తెలంగాణ

telangana

లద్దాఖ్​లో డ్రాగన్ అక్రమ నిర్మాణాలపై అమెరికా ఆందోళన

By

Published : Jun 8, 2022, 5:27 PM IST

india ladakh news
లద్ధాఖ్‌

India china Ladakh news: లద్ధాఖ్‌ ప్రాంతంలో చైనా తమ సైన్యం కోసం ఏర్పాటుచేస్తున్న మౌలిక సౌకర్యాలపై అమెరికా సైతం ఆందోళన వ్యక్తం చేస్తోంది. డ్రాగన్‌ చర్యల్లో కపట వైఖరి, విస్తరణవాదం అడుగడుగునా కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్​, అమెరికా కలిసి చేపట్టనున్న సంయుక్త యుద్ధ విన్యాసాలు చైనా ఆక్రమణవాదానికి చెక్‌ పెడతాయని అగ్రరాజ్యం భావిస్తోంది.

India china Ladakh news: భారత్‌-చైనా మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసిన లద్ధాఖ్‌ వద్ద డ్రాగన్‌ సేన తన కుయుక్తులను కొనసాగిస్తూనే ఉంది. ఒకపక్క సైనిక స్థాయి చర్చలు కొనసాగిస్తూనే మరోవైపు భారత్‌తో వాస్తవాధీనరేఖ వద్ద సైనిక మౌలిక వసతులను చైనా భారీస్థాయిలో పెంచేస్తోంది. మొత్తంగా హిమాలయ సరిహద్దుల్లో పీపుల్ లిబరేషన్‌ ఆర్మీ.. ఆయుధాల మోహరింపులతో పాటు వైమానిక స్థావరాలు, రోడ్లను పెద్ద ఎత్తున ఆధునీకరిస్తోంది. చైనా ఇటీవల ప్యాంగాంగ్ సరస్సుపై.. బ్రిడ్జి నిర్మించినట్లు జనవరిలో వెలువడిన శాటిలైట్ చిత్రాల్లో వెలుగు చూసింది. భారత్‌-చైనా సైన్యాల ఘర్షణ సందర్భంగా కొన్ని కీలక ప్రాంతాల్లో.. అక్రమంగా తిష్టవేసిన డ్రాగన్‌ సైన్యం..వెనక్కి వెళ్లేందుకు మొండికేస్తోంది. భారత్‌ సైతం ధీటుగా పలు ప్రాంతాల్లో మోహరించడంతో చైనాకు మింగుడు పడడంలేదు. ఈ నేపథ్యంలో చర్చలంటూనే.. తన విస్తరణ వాదాన్ని కొనసాగించేందుకు డ్రాగన్‌ సర్కార్‌ ప్రయత్నాలు చేస్తోంది.

లద్ధాఖ్ సరిహద్దుల్లో చైనా మౌలిక వసతులు ఆందోళన కలిగించే అంశమని అమెరికా పసిఫిక్ కమాండ్‌కు చెందిన ఉన్నత సైన్యాధికారి జనరల్‌ చార్లెస్‌ ఫ్లిన్‌ పేర్కొన్నారు. చైనాది అస్థిరపరిచే, విస్తరణవాద వైఖరి అని ఫ్లిన్ అభివర్ణించారు. చైనా పశ్చిమ థియోటర్ కమాండ్‌ హిమాలయ సరిహద్దుల్లో.. ఆందోళనర స్థాయిలో మౌలిక సౌర్యాలను అభివృద్ధి చేస్తోందని పేర్కొన్నారు. కొందరు ఎంపిక చేసిన పాత్రికేయులతో.. సంభాషణ సందర్భంగా ఆయన విషయాలను వెల్లడించారు. చైనా కపటవైఖరి, ఆక్రమణవాదం.. ఈ ప్రాంతానికి ఎలాంటి మేలు చేయలేదని ఫ్లిన్‌ వ్యాఖ్యానించారు. చైనా కుటిలనీతిని, నీతిబహ్యమైన చర్యలను అడ్డుకునేందుకు భారత్‌,అమెరికా కలిసి తీసుకుంటున్న చర్యలు ఉపకరిస్తాయని భావిస్తున్నట్లు జనరల్ ఫ్లిన్‌ చెప్పారు.

భారత్‌, అమెరికా కలిసి హిమాలయ పర్వతాలపై.. 9 వేల నుంచి 10 వేల అడుగుల ఎత్తున అక్టోబరులో యుద్ధ విన్యాసాలు నిర్వహించనున్నాయి. అదే తరహాలో అమెరికాలోని అలస్కాలోని అత్యంత చల్లని వాతారణ పరిస్థితుల్లోనూ.. శిక్షణ నిర్వహించనున్నట్లు ఫ్లిన్‌ చెప్పారు. అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో ఆయుధాలు ఉపయోగించే రీతులను సాధన చేయడమే ఈ సంయుక్త విన్యాసాల ఉద్దేశమని వివరించారు. ఈ విన్యాసాల్లో.. ఆధునిక సాంకేతికతలు, వైమానిక దళ వసతులు, వైమానిక దాడి వ్యవస్థలు, సౌకర్యాలు, రియల్‌ టైమ్‌లో సమచార మార్పిడి వంటి అంశాలు ఇమిడి ఉంటాయని చెప్పారు. విలువకట్టలేని ఈ అవకాశాల ద్వారా భారత్, అమెరికా సైన్యాలు లబ్దిపొందాలని జనరల్ ఫ్లిన్ సూచించారు.

ఇవీ చదవండి:'సరిహద్దుల్లో చైనా నిర్మాణాలు- మేమూ వెనక్కి తగ్గం'

పర్యావరణ పనితీరు సూచీలో అట్టడుగున భారత్‌

ABOUT THE AUTHOR

...view details