తెలంగాణ

telangana

Suicide: 'అవమానమే ఆయువు తీసింది... ఆలస్యంగా వెలుగులోకొచ్చింది'

By

Published : Aug 4, 2021, 8:41 PM IST

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. డబ్బుల కోసం వేధింపులకు గురి చేయడాన్ని అవమానంగా భావించిన బాధితుడు ఉరివేసుకుని ప్రాణాలొదిలాడు.

suicide
నిజామాబాద్

డబ్బుల కోసం వేధిస్తున్నారని అవమానంగా భావించిన ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. డబ్బులు కోసం వేధించడం... బాధితుడి భార్య మెడలోని పుస్తెలతాడును లాక్కొని వెళ్లడాన్ని అవమానంగా భావించి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

నిజామాబాద్​ నగరంలోని దుబ్బకు చెందిన నాగరాజు... గంజ్ ఏరియాలో గుమాస్తాగా పనిచేసేవాడు. కోనసముందర్ గ్రామానికి చెందిన బాదాం శ్రీనివాస్​కు చెందిన ధాన్యాన్ని సేకరించి అమ్మగా వచ్చిన డబ్బులను చెల్లించాడు. ఇంకా రూ.లక్షా 20 వేలు ఇవ్వాల్సి ఉంది. దీంతో బాదం శ్రీనివాస్, ఆర్యనగర్​కు చెందిన లక్ష్మీనారాయణ నాగరాజును వేధించసాగాడు. నాగరాజు కొత్తగా కొనుగోలు చేసిన ద్విచక్రవాహనాన్ని లాక్కుని చితకబాదారు.

అప్పుడే మనస్తాపం చెందిన నాగరాజు... గోదావరిలో దూకి చనిపోవాలనుకున్నా కుటుంబ సభ్యులు ఆపారు. బుధవారం తెల్లవారుజామున దుబ్బలోని నాగరాజు ఇంట్లోకి ప్రవేశించిన బాదం శ్రీనివాస్, లక్ష్మీనారాయణలు డబ్బుల కోసం అతనితో గొడవ పడ్డారు. చివరకు నాగరాజు భార్య మెడలో నుంచి బంగారు పుస్తెల తాడును బలవంతంగా లాక్కెళ్లారు.

ఈ అవమానం భరించలేకపోయిన నాగరాజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో పడకగదిలో ఉరేసుకున్నాడు. బాధిత కుటుంబ సభ్యులు, కాలనీ వాసులు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. సుమారు 200 మంది పోలీస్ స్టేషన్ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి నాగరాజు కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేయడంతో పాటు ఆయన మరణానికి కారకులైన బాదం శ్రీనివాస్, లక్ష్మీనారాయణలను కఠినంగా శిక్షించాలని కోరారు.

'డబ్బులు ఇచ్చేందుకు మా బావ కొద్ది రోజుల గడువు అడిగాడు. అయినా కూడా వాళ్లు వినలేదు. కొత్తగా కొన్న బండి తీసుకెళ్లారు. మా బావపై దాడి చేశారు. మళ్లీ ఉదయం నాలుగు గంటలకు మా బావ వాళ్ల ఇంటికి వచ్చి దాడికి పాల్పడ్డారు. మా అక్క మెడలో ఉన్న మంగళసూత్రం లాక్కెళ్లారు. మా బావ ఇదంతా చూడలేక ఇంట్లోకి వెళ్లి ఉరివేసుకుని ప్రాణం తీసుకుండు.'

-- మృతుని బావమరిది

ఇదీచూడండి:కొవిడ్​ మరణాల లెక్కలపై కేంద్రం క్లారిటీ

ABOUT THE AUTHOR

...view details