొన్నారు. రూ.15 లక్షల విలువ చేసే మరో రొలెక్స్‌ గడియారానికి రూ.2,94,000 మాత్రమే చెల్లించారు. ఇలా మూడోవంతు కంటే తక్కువగా కట్టి, పలు కానుకలను ఇంటికి చేర్చుకొన్న ఇమ్రాన్‌.. రూ.8 లక్షల కానుకలను రూపాయి కూడా ఖజానాకు జమ చేయకుండానే తీసుకొన్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

ఇదీ చదవండి:'దుబాయ్‌లో నగలు అమ్ముకున్న ఇమ్రాన్‌'

ABOUT THE AUTHOR

...view details