తెలంగాణ

telangana

'ఇక్కడ తనువు చాలించారు.. పరలోకాల్లో అలరిస్తారా..'

By

Published : Feb 3, 2023, 7:34 PM IST

Updated : Feb 3, 2023, 7:50 PM IST

ప్రముఖ దర్శకుడు కళాతపస్వి.. కె.విశ్వనాథ్​ తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలో ఆయనకు సంబంధించిన ఓ ఫొటో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటోను పంచుకుంటూ అభిమానులు భావోద్వేగానికి గురవుతున్నారు. 'ఇక్కడ తనువు చాలించారు.. పరలోకాల్లో అలరిస్తారా' అంటూ.. కంటతడి పెడుతున్నారు.

vishwanath sp balu siri vennela viral photo
vishwanath sp balu siri vennela viral photo

తెలుగు భాష, సంస్కృతులకు వన్నెలద్దిన కళామతల్లి ముద్దుబిడ్డలు ఒక్కొక్కరిగా తనువు చాలిస్తున్నారు. తెలుగు వెలుగులను అశేష ప్రజానీకానికి అందించిన కళా సేవకులు.. తీరని శోకాన్ని మిగుల్చుతున్నారు. తెలుగు సినీ స్వర్ణ శకాన్ని వారితోపాటే తీసుకెళ్తున్నారు. గడిచిన ఐదు నెలల్లో ఐదుగురు దిగ్గజాలు కన్నుమూశారు. గతేడాది సెప్టెంబరులో ప్రముఖ నటుడు రెబల్​ స్టార్ కృష్ణం రాజు కన్నుమూశారు. ఆ తర్వాత తెలుగు ధృవతార సూపర్​ స్టార్​ కృష్ణ నేలకొరిగారు. గత డిసెంబరులో నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ తుదిశ్వాస విడిచారు. ఆ తర్వాత ప్రముఖ నటుడు చలపతిరావు, ఈ ఏడాది జనవరిలో తెలుగువారి సత్యభామ జమున కన్నుమూశారు.

కాశీనాథుని విశ్వనాథ్​, ఎస్​పీ బాలసుబ్రహ్మణ్యం, సిరివెన్నెల సీతారామ శాస్త్రి

ఇలా ఒకరి తర్వాత ఒకరు తెలుగు సినీపరిశ్రమకు తీరని లోటును మిగిల్చారు. నేడు, కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్​ అనంతలోకాలకు వెళ్లిపోయారు. దీంతో తెలుగు సినీ పరిశ్రమ శోకసంద్రంలో ముగిని పోయింది. ఈ క్రమంలో.. కె.విశ్వనాథ్​తో, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సిరివెన్నెల సీతారామ శాస్త్రి దిగిన ఓ ఫోటో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటోను చుసి విశ్వనాథుడికి కన్నీటి వీడ్కోలు చెబుతూనే.. తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు నెటిజన్లు. ఈ ముగ్గురి కాంబినేషన్​లో వచ్చిన చిత్రం 'సిరివెన్నెల' సంచలన విజయం సాధించింది. ఆ చిత్రాన్ని గుర్తుచేసుకుంటూ 'ఇక్కడ తనువు చాలించారు.. ఇక పరలోకాల్లో అలరిస్తారా' అంటూ ముగ్గురినీ ఒకే ఫొటోలు చూసి భావోద్వేగంతో అంటున్నారు. నివాళులు అర్పిస్తున్నారు.

గాన గంధర్వుడు ఎస్​పీ బాలసుబ్రహ్మణ్యం

తరలిపోయిన మధుర గానం..
గంధర్వులను సైతం మంత్ర ముగ్దుల్ని చేయగల గాత్రం ఎస్పీ బాలు సొంతం. తన మధుర గానంతో మాయ చేయగల సమర్థుడు. ప్రపంచ చలన చిత్ర చరిత్రలో బాలు అసాధారణ ప్రజ్ఞావంతుడు. దాదాపు 40 వేలపైగా పాటలతో ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగారు. ఎలాంటి పాటనైనా అవలీలగా పాడేవారు ఎస్పీ బాలు. ప్రతి పదాన్ని స్పష్టంగా పలుకుతారు. మరీ చెప్పాలంటే ఆయన నోట తెలుగు మాట చాలా అందంగా వినిపిస్తుంది. పాటలు పాడటమే కాదు.. పదాలకు, స్వరాలు అల్లడంలో కూడా ప్రావీణ్యత సాధించారు. పలు సినిమాలకు సంగీత దర్శకుడిగా కూడా పనిచేశారు. అలా చివరి మజిలీ ముగించుకుంటూ కరోనా బారిన పడిన ఎస్పీ బాలు.. 25 సెప్టెంబర్​ 2020న అనంతలోకాలకు తరలివెళ్లారు. ఆయన పాటల పూదోటలో మాధుర్యాన్ని ఒడిసిపట్టి.. మనస్ఫూర్తిగా ఆ తేనెల తీయదనాన్ని ఆస్వాదించిన అశేష అభిమానులకు తీరని శోకాన్ని మిగిల్చారు.

సిరివెన్నెల సీతారామ శాస్త్రి

పదాలకు సిరి'వెన్నెల' ఫూశారు..
బాలు తర్వాత సెలవు తీసుకున్నారు అక్షర రుషి సిరివెన్నెల సీతారామ శాస్త్రి. ఈయన రాసిన ప్రతి అక్షరం ఓ పాఠమే. ప్రతి పదం ఓ జీవిత శారాంశమే. అంతటి భావాన్ని అక్షరాల్లో మలిచి.. సామాజిక రుగ్మతలతో సతమతమవుతున్న సమాజానికి వెలుగునిచ్చారు. తన కలం నుంచి అభ్యుదయాన్ని, ఆశావాదాన్ని జాలువార్చి చైతన్య జ్యోతిని వెలిగించారు. మరోవైపు, కుర్రకారుపై చిలిపి ప్రేమలనూ చిలకరించారు. ఇంతటి అగ్గిపడుగులను, వెన్నెల వెలుగులను అందించిన సిరివెన్నెల సిర.. 30 నవంబర్​ 2021న శాశ్వతంగా ఇంకిపోయింది.

కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్

కళా తపస్వి.. అసమాన యశస్వి..
సినిమాలను అపురూప శిల్పాల్లా చెక్కిన కళాతపస్వి కె.విశ్వనాథ్(92)​ గురువారం కన్నుమూశారు. 5 దశాబ్దాల పాటు తెలుగు చిత్రసీమలో తనదైన ముద్రవేసిన విశ్వనాథ్​​.. ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. ఆయన ప్రతి చిత్రం ఓ నిఘంటువంటూ.. సినీ ప్రముఖులు శోక సంద్రంలో మునిగిపోయారు. కాసులు కాకుండా కళకే ప్రధాన్యమిచ్చిన కళా సేవకుడు.. అనేక సినిమాల్లో తెలుగు భాష, సంస్కృతికి వన్నెలద్దారు. భావి తరాలకు ఆశా కిరణమయ్యారు.

Last Updated : Feb 3, 2023, 7:50 PM IST

ABOUT THE AUTHOR

...view details