తెలంగాణ

telangana

జర్నలిస్ట్​పై దాడి.. కోర్టును ఆశ్రయించిన సల్మాన్‌ ఖాన్‌!

By

Published : Apr 5, 2022, 12:46 PM IST

Updated : Apr 5, 2022, 2:28 PM IST

Salman Khan: జర్నలిస్ట్​పై దాడి కేసులో స్థానిక కోర్టు ఇచ్చిన నోటీసులను సవాల్​ చేస్తూ ముంబయి హైకోర్టును ఆశ్రయించాడు బాలీవుడ్​ సూపర్​ స్టార్​ సల్మాన్​ ఖాన్​. స్థానిక కోర్టు ఉత్తర్వులను రద్దు చేయాలని కోరాడు. సల్మాన్​ పిటిషన్​పై విచారణ చేపట్టిన హైకోర్టు మే 5 వరకు స్టే విధించింది.

Salman Khan
సల్మాన్​ ఖాన్​

Salman Khan: బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌, కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ ముంబయి హైకోర్టును ఆశ్రయించాడు. జర్నలిస్టుపై దాడి కేసులో ఇటీవల అంధేరీ కోర్టు సల్మాన్‌, అతని బాడీగార్డ్‌ నవాజ్‌ షేక్‌కు నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో భాగంగా ఏప్రిల్‌ 5న అంధేరీ కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అంధేరీ కోర్టు జారీ చేసిన నోటీసులను సవాల్​ చేస్తూ హైకోర్టును ఆశ్రయించాడు. జిల్లా కోర్టు ఆదేశాలను కొట్టివేయాలని, తనకు ఉపశమనం కల్పించాలని కోరాడు.

స్టే ఇచ్చిన హైకోర్టు: బాలీవుడ్​ సూపర్​ స్టార్​కు హైకోర్టులో రెట్టింపు ఉపశమనం లభించింది. జర్నలిస్ట్​పై దాడి కేసులో కింది కోర్టు ఇచ్చిన సమన్లపై మే 5 వరకు స్టే విధించింది హైకోర్టు. అలాగే.. మే 9 వరకు అదే కేసులో వ్యక్తిగత హాజరుపై మినహాయింపు కల్పించింది జస్టిస్​ రేవతి మోహితే డేరే నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం. సల్మాన్​ పిటిషన్​పై అఫిడవిట్​ దాఖలు చేయాలని ఫిర్యాదు దారు జర్నలిస్ట్​ అశోక్​ పాండేను ఆదేశించింది. పిటిషన్​పై తదుపరి విచారణను మే 9కి వాయిదా వేసింది.

కేసు ఏమిటి?:2019లో సల్మాన్​ఖాన్ తనపై​ దాడి చేశాడని, మొబైల్​ ఫోన్‌ బలవంతంగా లాక్కొని బెదిరించాడని ఆరోపిస్తూ అంధేరీ కోర్టులో ఫిర్యాదు చేశాడు అశోక్‌ పాండే అనే ఓ జర్నలిస్ట్. సల్మాన్​తో పాటు అతడి బాడీగార్డ్​పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు. ఓ రోజు సల్మాన్‌ సైక్లింగ్‌ చేస్తుండగా మీడియా ఆయన చుట్టూ చేరి ఫొటోలు, వీడియోలు తీస్తుండగా ఈ సంఘటన జరిగింది.

జర్నలిస్ట్​ ఫిర్యాదు మేరకు లోకల్‌ పోలీసులను ఈ కేసు విచారణ చేపట్టాల్సిందిగా అంధేరీ కోర్టు ఆదేశించింది. ఇటీవల దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు సల్మాన్‌, అతడి బాడీగార్డ్‌కు వ్యతిరేకంగా నివేదిక సమర్పించారు. దీంతో మెట్రో పాలిటన్‌ మేజిస్ట్రేట్‌ ఆర్‌ఆర్‌ ఖాన్‌ ఉత్తర్వులు జారీ చేస్తూ సల్మాన్‌, ఆయన బాడీగార్డ్‌పై ఐపీసీ సెక్షన్‌ 504, 506 కింద కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో అంధేరీ కోర్టు మార్చి 23న సల్మాన్‌, ఆయన బాడీగార్డుకు నోటీసులు ఇచ్చి ఏప్రిల్‌ 5న విచారణకు హాజరవ్వాల్సిందిగా ఆదేశించింది.

ఇదీ చూడండి:బాలీవుడ్​లో హీరోయిజం కరవైంది: సల్మాన్​ ఖాన్​

Last Updated : Apr 5, 2022, 2:28 PM IST

ABOUT THE AUTHOR

...view details