తెలంగాణ

telangana

బైడెన్​తో జిన్​పింగ్​ వీడియో కాల్​.. ఏం మాట్లాడుకున్నారంటే?

By

Published : Mar 18, 2022, 10:41 PM IST

Chinese President Xi Jinping

Xi Jinping on Ukraine crisis: ఉక్రెయిన్​పై రష్యా సైనిక చర్య కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​తో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా మాట్లాడారు చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్. ఉక్రెయిన్​ సంక్షోభానికి ముగింపు పలికేందుకు ఇరుదేశాల మధ్య సహకారం అవసరమని సూచించారు. అంతర్జాతీయ బాధ్యతలను ఇరు దేశాల తమ భుజానికెత్తుకోవాలన్నారు.

Xi Jinping on Ukraine crisis: ఉక్రెయిన్​లోని పరిణామాలు ఎవరికీ ప్రయోజనం కలిగించవని పేర్కొన్నారు చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్​. ఉక్రెయిన్​ సంక్షోభాన్ని తాము కోరుకోవటం లేదని స్పష్టం చేశారు. ప్రపంచ శాంతి, సామరస్యం కోసం అంతర్జాతీయ బాధ్యతలను అమెరికా- చైనాలు భుజానికెత్తుకోవాలని సూచించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​తో వీడియో కాన్ఫరెన్స్​లో​ ఈ వ్యాఖ్యలు చేశారు జిన్​పింగ్​.

ఉక్రెయిన్​పై రష్యా దాడులను చైనా ఖండించటం లేదని, మాస్కోతో సత్సంబంధాల కారణంగానే డ్రాగన్​ మౌనంగా ఉండిపోతోందని అమెరికా విమర్శలు చేస్తున్న క్రమంలో బైడెన్​తో జిన్​పింగ్​ మాట్లాడటం ప్రాధాన్యం సంతరించుకుంది.

"ప్రపంచ శాంతి, అభివృద్ధి తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రస్తుతం ప్రపంచం సామరస్యంగానూ, స్థిరంగానూ లేదు. మేము కోరుకుంటున్నది ఉక్రెయిన్​ సంక్షోభం కాదు. దేశాలు రణరంగంలోకి రాకూడదని ప్రస్తుత పరిస్థితులు చెబుతున్నాయి. ఘర్షణలను ఎవరూ కోరుకోరు. శాంతి, భద్రతల కోసమే అంతర్జాతీయ సమాజం ఎక్కవగా ఖర్చు చేయాలి. ఐరాస భద్రత మండలిలో శాశ్వత సభ్యులుగా, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఇరు దేశాల సంబంధాలు సరైన మార్గంలో పయనించేలా చూడాలి ."

- షీ జిన్​పింగ్​, చైనా అధ్యక్షుడు.

అయితే, ఉక్రెయిన్​ సంక్షోభానికి తెర దించేందుకు ఏదైనా సంయుక్త ఆపరేషన్​ చేపట్టాలని జిన్​పింగ్​ కోరారా? అనే దానిపై స్పష్టత లేదు. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్​ సులివన్​, చైనా దౌత్యవేత్త యాంగ్​ జిచిల మధ్య గత సోమవారం రోమ్​లో సమావేశం అనంతరం ఇరుదేశాల అధ్యక్షులు భేటీ అయ్యారు.

వేలాది ప్రజల మధ్య పుతిన్​ ప్రసంగం

ఉక్రెయిన్​పై రష్యా చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్​ను పుతిన్​ మరోసారి కొనియాడారు. క్రియాను స్వాధీనం చేసుకుని ఎనిమిదేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం మాస్కోలోని లుజ్నికి స్టేడియంలో వేలాది మంది మద్దతుదారుల సమక్షంలో ఆయన ప్రసంగించారు. రష్యన్​ సైనికులను హీరోలుగా అభివర్ణించారు. ఇలాంటి ఐక్యత గతంలో ఎన్నడూ చూడలేదని పేర్కొన్నారు. ఉక్రెయిన్​పై సైనిక చర్యను సమర్థించుకున్నారు. అయితే, పుతిన్​ ప్రసంగాన్ని రష్యా స్టేట్​ టెలివిజన్​ మధ్యలోనే నిలిపివేయటం గమనార్హం. ఈ కార్యక్రమానికి సుమారు 2లక్షల మంది హాజరైనట్లు మాస్కో పోలీసులు తెలిపారు.

దౌత్యంతోనే యుద్ధానికి పరిష్కారం: భారత్‌

ఉక్రెయిన్‌లో రోజురోజుకూ దిగజారుతున్న పరిస్థితులపై భారత్‌ ఆందోళన వ్యక్తంచేసింది. ఐక్యరాజ్యసమితిలో భారత డిప్యూటీ శాశ్వత ప్రతినిధి ఆర్‌. రవీంద్ర ఐరాస భద్రతా మండలి సమావేశంలో మాట్లాడారు. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య తాజాగా జరిగిన దౌత్య చర్చలను స్వాగతిస్తున్నట్టు చెప్పారు. ఇరువైపులా దాడుల్ని తక్షణమే నిలిపివేసి పరస్పర చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని అభిప్రాయపడుతున్నట్టు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:అదే జరిగితే రష్యాపై దివాలా ముద్ర.. తీవ్ర పరిణామాలు?

ABOUT THE AUTHOR

...view details