తెలంగాణ

telangana

ఆ దేశంలో నాలుగో డోసు.. చైనాలో అక్కడ లాక్​డౌన్​

By

Published : Dec 22, 2021, 10:20 PM IST

Updated : Dec 23, 2021, 9:26 AM IST

Israel Fourth Dose: ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో.. దేశంలోని వైద్య సిబ్బంది, 60ఏళ్లు పైబడిన వారందరికీ కొవిడ్ టీకా నాలుగో డోసు అందించేందుకు సిద్ధమైంది ఇజ్రాయెల్. కొవిడ్​-19 సోకిన వారు స్వీయ నిర్బంధంలో ఉండాల్సిన కాలవ్యవధిని 10 నుంచి 7రోజులకు తగ్గించింది బ్రిటన్​ ప్రభుత్వం. మరోవైపు జపాన్​లో ఒమిక్రాన్ సామాజిక వ్యాప్తి ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. చైనాలోని 13 లక్షల మంది ఉన్న జియాన్​ నగరంలో కఠిన లాక్​డౌన్​ విధించింది చైనా.

COVID-19
కొవిడ్​-19

Israel Fourth Dose: వేగంగా విస్తరిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్​కు అడ్డుకట్ట వేసేందుకు ఇజ్రాయెల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని వైద్య సిబ్బంది, 60ఏళ్లు పైబడిన వారందరికీ కొవిడ్ టీకా నాలుగో డోసు అందించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం బుధవారం తెలిపింది.

ఒమిక్రాన్ వ్యాప్తి దృష్ట్యా ప్రజలకు నాలుగోడోసు అందించాలని వైద్య నిపుణుల ప్యానెల్ సిఫార్సుల మేరకు ఇజ్రాయెల్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

మూడో డోసు తీసుకొని 4 నెలలు పూర్తయిన వారికే నాలుగో డోసు ఇవ్వాలని ప్యానెల్ స్పష్టం చేసింది. ప్యానెల్ నిర్ణయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని నాఫ్తాలీ బెన్నెట్ స్వాగతించారు. ఈ నిర్ణయం.. ఒమిక్రాన్ వ్యాప్తి నుంచి ఇజ్రాయెల్ బయటపడేందుకు దోహదపడుతుందన్నారు. ప్రపంచంలో ఇజ్రాయెల్​ ప్రజలే మొదటగా మూడో డోసు తీసుకున్నారని, నాలుగో డోసు కూడా ప్రజలకు అందిస్తామన్నారు.

ఇజ్రాయెల్​లో అధిక శాతం ఫైజర్​ టీకానే ఇస్తున్నారు. ఇప్పటివరకు దేశంలో 341 ఒమిక్రాన్ కేసులు నమోదుకాగా, ఈ వేరియంట్​తో ఒకరు మృతిచెందారు.

చైనాలో లాక్​డౌన్..

Lockdown In China: చైనాలోని జియాన్​ నగరంలో కొవిడ్​-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. ఆ నగరంలో కఠిన లాక్​డౌన్ విధించింది దేశ ప్రభుత్వం. ఈమేరకు నగరంలోని కోటీ 30 లక్షల మందిపై ప్రభావం పడనుంది. నగరంలోని ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావొద్దని ఆదేశాలు జారీ చేశారు అధికారులు. ప్రయాణాలపైనా ఆంక్షలు విధించారు.

జియాన్​లో ఒక్కరోజే స్థానికంగా 50కిపైగా కరోనా కేసులు నమోదయ్యాయి.

మరో రెండు నెలల్లో చైనాలో వింటర్​ ఒలింపిక్స్​ జరగనున్న నేపథ్యంలో.. లాక్​డౌన్​ విధించడం కలవరపెడుతోంది.

ప్రతి ఇంటి నుంచి ఒక్కరు చొప్పున రెండు రోజులకు ఒకసారి నిత్యవసరాలు కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పించారు అధికారులు.

ఐసోలేషన్​ వ్యవధి తగ్గింపు..

UK Isolation Rules: కొవిడ్​-19 సోకిన వారు స్వీయ నిర్బంధంలో ఉండాల్సిన కాలవ్యవధిని తగ్గించింది బ్రిటన్​ ప్రభుత్వం. క్వారంటైన్ వ్యవధిని 10 నుంచి 7 రోజులకు తగ్గించింది. అయితే.. కొవిడ్ సోకిన వారికి పరీక్షల్లో వరుసగా ఆరో రోజు, ఏడో రోజు నెగెటివ్ వస్తేనే ఈ నిబంధన వర్తిస్తుందని బ్రిటన్ హెల్త్ సెక్రటరీ సాజిద్ జావీద్ బుధవారం తెలిపారు. యూకే హెల్త్ ఏజెన్సీని సంప్రదించాక ఈ నిర్ణయం తీసుకున్నట్లు జావీద్ వివరించారు. కొవిడ్​ మహమ్మారి వల్ల ప్రజలు పడుతున్న బాధలను తగ్గించేందుకే ఇలా చేశామన్నారు.

ఒమిక్రాన్ వ్యాప్తి కారణంగా.. యూకేలో ఇటీవల రోజూవారీ కేసులు 90 వేలకు పైగా నమోదవుతున్నాయి. మంగళవారం మరో 90,629 మంది కొవిడ్​-19 బారిన పడ్డారు. దేశంలో వచ్చే వారం రోజుల్లో ఒమిక్రాన్​ వ్యాప్తి తారస్థాయికి చేరుకుంటుందని వైద్యనిపుణులు అంచనా వేస్తున్నారు.

దక్షిణాఫ్రికాలో తగ్గిన ఒమిక్రాన్ వ్యాప్తి!

Omicron In South Africa News: దక్షిణాఫ్రికాలో రోజూవారీ కొవిడ్​-19 కేసులు తగ్గుముఖం పట్టాయి. దీంతో దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ తారస్థాయి వ్యాప్తిని దాటిపోయిందని వైద్య నిపుణులు అంటున్నారు. గతవారం రోజూవారీ కేసులు 27 వేలు ఉండగా.. మంగళవారం 15,424 కేసులు నమోదయ్యాయి.

ఒమిక్రాన్ పుట్టిన గాటెంగ్ రాష్ట్రంలోనూ కేసులు తగ్గుముఖం పట్టాయి. డిసెంబరు 12 వరకు రోజూవారీ కేసులు 16 వేలు ఉండగా.. మంగళవారం కేవలం 3,300 కేసులు మాత్రమే వెలుగుచూశాయి.

ఫ్రాన్స్​లో పిల్లలకు వ్యాక్సినేషన్​..

France Children Vaccination: ఫ్రాన్స్​లో ఒమిక్రాన్​ విజృంభిస్తోంది. 2021 చివర్లో కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి ఒలివీర్​ తెలిపారు. మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు వ్యాక్సినేషన్​ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని నిర్ణయించినట్లు స్థానిక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. 5-11 ఏళ్ల పిల్లలకు కూడా టీకాలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఇప్పుడు పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వాల్సిన సమయం అన్నారు ఒలివీర్​.

ఫ్రాన్స్​లో తాజాగా 72,832 కొవిడ్​-19 కేసులు నమోదయ్యాయి. ఇందులో దాదాపు 20శాతం ఒమిక్రాన్ కేసులు ఉన్నట్లు ఆరోగ్య మంత్రి తెలిపారు.

జపాన్​లో ఒమిక్రాన్ సామాజిక వ్యాప్తి..

Japan Omicron Community Spread: జపాన్​లో ఒమిక్రాన్ సామాజిక వ్యాప్తి చెందినట్లు తెలిపారు ఒసాకా రాష్ట్ర గవర్నర్ హిరోఫుమి యోషిమురా. ఒసాకా రాష్ట్రంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిలో ఒమిక్రాన్ గుర్తించారు వైద్యులు. అయితే వీరిలో ఎవరూ రాష్ట్రం దాటి బయటకు వెళ్లలేదని యోషిమురా అన్నారు.

దీన్నిబట్టి దేశంలో ఒమిక్రాన్ సామాజిక వ్యాప్తి ప్రారంభమైందన్న సందేహం కలుగుతోందన్నారు. జపాన్​లో తాజాగా 80 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.

ఇదీ చూడండి:కరోనాతో అగ్రరాజ్యం విలవిల.. ఒక్కరోజే 1.81 లక్షల కేసులు

Last Updated : Dec 23, 2021, 9:26 AM IST

ABOUT THE AUTHOR

...view details