తెలంగాణ

telangana

షూటింగ్స్​ ఎప్పుడో పూర్తయినా.. రిలీజ్​లపై క్లారిటీ లేదే!

By

Published : Jul 28, 2022, 6:54 AM IST

కరోనా మహమ్మారి దెబ్బకు రెండేళ్ల పాటు సినీ పరిశ్రమ క్యాలెండర్​ తారుమారయ్యింది. ఆ తర్వాత మెల్లమెల్లగా చిత్రీకరణ పూర్తయిన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ఇప్పటికే షూటింగ్​ పూర్తి చేసుకున్న పలు హీరోల చిత్రాలు.. ఇంకా రిలీజ్​ తేదీని ఖరారు చేసుకోలేదు. ఆ సినిమాల వివరాలను ఓ సారి చూద్దాం రండి..

Upcoming telugu movies release dates
Upcoming telugu movies release dates

Upcoming Telugu Movies: సంక్రాంతి.. వేసవి.. దసరా.. దీపావళి.. అంటూ పక్కా ప్రణాళికలతో సాగుతుంటుంది సినీ క్యాలెండర్‌. అగ్రతారలు పండగ రోజులపై గురిపెడితే.. కుర్రహీరోలు మిగిలిన రోజుల్ని పంచుకుంటుంటారు. ఒకరి తర్వాత ఒకరిగా వినోదాల విందు భోజనం వడ్డిస్తుంటారు. అయితే కొవిడ్‌ దెబ్బకు రెండేళ్ల పాటు ఈ సినీ క్యాలెండర్‌ తారుమారయ్యింది. ఏ చిత్రం ఎప్పుడు వస్తుందో తెలియని సందిగ్ధం. చిత్రీకరణలు పూర్తయినా ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా? రారా? అన్న భయాలతో తారలంతా పదే పదే వాయిదాల బాట పట్టారు. అయితే ఇప్పుడా పరిస్థితులన్నీ కుదుట పడ్డాయి. ఆరంభంలో కొవిడ్‌ భయపెట్టినా.. ఆ తర్వాత నుంచి సినీ క్యాలెండర్‌ మునుపటిలా పక్కా ప్రణాళికతో కొనసాగింది. ఇప్పుడు బాక్సాఫీస్‌ ముందు వానా కాలం వినోదాల జల్లు కురుస్తోంది. ఆగస్టు నుంచి సెప్టెంబరు వరకు బెర్తులన్నీ దాదాపు ఖరారైపోయాయి. దసరా సీజను నిండింది. కానీ, ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న పలు సినిమాలు.. ఇంత వరకు విడుదల కబురు వినిపించలేదు.

Nagashourya New Movie: గతేడాది ఆఖర్లో 'వరుడు కావలెను' చిత్రంతో విజయాన్ని అందుకున్నారు కథానాయకుడు నాగశౌర్య. ఆ వెంటనే 'లక్ష్య'తో ప్రేక్షకుల ముందుకురాగా.. అది ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత ఆయన నటించిన కొత్త చిత్రం 'కృష్ణ వ్రిందా విహారి'. అనిష్‌ ఆర్‌.కృష్ణ తెరకెక్కించారు. ఏడాది ఆరంభంలోనే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాను.. వేసవి బరిలో నిలిపేందుకు ప్రయత్నించారు నిర్మాతలు. కానీ అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. జూన్‌ నెలాఖరులో విడుదల కానున్నట్లు అప్పట్లో ప్రచారం వినిపించినా.. అది సాధ్యపడలేదు. ఇప్పటికే ఆగస్టు నుంచి సెప్టెంబర్‌ వరకు బెర్తులన్నీ ఖరారైన నేపథ్యంలో.. ఈ సినిమా ఎప్పుడొస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

హీరో నాగశౌర్య

Nikhil Karthikeya Movie: కొవిడ్‌ పరిస్థితుల వల్ల రెండున్నరేళ్లుగా ఒక్క చిత్రాన్నీ విడుదల చేయలేకపోయారు కథానాయకుడు నిఖిల్‌. ఈ విరామంలో ఆయన రెండు సినిమాలు పూర్తి చేశారు. వాటిలో ఒకటి 'కార్తికేయ 2' కాగా.. మరొకటి '18 పేజెస్‌'. ఈ రెండింటిలోనూ నిఖిల్‌, అనుపమ జంటగా నటించడం విశేషం. వీటిలో 'కార్తికేయ 2' వచ్చే నెల 12న రానుండగా.. '18 పేజెస్‌' విడుదలపై ఇంత వరకు స్పష్టత రాలేదు. పల్నాటి సూర్య ప్రతాప్‌ తెరకెక్కించిన చిత్రమిది. దీన్ని సెప్టెంబరులో విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించారు.

హీరో నిఖిల్​

Sharwanand New Movie: ఏడాది ఆరంభంలో 'ఆడవాళ్లు మీకు జోహార్లు'తో బాక్సాఫీస్‌ ముందు సందడి చేశారు శర్వానంద్‌. అయితే ఇది ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ఇప్పుడాయన నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న మరో సినిమా 'ఒకే ఒక జీవితం'. శ్రీకార్తీక్‌ తెరకెక్కించారు. సైన్స్‌ ఫిక్షన్‌ అంశాలతో ముడిపడిన ఈ కుటుంబ కథా చిత్రం.. వేసవిలోనే విడుదల కానున్నట్లు చిత్ర బృందం ప్రకటించినా.. అది సాధ్యపడలేదు. మరెప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందన్నది తేలాల్సి ఉంది.

హీరో శర్వానంద్​

Sudheer Babu Movie: మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన 'సమ్మోహనం' చిత్రంతో చక్కటి విజయాన్ని అందుకున్నారు సుధీర్‌బాబు. ఆ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్‌లో రూపొందిన 'వి' వచ్చింది. ఇప్పుడీ ఇద్దరి కలయికలో తెరకెక్కిన చిత్రం 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. కృతి శెట్టి కథానాయిక. ఈ సినిమా.. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. కానీ, విడుదల విషయంలో ఇంత వరకు ఏ స్పష్టత రాలేదు.

హీరో సుధీర్​ బాబు

Hanu-Man Movie: తేజ సజ్జా హీరోగా ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం 'హను-మాన్‌'. 'జాంబిరెడ్డి' వంటి హిట్‌ తర్వాత ఈ ఇద్దరి కలయికలో రూపొందిన చిత్రమిది. ఆసక్తికరమైన సూపర్‌ హీరో కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తామని గతంలో దర్శకుడు ప్రశాంత్‌ ట్విటర్‌ వేదికగా తెలిపారు. కానీ, ఇంత వరకు విడుదల తేదీపై స్పష్టత ఇవ్వలేదు.

Satyadev Upcoming Movie: గత నెలలోనే 'గాడ్సే'గా థియేటర్లలో సందడి చేశారు కథానాయకుడు సత్యదేవ్‌. ఇప్పుడాయన నుంచి రావాల్సిన మరో కొత్త చిత్రం 'గుర్తుందా శీతాకాలం'. నాగ శేఖర్‌ తెరకెక్కించారు. తమన్నా కథానాయిక. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా.. ఇంత వరకు విడుదల తేదీ ప్రకటించలేదు. వీళ్లే కాదు సమంత - గుణశేఖర్‌ కాంబినేషన్‌లో రూపొందిన పాన్‌ ఇండియా సినిమా 'శాకుంతలం', అనుపమ పరమేశ్వరన్‌ ప్రధాన పాత్రలో నటించిన 'బటర్‌ఫ్లై', రెజీనా, నివేదా థామస్‌ నటించిన 'శాకినీ ఢాకినీ' వంటి చిత్రాలు సైతం విడుదల తేదీలు ప్రకటించాల్సి ఉంది.

ఇవీ చదవండి:క్యూట్​ లుక్​లో పూర్ణ.. ఫొటోలు అదిరాయిగా!

'బింబిసార' కొత్త ట్రైలర్‌.. కల్యాణ్​ రామ్​ అదరగొట్టేశాడుగా

ABOUT THE AUTHOR

...view details