తెలంగాణ

telangana

Telugu Akademi Scam Updates : రూ.90 లక్షలతో ఓ ఫ్లాట్‌ కొన్నా... రూ.80 లక్షల నోట్ల కట్టలు కాల్చేశా...

By

Published : Oct 14, 2021, 8:15 AM IST

తెలుగు అకాడమీ ఫిక్స్​డ్ డిపాజిట్ల(Telugu Akademi FD Scam Updates) పేరిట కోట్ల రూపాయలు కాజేసిన నిందితులు.. దర్యాప్తులో చెప్పే విషయాలు విని అధికారులు నివ్వెరపోతున్నారు. నమ్మశక్యంకాని విషయాలు చెబుతూ అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. భయంతో రూ.80 లక్షల నోట్ల కట్టలు కాల్చేశానని ఒకరు చెబుతుంటే.. 5 ఏళ్ల క్రితం చేసిన అప్పు కట్టానని మరొకరు అంటున్నారు. మిగిలిన నిందితులూ ఇలాంటి కట్టుకథలే చెబుతున్నట్లు తెలుస్తోంది.

Telugu Akademi Scam Updates
Telugu Akademi Scam Updates

‘‘నేను నిజమే చెబుతున్నా. సాయికుమార్‌ ముఠాతో నాకు పెద్దగా సంబంధాలు లేవు. వారికి సహకరించినందుకుగానూ నా వాటాగా పొందిన డబ్బును నెల రోజుల క్రితం వరకూ ఇంట్లోనే ఉంచుకున్నా. వైజాగ్‌లో రూ.90 లక్షలతో ఓ ఫ్లాట్‌ కొన్నా. హైదరాబాద్‌లో మరో ఫ్లాట్‌ కొనేందుకు ప్రయత్నాలు చేస్తుండగా, తెలుగు అకాడమీ అధికారులు పోలీసులకు ఫిర్యాదుచేసినట్టు తెలిసింది. భయంతో రూ.80 లక్షల నోట్ల కట్టలు కాల్చేశా...’’

- తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల గోల్‌మాల్‌(Telugu Akademi FD Scam Updates) వ్యవహారంలో రూ.64.05 కోట్లు కొల్లగొట్టిన నిందితుల్లో ఒకరు దర్యాప్తు అధికారులతో చెప్పిన మాటలివి.

‘‘నోట్ల కట్టలు కాల్చాల్సిన అవసరమేంటి’ అని ప్రశ్నిస్తే ‘‘ఏమో అప్పుడలా అనిపించింది సార్‌! తగలబెడితే రుజువులు లేకుండాపోతాయనే అలా చేశానంటూ’ అతనిచ్చిన సమాధానం దర్యాప్తు అధికారులను నివ్వెరపరిచింది. అతనొక్కడే కాదు..నిందితులందరూ దాదాపు ఇలాంటి నమ్మశక్యంకాని విషయాలే చెప్పినట్టు సమాచారం. ‘ఓ స్నేహితుడికి అవసరానికి రూ.20 లక్షలు ఇచ్చానని, అతను ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేశాడని ఒకరు..ఐదేళ్ల క్రితం చేసిన అప్పు ఇప్పుడు రూ.50 లక్షలయిందని, ఆ మొత్తం ఇటీవలే చెల్లించానని ఇంకొకరు’ చెప్పారని విశ్వసనీయంగా తెలిసింది. స్థిర, చరాస్తుల స్వాధీన ప్రక్రియ నుంచి తప్పించుకునేందుకే వాళ్లు ఇలా చెబుతున్నట్టు అనుమానిస్తున్న దర్యాప్తు అధికారులు..మరోసారి కస్టడీకి తీసుకుని వారి నుంచి నిజాలు రాబట్టాలని నిర్ణయించారు.

రూ.20 కోట్ల ఆస్తి పత్రాలు.. నగదు స్వాధీనం

మరోవైపు నిందితులు దారిమళ్లించిన సొమ్ము స్వాధీన ప్రయత్నాలను ఏసీపీ మనోజ్‌ కుమార్‌ నేతృత్వంలోని దర్యాప్తు అధికారులు ముమ్మరం చేశారు. నిందితులు పొంతనలేని సమాధానాలు చెబుతుండటంతో వేర్వేరు మార్గాల్లో వివరాలు సేకరించారు. కొందరు ఫ్లాట్లు, స్థలాలు కొనుగోలు చేసినట్టు, మరికొందరు వారి పిల్లల పేర్లమీద ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు(Telugu Akademi FD Scam Updates) చేసినట్టు తెలుసుకున్నారు. ఇంకొందరు నగదును వేర్వేరు బ్యాంకుల్లో తమ స్నేహితులు, పరిచయస్తుల ఖాతాల్లో జమ చేసినట్టు గుర్తించారు. యూబీఐ, కెనరా బ్యాంకుల మాజీ మేనేజర్లు మస్తాన్‌ వలీ, సాధన కొనుగోలుచేసిన ఆస్తుల పత్రాలు, నండూరి వెంకటరమణ తణుకులో నిర్మించిన బహుళ అంతస్తుల భవనం తాలూకూ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. సాయికుమార్‌, డాక్టర్‌ వెంకట్‌, రాజ్‌కుమార్‌, సత్యనారాయణరావు, పద్మావతిల నుంచి రూ.లక్షల్లో నగదు స్వాధీనపరుచుకున్నారు. మొత్తంగా 14 మంది నిందితుల నుంచి రూ.17 కోట్ల విలువైన స్థిరాస్తి పత్రాలు, రూ.3 కోట్ల నగదును ఇప్పటివరకూ స్వాధీనంచేసుకున్న దర్యాప్తు బృందం..వాటిని కోర్టుకు స్వాధీనపరిచేందుకు వీలుగా ప్రభుత్వం నుంచి అభ్యర్థన పంపించనుంది.

బ్యాంకులు రూ.64.05 కోట్లు ఇవ్వాల్సిందేనా?

తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల గోల్‌మాల్‌(Telugu Akademi FD Scam Updates) వ్యవహారంలో దుర్వినియోగమైన రూ.64.05 కోట్లు తిరిగి వచ్చే అవకాశాలున్నట్టు దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. అకాడమీ అధికారులు యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కెనరా బ్యాంక్‌ ప్రాంతీయ కార్యాలయ అధికారులకు ఫిర్యాదు చేస్తే.. ఆయా బ్యాంకులు రూ.64.05 కోట్ల సొమ్మును జమ చేయకతప్పదని’ ఓ పోలీస్‌ అధికారి తెలిపారు.

సంబంధిత కథనాలు :

ABOUT THE AUTHOR

...view details