సౌర కుటుంబంలోని ఇతర గ్రహాల్లో భూమిని పోలిన గ్రహాలు ఇంతవరకు కనిపించలేదు. అంగారకుడిపై నీరుందా అనే అంశాన్ని కనుగొనేందుకు నాసా సహా, ప్రపంచంలోని శాస్త్రజ్ఞులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో జర్మనీ శాస్త్రజ్ఞుల పరిశోధనల్లో ఓ విషయం బయటకు వచ్చింది. భూమిని పోలిన మరో రెండు గ్రహాలను శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. గెలాక్సీకి సమీపంలోని మరో నక్షత్రం చుట్టూ ఇవి పరిభ్రమిస్తున్నట్లు వారు కనుగొన్నారు.
భూమి నుంచి కేవలం 12.5 కాంతి సంవత్సరాల దూరంలోని టీ గార్డెన్ నక్షత్రం చుట్టూ ఇవి పరిభ్రమిస్తున్నాయి. మేషరాశి దిశలో ఈ ఎరుపు మరుగుజ్జు నక్షత్రం ఉన్నట్లు ఆస్ట్రోనమీ, ఆస్ట్రోఫిజిక్స్ జర్నల్ ఓ అధ్యయనాన్ని ప్రచురించింది.
ఈ నక్షత్రం ఉపరితల ఉష్ణోగ్రత సుమారు 2,700 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని, దాని ద్రవ్యరాశి, సూర్యుని ద్రవ్యరాశిలో పదో వంతు మాత్రమే ఉంటుందని ఖగోళ శాస్త్రవేత్తలు లెక్క గట్టారు. భూమికి అత్యంత సమీపంలోనే ఈ నక్షత్రం ఉన్నప్పటికీ 2003 వరకు దీనిని గుర్తించలేక పోయారు.
"ఈ నక్షత్రం ఆవర్తనాలు, పరిమాణంలో జరిగే మార్పులను గత మూడేళ్లుగా పరిశీలిస్తున్నాం."
-మథ్యూస్ జెక్మీస్టర్, పరిశోధకుడు, గొట్టింజెన్ విశ్వవిద్యాలయం, జర్మనీ