తెలంగాణ

telangana

పాక్​లో ఘోరం.. శ్రీలంక జాతీయుడి సజీవ దహనం.. పోస్టర్ చించాడని...

By

Published : Dec 4, 2021, 6:21 PM IST

Updated : Dec 4, 2021, 7:10 PM IST

Sialkot incident Sri Lanka: పాకిస్థాన్​లో శ్రీలంక జాతీయుడిపై జరిగిన మూకదాడి, దారుణ హత్యాకాండను శ్రీలంక పార్లమెంటు ఖండించింది. ఈ అంశంపై తగిన న్యాయం చేయాలంటూ శ్రీలంక ప్రధాని రాజపక్సే డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సైతం తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది.

lynching
మూకదాడి

Pakistan Sri Lankan man killed: పాకిస్థాన్‌లో శ్రీలంక జాతీయుడిని దారుణంగా కొట్టి చంపడాన్ని శ్రీలంక పార్లమెంటు తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనతో ప్రమేయమున్న వారందరినీ అరెస్టు చేయాలని శ్రీలంక ప్రధాని మహీందా రాజపక్సే డిమాండ్ చేశారు. అంతేగాక తమ దేశ పౌరులకు భద్రతనిచ్చే అంశంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హామీ ఇవ్వడం ద్వారా నిబద్ధతను చాటుకుంటారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రవాసునిపై ఘోర హింసాకాండ..

శ్రీలంకలోని క్యాండీకి చెందిన దియావదన(40) అనే వ్యక్తి లాహోర్‌కు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న సియాల్‌కోట్​లో ఓ వస్త్ర పరిశ్రమలో జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. అయితే ఆయన దైవదూషణ చేశాడన్న ఆరోపణలొచ్చాయి. దీనితో కోపోద్రిక్తులైన ఇస్లామిస్ట్ పార్టీ మద్దతుదారులు కొందరు కర్మాగారంపై దాడి చేశారు. ఆయన్ను తీవ్రంగా కొట్టి.. సజీవ దహనం చేశారు. దీనితో శ్రీలంక వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.

బాధితుడిని సజీవ దహనం చేసిన ఆనవాళ్లు
గుమిగూడిన జనం
ఆందోళనకారుల చేతిలో ధ్వంసమైన భవనం

ఈ ఘటనపై శ్రీలంకలో విపక్షాలన్నీ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచాయి. తమ దేశానికి చెందిన ఇతర కార్మికుల భద్రత కోసం పాక్​తో చర్చలు జరపాలని ఏకగ్రీవంగా తీర్మానించాయి.

హింసాత్మకంగా మారిన నిరసనలు
బందోబస్తుకు తరలివెళ్తున్న పోలీసులు

"పాకిస్థాన్‌లోని అతివాద మూకలు ప్రియాంత దియావదనపై చేసిన క్రూరమైన, ప్రాణాంతకమైన దాడి దిగ్భ్రాంతిని కలిగించింది. అతని కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఈ ఘటనతో ప్రమేయమున్న వారిపై ప్రధాని ఇమ్రాన్​ఖాన్ చట్టపరంగా వెంటనే చర్యలు తీసుకుంటారని విశ్వసిస్తున్నా."

---ట్విట్టర్‌లో శ్రీలంక ప్రధాని రాజపక్సే

ఈ ఘటనపై స్పందిచిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. 'సియాల్‌కోట్‌ దాడి పాకిస్థాన్​కు అవమానకరమైన రోజు' అని వ్యాఖ్యానించారు.

"దర్యాప్తును నేనే స్వయంగా పర్యవేక్షిస్తున్నా. విచారణలో ఎటువంటి పొరపాటు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. ప్రస్తుతం అరెస్ట్‌లు జరుగుతున్నాయి. బాధ్యులందరినీ చట్టం ముందు నిలబెడతాం. నేర తీవ్రత ప్రకారం శిక్ష విధిస్తాం."

--పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ సైతం ఈ ఘటనపై ట్విట్టర్​లో ఆగ్రహం వ్యక్తం చేశారు.

"సియాల్‌కోట్ ఘటన జరగడం విచారకరం. సిగ్గుచేటు. ఏ రకంగానూ ఇది మతపరమైనది కాదు. ఇస్లాం అనేది మూకదాడులకు వ్యతిరేకం."

---పాకిస్థాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ

గంటల వ్యవధిలో బాధితుడి హత్య..

Blasphemy law in Pakistan: శ్రీలంక క్యాండీలోని పేద కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన దియావదన.. పెరడెనియా విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రురాలయ్యారు. నిషేధిత ఇస్లామిస్ట్ పార్టీ 'తెహ్రీక్​-ఎ-లబ్బాయిక్ పాకిస్థాన్​(టీఎల్​పీ)' మద్దతుదారులే ఆయన్ను హత్య చేసినట్లు తెలుస్తోంది.

దియావదన పనిచేసే కార్యాలయానికి దగ్గర్లోని గోడలకు టీఎల్​పీ పోస్టర్లను అతికించారని.. అయితే వీటిని ఆయన చించి చెత్తబుట్టలో పడేశారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిని ఫ్యాక్టరీలోని కార్మికులు చూసి టీఎల్​పీ కార్యకర్తలకు చెప్పారు. వందలాది మంది పురుషులు, మహిళలు ఆగ్రహంతో రోడ్లపైకి చేరారు. శ్రీలంక జాతీయుడిని ఫ్యాక్టరీ నుంచి బయటకు తీసుకొచ్చి తీవ్రంగా హింసించారు. పోలీసులు అక్కడికి చేరుకునేలోపే సజీవ దహనం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన అనేక వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. వాటిలో టీఎల్​పీ నేతల నినాదాలు వినిపించడం గమనించవచ్చు.

మరోవైపు.. ఘటనకు సంబంధించి దర్యాప్తులో భాగంగా.. 100 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు పంజాబ్ పోలీసులు తెలిపారు.

జైలు నుంచి 1500మంది విడుదల..!

ప్రధాని ఇమ్రాన్​ ఖాన్ నేతృత్వంలోని పాక్ ప్రభుత్వం టీఎల్​పీతో చేసుకున్న రహస్య ఒప్పందం అనంతరం ఆ పార్టీపై నిషేధాన్ని ఎత్తివేసింది. దీనితో ఆ పార్టీ అధ్యక్షుడు సాద్ రిజ్వీ సహా.. తీవ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటున్న 1,500 మంది కార్యకర్తలు జైలు నుంచి విడుదలయ్యారు. ఫ్రాన్స్‌లో దైవదూషణ కార్టూన్‌లకు సంబంధించి.. ఫ్రెంచ్ రాయబారిని బహిష్కరించాలనే డిమాండ్‌ను టీఎల్​పీ ఉపసంహరించుకున్న తర్వాత ఆ పార్టీపై నిషేధం ఎత్తేసింది ఇమ్రాన్ సర్కార్.

ప్రపంచవ్యాప్తంగా విమర్శలు..

  • ఈ ఘటనను అంతర్జాతీయ మానవహక్కుల సంస్థ ఆ'మ్నెస్టీ ఇంటర్నేషనల్' ఖండించింది. నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాలని డిమాండ్ చేసింది. 'హక్కుల దుర్వినియోగానికి బాటలు వేస్తూ.. మానవ జీవితాలను ప్రమాదంలో పడేసే వాతావరణాన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉంది' అని ఉద్ఘాటించింది.
  • ప్రపంచంలోని ఇతర దేశాల కంటే పాకిస్థాన్ దైవదూషణ చట్టాలను ఎక్కువగా ఉపయోగిస్తోందని అమెరికా ప్రభుత్వ సలహా కమిటీ తన నివేదికలో పేర్కొంది.
  • ముస్లిం మెజారిటీ దేశమైన పాక్​లో మానవ హక్కులు తరచుగా ఉల్లంఘనకు గురవుతున్నాయని హక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
  • దైవదూషణ ఆరోపణలు హిందువులు, క్రైస్తవులు వంటి మైనారిటీలపై ఎక్కువగా హింసను ప్రేరేపిస్తున్నాయని అంతర్జాతీయంగా సంస్థలు నివేదించాయి.
  • ఇటీవలి సంవత్సరాల్లో దైవదూషణకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు వ్యక్తులు హత్యకు గురయ్యారు.

ఆ ఘటన మరవకముందే..

Hindu boy murdered: తాజాగా పాకిస్థాన్​లో హిందూ వర్గానికి చెందిన మైనర్​ బాలుడిని ఎత్తుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టి.. కిరాతకంగా హత్య చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 4, 2021, 7:10 PM IST

ABOUT THE AUTHOR

...view details