తెలంగాణ

telangana

చైనాలో మరో కొత్త వైరస్.. జంతువుల నుంచి మనుషులకు వ్యాప్తి.. టీకాలూ లేవ్!

By

Published : Aug 10, 2022, 12:11 PM IST

china-new-langya-virus
china-new-langya-virus

China new outbreak Langya: చైనాలో మరో కొత్తవైరస్ వెలుగులోకి వచ్చింది. జంతువుల నుంచి సోకే హెనిపావైరస్ కేసులు షాంగ్‌డాంగ్‌, హెనాన్‌ ప్రావిన్స్‌ల్లో వెలుగులోకి వచ్చాయి. ఈ వైరస్ నివారణకు టీకాలు లేవు.

new disease in china 2022: చైనాలో జంతువుల నుంచి మరో కొత్త వైరస్‌ మనుషులకు సోకడం ప్రపంచాన్ని కలవరానికి గురిచేస్తోంది. ఇప్పటికే చైనాలో పుట్టి మరణ మృదంగం మోగిస్తున్న కొవిడ్‌ నేటికీ ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తూనే ఉంది. అది సాధారణ జలుబుగా మారుతుందని చెబుతున్నా ఆ జాడలు ఎక్కడా కనిపించడంలేదు. తాజాగా జంతువుల నుంచి వ్యాపించే 'హెనిపావైరస్‌'... ఇటీవల షాంగ్‌డాంగ్‌, హెనాన్‌ ప్రావిన్స్‌ల్లో కొందరికి సోకినట్లు తేలింది.

China new virus Langya: జ్వరంతో బాధపడుతున్న ఈ రోగుల నుంచి సేకరించిన నమూనాల్లో వైరస్‌ ఆనవాళ్లను గుర్తించారు. దీనికి 'నోవెల్‌ లాంగ్యా హెనిపావైరస్‌'గా పేరుపెట్టారు. ఈ వైరస్‌ సోకిన రోగుల్లో జ్వరం, దగ్గు, నీరసం, కండరాల నొప్పులు, వికారంగా ఉండటం వంటి లక్షణాలు ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఎలుకలు, ఇతర జంతువుల నుంచి ఇది మనుషులకు సోకుతుందని నిపుణులు భావిస్తున్నారు. గొర్రెలు, కుక్కలు వంటి జంతువుల్లోనూ హెనిపా వైరస్‌ను గుర్తించారు.

దీన్ని లాంగ్యా హెనిపావైరస్ అని కూడా పిలుస్తారు. ఇది బయోసేఫ్టీ లెవల్‌-4 వైరస్‌గా చెబుతున్నారు. మనుషులు, జంతువుల్లో తీవ్ర అనారోగ్యాన్ని కలుగజేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. హెనిపావైరస్‌ వ్యాప్తి నివారణకు ఎటువంటి వ్యాక్సిన్లు లేవు. కేవలం లక్షణాలను బట్టి బాధితులకు ఉపశమనం కల్పించే చికిత్సలు చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఈ వైరస్‌ సోకిన బాధితులను పరిశోధించగా... తీవ్రమైన లక్షణాలు లేవని డ్యూక్‌ ఎన్‌యూఎస్‌ మెడికల్‌ స్కూల్‌ ప్రొఫెసర్‌ వాంగ్‌ లింఫా పేర్కొన్నారు.

ఈ వైరస్‌ సోకిన 35 మందిలో 26 మందికి జ్వరం, దగ్గు, అనోరెక్సియా, కండరాల నొప్పి, వికారం, తలనొప్పి,వాంతులవంటి లక్షణాలు కనిపించినట్లు చెప్పారు. చైనాలో కొత్త వైరస్‌ బయటపడడం వల్ల తైవాన్‌ అప్రమత్తమైంది. నూతన నిబంధనలు రూపొందించనున్నట్లు.. ప్రకటించింది.

చైనా వ్యాధి నిరోధక కేంద్రం(సీడీసీ) అంచనాల ప్రకారం.. హెనిపా వైరస్ వల్ల మనుషుల్లో కాలేయం, మూత్రపిండాలు తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది. తైవాన్‌లో హెనిపా వైరస్‌ను గుర్తించేందుకు అవసరమైన జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు ప్రామాణిక విధానాలను త్వరలోనే రూపొందించనున్నట్లు తైవాన్‌ సీడీసీ వెల్లడించింది. ఇప్పటివరకు హెనిపా వైరస్‌ వల్ల ఎలాంటి మరణాలు నమోదు కాలేదని తైవాన్ సీడీసీ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ చువాంగ్‌ జెన్‌ హిసియాంగ్‌ చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details