తెలంగాణ

telangana

వెనక్కి తగ్గని 'కిమ్​'​.. మరో క్షిపణి ప్రయోగం

By

Published : Sep 28, 2021, 3:28 PM IST

North Korea fires short-range missile to sea in latest test
ఉత్తర కొరియా మరో క్షిపణి ప్రయోగం ()

ఉభయ కొరియా దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. వరుస బాలిస్టిక్​ క్షిపణి ప్రయోగాలు చేపడుతూ వస్తున్న ఉత్తర కొరియా.. మరోసారి షార్ట్​ రేంజ్​ మిస్సైల్​ను సముద్రంలోకి ప్రయోగించింది. ఈ చర్యను అమెరికా ఖండించింది.

ఉత్తర కొరియా వరుస క్షిపణి పరీక్షలతో.. ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. మంగళవారం ఉదయం.. స్వల్ప దూరంలోని లక్ష్యాలను ఛేదించగల మిస్సైల్​ను సముద్రంలోకి ప్రయోగించింది. దక్షిణ కొరియాతో శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించిన కొద్దిరోజుల్లోనే.. కిమ్​ జోంగ్​ ఉన్​ ప్రభుత్వం మరో క్షిపణి పరీక్ష నిర్వహించడం గమనార్హం. ఈ ప్రయోగం.. ఉత్తర కొరియా నిబద్ధతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

ఉత్తర కొరియాలోని జగాంగ్​ ప్రావిన్స్​ నుంచి.. తూర్పు సముద్రంలోకి ప్రొజెక్టైల్​ను ప్రయోగించినట్లు.. దక్షిణ కొరియా వెల్లడించింది. జాతీయ అత్యవసర భద్రతా మండలి సమావేశం ఏర్పాటు చేసిన దక్షిణ కొరియా ప్రభుత్వం.. కిమ్​ సర్కార్​ చర్యపై విచారం వ్యక్తం చేసింది. అమెరికా- దక్షిణ కొరియా అధికారులు దీనిని విశ్లేషిస్తారని స్పష్టం చేసింది.

క్షిపణి ప్రయోగం చేపట్టిన ఉత్తర కొరియా

క్షిపణి ప్రయోగాన్ని ఖండించింది అమెరికా హోం శాఖ. ఇది పొరుగు దేశాలకు, అంతర్జాతీయ సమాజానికి ముప్పును పెంచుతోందని వ్యాఖ్యానించింది. ఉభయ కొరియా దేశాలు.. చర్చల ద్వారా ఉద్రిక్తతలకు తెరదించాలని కోరింది.

ఉత్తర కొరియా బాలిస్టిక్​ క్షిపణిని ప్రయోగించినట్లు అనుమానం వ్యక్తం చేసిన జపాన్​ ప్రభుత్వం.. నిఘాను పెంచింది.

నిషేధం విధించినా..

బాలిస్టిక్​ క్షిపణి ప్రయోగాలు చేపట్టకుండా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఇప్పటికే ఉత్తర కొరియాపై ఆంక్షలు విధించింది. వీటిని లెక్కచేయని కిమ్​ ప్రభుత్వం.. ఈ నెల మొదట్లో కొరియా బాలిస్టిక్​, క్రూయిజ్​ క్షిపణులను ప్రయోగించి ఉద్రిక్తతలు పెంచింది.

కానీ.. స్వల్ప శ్రేణి క్షిపణుల ప్రయోగాలపై ఎలాంటి ఆంక్షల్లేవు.

చర్చలకు పిలిచి.. ఇలా..

తమ షరతులకు అంగీకరిస్తే.. చర్చలకు తాము ఎప్పుడూ సిద్ధమేనని సెప్టెంబర్​ 24న సంకేతాలు ఇచ్చారు కిమ్​ సోదరి కిమ్​ యో జోంగ్​. ఉద్రిక్తతలు పెంచే విధానాలను, ద్వంద్వ వైఖరిని ఆపేయాలని కోరారు. ఇటీవల జరిగిన ఐరాస సర్వసభ్య సమావేశంలో(UN general assembly 2021) దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్​ జే ఇన్​.. 1950-53 నాటి యుద్ధం ముగింపు ప్రకటన కోసం తమ ప్రయత్నాన్ని పునరుద్ఘాటించారు. దాని ద్వారా అణ్వాయుధ నిర్మూలన, కొరియా ద్వీపకల్పంలో శాంతి స్థాపనకు దారి తీస్తుందన్నారు. ఆయన వ్యాఖ్యలకు ఈ మేరకు స్పందించారు కిమ్​ సోదరి.

ఈ పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఆమె వ్యాఖ్యలకు బదులిచ్చిన దక్షిణ కొరియా.. కిమ్​ ప్రకటన అర్థవంతంగానే ఉన్నప్పటికీ చర్చలకు ముందే ఇరుదేశాల మధ్య కమ్యూనికేషన్​ వ్యవస్థను పునరుద్ధరించాలని కోరింది.

ఈ నేపథ్యంలోనే మరోసారి క్షిపణి ప్రయోగం చేపట్టింది ఉత్తర కొరియా.

అమెరికాపై ఆరోపణలు..

వరుస క్షిపణి ప్రయోగాలు చేస్తున్న ఉత్తర కొరియా మరోవైపు.. అమెరికాను నిందిస్తోంది. తమపై శత్రు విధానాన్ని అనుసరిస్తోందని ఆరోపణలు చేసింది. దక్షిణ కొరియాతో సంయుక్త సైనిక విన్యాసాలను.. జో బైడెన్​ ప్రభుత్వం శాశ్వతంగా నిలిపివేయాలని డిమాండ్​ చేసింది.

ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో భాగంగా చివరిరోజు.. ఉత్తర కొరియా రాయబారి కిమ్​ సంగ్​ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉత్తర కొరియా గుర్తుతెలియని ప్రొజెక్టైల్​ను తూర్పువైపు సముద్రంలోకి ప్రయోగించిందని దక్షిణ కొరియా సైన్యం ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఆయన ఇలా మాట్లాడారు.

ఇవీ చూడండి:క్షిపణులతో మళ్లీ సవాళ్లు విసురుతున్న కిమ్​!

కొరియా దేశాల మధ్య ఉద్రిక్తతలు- పోటాపోటీగా క్షిపణి ప్రయోగాలు

ఉత్తర కొరియా దూకుడు- అణుశుద్ధి కర్మాగారం విస్తరణ

ABOUT THE AUTHOR

...view details