కొరియా దేశాల మధ్య ఉద్రిక్తతలు- పోటాపోటీగా క్షిపణి ప్రయోగాలు

author img

By

Published : Sep 15, 2021, 10:13 AM IST

Updated : Sep 15, 2021, 2:33 PM IST

nkorea s korea missile
కొరియా దేశాల మధ్య ఉద్రిక్తతలు ()

ఉత్తర, దక్షిణ కొరియాలు.. గంటల వ్యవధిలో క్షిపణి ప్రయోగాలు చేపట్టాయి. తొలుత ఉత్తర కొరియా రెండు స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఇవి సముద్రంలో పడిపోయాయి. అనంతరం కొద్ది గంటలకే.. దక్షిణ కొరియా అండర్​వాటర్ బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించింది. ఈ ఘటనపై అమెరికా, జపాన్ ఆందోళన వ్యక్తం చేశాయి.

ఉభయ కొరియా దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. దాయాది దేశాలు రెండూ కవ్వించుకున్నాయి. దక్షిణ కొరియా జలాంతర బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించగా, ఉత్తర కొరియా.. స్వల్ప రేంజ్ కలిగిన బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది.

తొలిసారి అండర్​వాటర్ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు దక్షిణ కొరియా అధ్యక్ష భవనం బుధవారం మధ్యాహ్నం ప్రకటన చేసింది. దేశీయంగా తయారు చేసిన ఈ క్షిపణిని మూడు వేల టన్నుల బరువైన సబ్​మెరైన్​ నుంచి ప్రయోగించినట్లు తెలిపింది. ప్రణాళిక ప్రకారం నిర్దిష్ట దూరాన్ని చేరిన తర్వాత లక్ష్యాన్ని క్షిపణి ఛేదించిందని స్పష్టం చేసింది. ఆత్మరక్షణ కోసం, విదేశాల నుంచి ఎదురయ్యే ముప్పును ఎదుర్కోవడానికి ఈ ఆయుధం ఉపయోగపడుతుందని అధ్యక్ష భవనం పేర్కొంది.

అయితే, అంతకుముందు కిమ్ జోంగ్ ఉన్ నేతృత్వంలోని ఉత్తర కొరియా రెండు స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. వీటిని దక్షిణ కొరియా గుర్తించింది. సెంట్రల్ నార్త్ కొరియా నుంచి వీటిని ప్రయోగించారని తెలిపింది. క్షిపణులు 800 కి.మీ ప్రయాణించి కొరియా ద్వీపకల్పానికి, జపాన్ అంతర్జాతీయ జలాలకు మధ్య పడిపోయాయని వెల్లడించింది.

జపాన్, అమెరికా స్పందన

ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగాలపై అమెరికా, జపాన్ స్పందించాయి. ఘటనను ఖండించిన అగ్రరాజ్యం.. తమ సిబ్బందికి, కూటమి సైన్యానికి ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేసింది.

మరోవైపు, క్షిపణి ప్రయోగాలు శాంతి, సుస్థిరతకు భంగం కలిగిస్తాయని జపాన్ ప్రధాని యొషిహిదె సుగా పేర్కొన్నారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠంగా నిఘా వేస్తున్నట్లు తెలిపారు.

అందుకే పరీక్షలు

ఇటీవల ఉత్తరకొరియా తన సైనిక కార్యక్రమాలకు మళ్లీ పదును పెట్టినట్లు కనిపిస్తోంది. రెండు రోజుల క్రితమే నూతనంగా తయారు చేసిన క్రూయిజ్ క్షిపణిని పరీక్షించింది. అమెరికాతో అణు చర్చల్లో పురోగతి లేని నేపథ్యంలో.. తన ఆయుధ సంపత్తిని పెంచుకోవాలని యత్నిస్తోంది.

దక్షిణ కొరియా తన ఆయుధ ప్రయోగాల గురించి బయటకు చెప్పడం అరుదు. ప్రత్యర్థి దేశమైన ఉత్తరకొరియాను రెచ్చగొట్టకుండా ఉండేందుకు నిశబ్దంగానే ఆయుధ సంపత్తిని పెంచుకుంటూ ఉంటుంది. అయితే, ఉత్తర కొరియా విషయంలో మెతక వైఖరి అవలంబిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. మూన్ జే ఇన్ సర్కారు బహిరంగంగా ఈ పరీక్షలు చేపట్టిందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: క్షిపణులతో మళ్లీ సవాళ్లు విసురుతున్న కిమ్​!

Last Updated :Sep 15, 2021, 2:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.