తెలంగాణ

telangana

భూమి రిజిస్ట్రేషన్ కోసం వస్తే.. తుపాకీతో బెదిరించి రూ.40 లక్షలు లాక్కెళ్లాడు

By

Published : Jan 31, 2022, 1:56 PM IST

Updated : Feb 1, 2022, 10:57 AM IST

thief
thief

13:52 January 31

భూమి రిజిస్ట్రేషన్ కోసం వస్తే.. తుపాకీతో బెదిరించి రూ.40 లక్షలు లాక్కెళ్లాడు

భూమి రిజిస్ట్రేషన్ కోసం వస్తే.. తుపాకీతో బెదిరించి రూ.40 లక్షలు లాక్కెళ్లాడు

కారు డ్రైవర్‌పై ఇద్దరు గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపి దోపిడీకి పాల్పడ్డ ఘటన సిద్దిపేట అర్బన్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఈ ఘటనలో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. స్థిరాస్తి వ్యాపారి నర్సయ్య, పోలీసులు తెలిపిన వివరాలు..

చేర్యాల మండలం దొమ్మాట మాజీ సర్పంచి, సిద్దిపేట నివాసి వకులాభరణం నర్సయ్య స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నారు. పట్టణంలోని హౌసింగ్‌ బోర్డు కాలనీలో ఉన్న 176 గజాల స్థలాన్ని పట్టణంలోని ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్రీధర్‌రెడ్డికి నెలన్నర క్రితం రూ.64.24 లక్షలకు విక్రయించేందుకు ఒప్పందం చేసుకున్నారు. అడ్వాన్సుగా రూ.20 లక్షల వరకు చెల్లించారు. మిగిలిన మొత్తం రిజిస్ట్రేషన్‌ సమయంలో ఇచ్చేందుకు పత్రం రాసుకున్నారు. సోమవారం రిజిస్ట్రేషన్‌కు ముందు రూ.43.50 లక్షలను శ్రీధర్‌రెడ్డి ఇచ్చారు. ఆ సొమ్ముతో కూడిన సంచిని నర్సయ్య తన కారులో ఉంచి.. రిజిస్ట్రేషన్‌ నిమిత్తం కార్యాలయంలోకి వెళ్లారు. అంతలో తలకు టోపీ, ముఖానికి మాస్కులు ధరించిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి.. లాక్‌ వేసి ఉన్న కారు డోరును తెరిచే ప్రయత్నం చేశారు. డ్రైవర్‌ పరశురాములు అప్రమత్తమై కారును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. వారు డ్రైవర్‌కు కుడివైపు కొంతమేర తెరిచి ఉన్న అద్దంలో నుంచి నాటుతుపాకీతో కాల్పులు జరిపి.. అద్దాన్ని ధ్వంసం చేశారు. అనంతరం డ్రైవర్‌ పక్కన ఉన్న నగదు సంచి తీసుకుని పరారయ్యారు. నాటుతుపాకీ కారులో పడిపోగా అక్కడే వదిలేశారు.

ఘటనలో పరశురాములు ఎడమ కాలి తొడ పక్క నుంచి బుల్లెట్‌ దూసుకెళ్లడంతో గాయాలయ్యాయి. రిజిస్ట్రేషన్‌ అనంతరం కార్యాలయం నుంచి బయటికి వచ్చిన నర్సయ్య పోలీసులకు సమాచారం అందించారు. పరశురాములును సిద్దిపేట సర్వజన ఆసుపత్రికి తరలించారు. నిందితులను పట్టుకునేందుకు 15 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని, టాస్క్‌ఫోర్సును రంగంలోకి దింపామని సిద్దిపేట పోలీసు కమిషనర్‌ శ్వేత తెలిపారు. పట్టణవ్యాప్తంగా సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నామని చెప్పారు. కాగా, కొనుగోలుదారు శ్రీధర్‌రెడ్డిపైనే స్థిరాస్తి వ్యాపారి నర్సయ్య అనుమానం వ్యక్తంచేశారు. డబ్బు లావాదేవీల విషయం తమ ఇద్దరికి మాత్రమే తెలుసునన్నారు. అడ్వాన్సు చెల్లించిన తరువాత ఇద్దరి మధ్య స్థలం విషయంలో భేదాభిప్రాయాలు వచ్చాయన్నారు. వాస్తు సహా సెట్‌బ్యాక్‌కు అనుగుణంగా స్థలం లేదని, ఇతర సాకులు చెప్పడంతో రూ. 1.28 లక్షలు తగ్గించినట్లు చెప్పారు. తనపై ఆరోపణలు అవాస్తవమని, ఎలాంటి విచారణకైనా సిద్ధమని శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు దోపిడీకి పాల్పడ్డారని స్థల విక్రేత నర్సయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్‌ సీఐ భిక్షపతి తెలిపారు.


ఇదీ చదవండి:ఏటీఎం ఎత్తుకెళ్లి ధ్వంసం చేసిన దొంగలు

Last Updated :Feb 1, 2022, 10:57 AM IST

ABOUT THE AUTHOR

...view details