తెలంగాణ

telangana

రవితేజ సినిమా నుంచి జింతాక్‌ పాట, ఏప్రిల్‌లో టైగర్‌ 3

By

Published : Aug 16, 2022, 7:38 AM IST

Updated : Aug 16, 2022, 8:14 AM IST

మాస్​ మహారాజ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ధమాకా చిత్రం నుంచి కొత్త పాటను విడుదల చేయనున్నారు. జింతాక్‌ అంటూ సాగే ఈ సినిమాలోని పాటను ఈ నెల 18న విడుదల చేయనున్నట్టు చిత్రవర్గాలు తెలిపాయి. మరోవైపు, సల్మాన్‌ఖాన్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం టైగర్‌ 3. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 21న విడుదలవుతున్నట్టు సల్మాన్‌ సోమవారం స్వయంగా ప్రకటించారు. ​

ravi teja dhamaka
ravi teja dhamaka

రవితేజ కథానాయకుడిగా.. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ధమాకా'. డబుల్‌ ఇంపాక్ట్‌ అనేది ఉపశీర్షిక. శ్రీలీల కథానాయిక. టి.జి.విశ్వప్రసాద్‌ నిర్మాత. జింతాక్‌... అంటూ సాగే ఈ సినిమాలోని పాటని ఈ నెల 18న విడుదల చేయనున్నట్టు చిత్రవర్గాలు తెలిపాయి. భీమ్స్‌ సిసిరోలియో స్వరకల్పనలోని ఈ గీతం మాస్‌ నెంబర్‌గా ప్రేక్షకుల్ని అలరించనుందని స్పష్టం చేశాయి. ప్రసన్నకుమార్‌ బెజవాడ కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: కార్తీక్‌ ఘట్టమనేని, పోరాటాలు: రామ్‌-లక్ష్మణ్‌.

ఏప్రిల్‌లో.. 'టైగర్‌ 3': బాలీవుడ్‌ చిత్రవర్గాలు, సల్మాన్‌ఖాన్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'టైగర్‌ 3'. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 21న విడుదలవుతున్నట్టు సల్మాన్‌ సోమవారం స్వయంగా ప్రకటించారు. ఇందులో తనకి జోడీగా కత్రినా కైఫ్‌ నటిస్తున్నారు. మనీశ్‌శర్మ దర్శకుడు. 'టైగర్‌' మొదటి భాగం విడుదలై ఆగస్టు 15 నాటికి సరిగ్గా పదేళ్లు. ఈ సందర్భంగా 'టైగర్‌ 3' విడుదల తేదీని ప్రకటించారు. మొదటి రెండు భాగాలైన 'ఏక్‌ థా టైగర్‌', 'టైగర్‌ జిందా హై'లకు సంబంధించి గ్లింప్స్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పంచుకున్నారు. మరోవైపు నిర్మాణసంస్థ యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ యూట్యూబ్‌లో ఒక ప్రత్యేక గ్లింప్స్‌ వీడియో విడుదల చేసింది. 'పదేళ్ల కిందట సింహగర్జన చేస్తూ మీ హృదయాల్లో ఒక స్థానం సంపాదించుకున్నాడు. అదే ఊపుతో తను ఇప్పుడు మళ్లీ వస్తున్నాడు. వచ్చే ఏడాది ఈద్‌కి థియేటర్లలో టైగర్‌ మీ ముందుంటాడు. ఈ చిత్రం హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది' అంటూ అందులో వివరాలు పంచుకుంది. ప్రస్తుతం సల్మాన్‌ఖాన్‌ నటిస్తున్న 'భాయీజాన్‌' వరుసలో ఉంది. ఇందులో పూజా హెగ్డే కథానాయిక.

పండుగాడ్‌ మెప్పిస్తాడు:ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో రూపొందిన చిత్రం 'వాంటెడ్‌ పండుగాడ్‌'. సునీల్‌, అనసూయ భరద్వాజ్‌, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్‌, సప్తగిరి, శ్రీనివాస్‌రెడ్డి, సుడిగాలి సుధీర్‌ ప్రధాన పాత్రధారులు. శ్రీధర్‌ సీపాన దర్శకుడు. సాయిబాబ కోవెలమూడి, వెంకట్‌ నిర్మాతలు. ఈ చిత్రం ఈనెల 19న ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా హైదరాబాద్‌లో విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. 'పెళ్లిసందడి' జోడీ రోషన్‌, శ్రీలీల ముఖ్య అతిథులుగా హాజరై తొలి టికెట్‌ని ఆవిష్కరించారు.కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ ''సినిమాలకి పూర్వవైభవం వచ్చింది. 'సీతారామం', 'బింబిసార', 'కార్తికేయ2' విజయవంతంగా ప్రదర్శితమవుతున్నాయి. వినోదాత్మక చిత్రంగా రూపొందిన 'వాంటెడ్‌ పండుగాడ్‌' సైతం ప్రేక్షకుల్ని అలరిస్తుంద''న్నారు. కార్యక్రమంలో అనసూయ, బి.వి.ఎస్‌.రవి, దుబాయ్‌ శర్మ, వసంతి, దీపికా, పృథ్వీ పాల్గొన్నారు.

'ప్రేమ విమానం'కు క్లాప్‌ క్లాప్‌: సంగీత్‌ శోభన్‌, శాన్వీ మేఘన జంటగా నటిస్తున్న చిత్రం ‘ప్రేమ విమానం'. సంతోష్‌ కట దర్శకుడు. అభిషేక్‌ నామా నిర్మిస్తున్నారు. ఈ సినిమా సోమవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి భరత్‌ నారంగ్‌ క్లాప్‌ కొట్టగా.. గీతా ఆర్ట్స్‌ బాబీ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. సునీల్‌ నారంగ్‌ స్క్రిప్ట్‌ అందించారు. న్యూఏజ్‌ లవ్‌స్టోరీగా రూపొందుతోన్న చిత్రమిది. ఈ సినిమాలో కల్పలత, సుప్రీత్‌, శైలజ ప్రియ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఛాయాగ్రహణం: జగదీష్‌ చీకటి.

ఇవీ చదవండి;ఈ సినిమా కోసం నా సర్వస్వం ఇచ్చేశా

ఉత్కంఠ రేపుతున్న హత్య ట్రైలర్, రంగ రంగ వైభవంగా రిలీజ్​ డేట్​ ఫిక్స్

Last Updated : Aug 16, 2022, 8:14 AM IST

ABOUT THE AUTHOR

...view details