తెలంగాణ

telangana

ట్రంప్ x బైడెన్: 'ఎవరు గెలిచినా ఒకటే'

By

Published : Nov 3, 2020, 10:18 AM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలిచినా భారతీయులపై పెద్దగా ప్రభావం ఉండదని చెబుతున్నారు కన్సాస్ స్టేట్ విశ్వవిద్యాలయ గౌరవ ఆచార్యులు కృష్ణ కుమార్ తుమ్మల. బైడెన్ అధికారంలోకి వచ్చినా.. రాత్రికి రాత్రే మారేదేం ఉండదని స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో 'ఈనాడు'తో మాట్లాడిన ఆయన.. తన అభిప్రాయాలను పంచుకున్నారు.

prof krishna kumar tummala
ట్రంప్ x బైడెన్: 'ఎవరు గెలిచినా ఒకటే'

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు భారతీయులపై పెద్దగా ప్రభావం చూపబోవంటున్నారు కన్సాస్ స్టేట్ విశ్వవిద్యాలయ గౌరవ ఆచార్యులు కృష్ణ కుమార్ తుమ్మల. ట్రంప్ మళ్లీ గెలిచినా, బైడెన్ విజయం సాధించినా ఆ దేశం అనుసరించే విధానాల్లో మాత్రం పెద్దగా తేడా ఉండబోదని ఆయన పేర్కొన్నారు. అమెరికాలోకి విదేశీ నిపుణులు, విద్యార్థుల ప్రవేశం విషయంలో ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తున్న మాట వాస్తవమే అయినప్పటికీ, బైడెన్ అధికారంలోకి వచ్చినా రాత్రికి రాత్రే మారేదేం ఉండదని స్పష్టం చేశారు.

1968 లో అమెరికా వెళ్లిన కృష్ణకుమార్(84) అక్కడ వివిధ విశ్వవిద్యాలయాల్లో రాజనీతి శాస్త్ర ఆచార్యుడిగా పనిచేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ఆయన 'ఈనాడు' ప్రతినిధితో మాట్లాడారు. పలు అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.

ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానాలు భారత్​కు వ్యతిరేకంగా ఉన్నా, మోదీతో స్నేహం ఎన్నికల్లో లాభిస్తుందా?

మోదీతో ఉన్న స్నేహం కారణంగా ఎన్నికల్లో ట్రంప్ లాభపడతారనే భావన చాలామందిలో ఉంది. మోదీతో ట్రంప్ కలిసి ఉన్న ఫొటోలను ఎన్నికల ప్రచారంలో ఆయన బృందం విరివిగా వాడుకుంది. అయితే- వారి వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందన్నది ఇప్పుడే చెప్పలేం. డెమొక్రాట్ల తరఫున ఉపాధ్యక్ష పదవికి కమలా హారిస్ పోటీలో ఉండటంతో అటువైపు భారతీయ అమెరికన్లలో, ముఖ్యంగా తమిళుల్లో మొగ్గు కనిపిస్తోంది.

అమెరికాలో ఏ వర్గం ప్రజలు ట్రంప్​కు అనుకూలంగా ఉన్నారు? రిపబ్లికన్ పార్టీ సంప్రదాయ ఓటర్లెవరైనా ఆయన నుంచి దూరంగా వెళ్లారా?

ట్రంప్ ప్రధాన బలం వర్కింగ్ క్లాస్ ప్రజలు. తక్కువగా చదువుకున్నవాళ్లు, ఆవేశంతో మాట్లాడే తెల్లజాతి వ్యక్తులు కూడా ఆయనవైపు ఎక్కువగా మొగ్గుచూపుతుంటారు. సబర్బన్ ప్రాంతాల్లోని గృహిణులు, ఇతర మహిళలు 2016లో ట్రంప్ వైపు నిలబడ్డారు. అప్పట్లో ఆయన మహిళలను తక్కువ చేసి మాట్లాడినా వారు పెద్దగా పట్టించుకోలేదు. ప్రస్తుతం వారంతా వాస్తవం తెలుసుకున్నారు. ఇక రిపబ్లికన్ పార్టీ కాస్తా ట్రంప్ పార్టీలా మారింది.

బైడెన్​కు విజయావకాశాలు ఏ మేరకు ఉన్నాయి? ట్రంప్​కు బలమైన పోటీదారుగా ఆయన ఎదగడానికి దారితీసిన పరిస్థితులేంటి?

ప్రస్తుతం బైడెన్ విజయం ఖాయమని అన్ని సర్వేలు జోస్యం చెబుతున్నాయి. అయితే గత ఎన్నికల్లో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని చూస్తే, వాటిని నమ్మే పరిస్థితుల్లేవు. బైడెన్ గట్టి ప్రత్యర్థి అని చెప్పడంలో మాత్రం ఎలాంటి సందేహాలు లేవు. ట్రంప్ రాజకీయ విధానాలను ఆయన ప్రచారంలో తూర్పారబట్టారు. కొవిడ్ మహమ్మారి నియంత్రణలో అధ్యక్షుడి వైఫల్యాన్ని ఎండగట్టారు. ప్రవర్తన విషయంలో ట్రంప్ కంటే బైడెన్ మెరుగు. ఇక కమలా హారిస్​ను ఉపాధ్యక్ష పదవికి బరిలో దించడం మాస్టర్ స్ట్రోక్ వంటిది. మహిళలను- ప్రత్యేకించి నల్లజాతి స్త్రీలు, ఇతర మైనారిటీ వర్గాలను ఆమె బాగా ఆకర్షించారు. అయితే ఎన్నికల్లో ఏం జరుగుతుందనేది ఎవరూ చెప్పలేరు. ఒక్కటి మాత్రం నిజం. బైడెన్ గెలిచినా, ట్రంప్ కొనసాగినా భారతీయులపై పెద్దగా ప్రభావమేమీ ఉండబోదు.

ABOUT THE AUTHOR

...view details