తెలంగాణ

telangana

బైక్​పై లిఫ్ట్ అడిగాడు.. ఆపగానే ఇంజిక్షన్ ఇచ్చి హత్యచేశాడు.. ఆ తర్వాత..!

By

Published : Sep 19, 2022, 12:43 PM IST

Updated : Sep 19, 2022, 6:00 PM IST

Man killed a biker in Khammam

Man killed a biker in Khammam : మంచికి పోతే చెడు దాపురించడమంటే ఇదేనేమో.. తాను లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి రూపంలోనే మృత్యువు ఎదురొస్తుందని ఊహించలేదు. వాహనాల రద్దీ లేని రహదారి కదా అని సాటిమనిషికి సాయం చేద్దామనుకుంటే.. అతడే కాలనాగై సూదిమందు రూపంలో కాటేయడంతో మృత్యుఒడికి చేరిన విషాదాంతమిది. మానవత్వంతో లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తిపైనే సూదిమందు దాడిచేసి హతమార్చాడో దుండగుడు. ఖమ్మం జిల్లాలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటనతో.. మృతుడి కుటుంబాన్ని తీరనిశోకంలోకి నెట్టగా.. మిస్టరీగా మారిన కేసును చేధించడం పోలీసులకు సవాల్‌గా మారింది.

Man killed a biker in Khammam : ఖమ్మం జిల్లా చింతకాని మండలం బొప్పారం గ్రామానికి చెందిన జమాల్ సాహెబ్ ఏపీలోని జగ్గయ్యపేట మండలం గండ్రాయిలో ఉంటున్న కూతురు ఇంటికి బైక్​పై బయలుదేరాడు. ముదిగొండ మండలం వల్లభి కాటమయ్య దేవస్థానం సమీపంలోకి రాగానే రోడ్డుపై నిలిచి ఉన్న ఓ వ్యక్తి చేయిచూపి జమాల్ సాహెబ్‌ను లిఫ్ట్ అడిగాడు. సాటిమనిషికిసాయం చేద్దామన్న సదుద్దేశంతో జమాల్ సాహెబ్ గుర్తుతెలియని వ్యక్తికి లిఫ్ట్ ఇచ్చారు.

ఆ తర్వాత బైక్ కదిలి 100 మీటర్లు వెళ్లిందో లేదో... గుర్తు తెలియని వ్యక్తి బైక్ దిగి మరో బైక్​పై వెళ్లిపోయాడు. కొద్దిసేపటికే కిందపడిపోయిన జమాల్ సాహెబ్‌ను గమనించిన స్థానికులు వల్లభి ఆరోగ్య కేంద్రానికి తరలించారు. తాను లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి తనకు ఇంజిక్షన్ చేశాడని బాధితుడు స్థానికులకు చెప్పాడు. తన కుటుంబీకులకు ఫోన్ చేయమని వారికి సెల్ ఫోన్ కూడా ఇచ్చాడు. స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాతపడ్డాడు.

ఎవరికీ అంతుచిక్కని రీతిలో చోటు చేసుకున్న ఈ ఘటనతో జమాల్ సాహెబ్​ కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు. జమాల్ సాహెబ్‌కు ఎవరితోనూ వ్యక్తిగత కక్షలు లేవని, ఎలా చనిపోయాడో అర్థం కావడం లేదని రోదిస్తున్నారు. ఘటనా స్థలిలో ద్విచక్రవాహనంతోపాటు సూది దొరకడం అనేక అనుమానాలకు తావిస్తోంది. సూది మందుతో హత్యకు ఎవరు పాల్పడ్డారనేది మిస్టరీగా మారింది. అసలు లిప్ట్ అడిగిన వ్యక్తి ఎవరు. జమాల్ సాహెబ్‌ను ఎందుకు చంపాల్సి వచ్చింది. ఇంజిక్షన్‌తో విషం ఇచ్చారా లేక మరేమైనా ఉంటుందన్నది అంతుచిక్కడం లేదు. జమాల్ సాహెబ్ మృతి మాత్రం అనుమానంగానే ఉందని పోలీసులు భావిస్తున్నారు. జమాల్ మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

సూదితో వ్యక్తిని హతమార్చిన ఘటన స్థానికులతోపాటు జిల్లా వాసుల్ని భయభ్రాంతులకు గురిచేస్తోంది. హత్య కేసును పోలీసులు త్వరితంగా చేధించాలని కోరుతున్నారు.

ఇవీ చదవండి..

Last Updated :Sep 19, 2022, 6:00 PM IST

ABOUT THE AUTHOR

...view details